mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కంటిచూపు లేకున్నా ఎన్నో అద్భుతాలు!

5 గంటల క్రితం

jeevana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 06:10 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఆమె పుట్టుకతో అంధురాలు. అయినా నిరంతర సాధన చేత అనేక విషయాల్లో నైపుణ్యం సాధించారు. సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉద్యోగినిగా, రచయిత్రిగా, రేడియో జాకీగా రాణిస్తున్నారు. స్క్రీన్ రీడర్లు, టాక్‌బ్యాక్ వంటి పరికరాల సాయంతో ఫోన్ వినియోగం, ఈమెయిల్, వాట్సాప్ సందేశాల నిర్వహణ, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఆన్‌లైన్ షాపింగ్, టికెట్ బుకింగ్, బ్యాంకింగ్ సేవలు, సోషల్ మీడియా వినియోగం వంటి పనులను స్వయంగా నిర్వహిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శారీరకంగా ఆటంకాలు ఉన్నా పట్టుదలతో, సాధనతో రాణించవచ్చని నిరూపించిన సాయిజ్యోతి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆమె చింతక్రింది సాయిజ్యోతి.


గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన చింతక్రింది రవి, విజయలక్ష్మి దంపతుల కుమార్తె సాయిజ్యోతి. పుట్టుకతోనే కంటిచూపు లేదు. కుమార్తె స్థితి చూసి, తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. ఆ తర్వాత ఈ సమస్యను ఎలాగైనా అధిగమించి కుమార్తెను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని భావించారు. చదువే జ్ఞానానికి మార్గమని భావించి విజయవాడలోని విజయమేరీ అంధ బాలికల పాఠశాలలో చేర్చారు. అక్కడ ప్రాథమిక విద్య పూర్తయింది. ఆ తరువాత చదువు నిరంతరాయంగా సాగింది. సాయిజ్యోతి పట్టుదలగా తన విజ్ఞానాన్ని పెంచుకుంటూ సాగారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆమెకు మంచి పట్టు ఉంది. ఎంఏ ఎకనామిక్స్‌ను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. అనంతరం విభిన్న ప్రతిభావంతుల కోటాలో మంగళగిరి మండలం నూతక్కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు.

నిరంతరం కొత్త విషయాలు తెలుసుకోవటం, రాయటం ఆమెకు ఎంతో ఇష్టం. బ్రెయిలీ లిపితో పాటు వాయిస్ ఇన్‌పుట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రచనలు చేస్తున్నారు. ఇన్‌పుట్ కీబోర్డులపై టైప్ చేయడం, స్క్రీన్ రీడర్ ద్వారా వాటిని విని అవసరమైన సవరణలు చేసుకోవడం ఆమెకు అలవాటే. చైత్రశ్రీ కలం పేరుతో "కవితాంజలి" కవితా సంపుటితో పాటు "మంచు తాకిన ప్రేమ", "ఎవరు అతను", "చేయి వీడని చెలిమి" నవలలు, సామాజిక స్పృహ కలిగించే కథలు రచించారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు సాహిత్య సృష్టిని కొనసాగిస్తున్నారు.


సాంకేతికతపై పట్టు

ప్రత్యేక శారీరక సవాళ్లను (దృష్టిలోపం) అధిగమించి ఆధునిక సాంకేతికతపై పట్టుదలతో ఆమె ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారు. రేడియో జాకీగా తెలుగు ఎన్నారై రేడియోలో "ఇంద్రధనస్సు" (విత్ ఆర్జే జో) పేరుతో షోను నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలను అలరిస్తూ, విభిన్న సామాజిక, సాంస్కృతిక, స్ఫూర్తిదాయక అంశాలపై కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

సాయిజ్యోతి ఇప్పటివరకు మూడు నవలలు, 60కి పైగా కవితలు, 20కి పైగా పాటలు, 15 చిన్న కథలు రచించారు. ఆమె రచించిన "చేయి వీడని చెలిమి" నవలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. "కవితాంజలి" కవితల సంపుటిని ఫిబ్రవరి 2025లో విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యక్రమంలో ఐపీఎస్ రవి ప్రకాష్, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి. రవీంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. లూయిస్ స్ఫూర్తి అనే వాట్సాప్ సమూహం సహాయ సహకారాలతో ఈ పుస్తకాల ప్రచురణ జరిగింది. "అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ" అనే యూట్యూబ్ ఛానల్‌ను స్నేహితుల సహాయంతో నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఆమె రచనలు, పాటలు మరింత మంది పాఠకులు, శ్రోతలకు చేరుతున్నాయి. తనలాంటి దృష్టిలోపం ఉన్నవారికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించే సందేశాలను కూడా పంచుకుంటున్నారు.


రచయిత్రిగా ఎదగాలని ఆశిస్తున్నా...

"అంధత్వంతో ఉన్నామని ఏమాత్రం బాధపడొద్దు. ఎలాంటి సవాలునైనా సానుకూల దృక్పథంతో ఎదుర్కొంటే విజయతీరాలకు చేరొచ్చు. నా వరకూ నేను రచయితగా మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని ఆశిస్తున్నా. 'చేయి వీడని చెలిమి' కథ సినిమాగా వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మా సమూహం ద్వారా రచనలు మంచి స్ఫూర్తిని అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది."

- చింతక్రింది సాయి జ్యోతి జూనియర్ అసిస్టెంట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నూతక్కి.


​పలు అవార్డులు

పలు కవితల పోటీల్లో ప్రశంసాపత్రాలు, ఆడియో కథల పోటీలో అరసవల్లి అనిల్‌కుమార్ పురస్కారం, "మంచు తాకిన ప్రేమ" నవలకు ప్రతిలిపి సాహిత్య పురస్కారం, 2025 బెస్ట్ ఉమెన్ ఇన్ పోయెట్రీ అవార్డు, 2026 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ పోయెట్రీ ప్రతిభా పురస్కారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎఐ స్మార్ట్ కళ్లజోడు స్వీకారం వంటి గుర్తింపులు అందుకున్నారు.

- యడవల్లి శ్రీనివాసరావు​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్