mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అవమానకరం!

2 గంటల క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 06:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

దేశాల మధ్య ఉన్న సంబంధాలను వ్యక్తిగత పొగడ్తల స్థాయికి దిగజార్చటం బయటికి ఓ ప్రహసనంలా కనిపిస్తోంది. కానీ, వాస్తవంగా దాని వెనుక ఉన్నది వ్యాపార నీతి! మాటల్లో ఆకాశానికెత్తి, చేతల్లో చాకచక్యమూ, సొంత లాభమూ చూసుకోవటం అమెరికా దౌత్య విధానం. దానిలో చిక్కుకొని మన దేశ సార్వభౌమత్వానికి, స్వతంత్రతకీ తీరని నష్టం కలిగిస్తోంది బిజెపి నేతృత్వంలోని నరేంద్ర మోడీ పాలన! జి-7 దేశాల సమావేశాల సందర్భంగా కెనడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మన ప్రధాని నరేంద్ర మోడీ జరిపిన సంభాషణ, విలేకరుల సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యలూ రెండు పెద్ద దేశాల మధ్య సమస్థాయికి అద్దం పట్టేవిగా లేకపోవటం శోచనీయం. మోడీని ట్రంప్ ‘అందమైన మనిషి’, ‘ఏంజిల్’ అని పొగడడం, భారతదేశానికి సమస్య వస్తే - తాను రక్షణగా ఉంటానంటూ సంరక్షకుడి స్థానం తీసుకోవడం అభ్యంతరకరం. దీనిని ప్రాణాలకు తెగించి దేశ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న మన త్రివిధ దళాలను అవమానించడంగా భావించాలి. ఇలాంటి ధోరణికి తందానతాన అన్నట్టు మోడీ వ్యవహరించటం దేశానికి హానికరం.

డొనాల్డ్ ట్రంప్ ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. మోడీ కూడా ‘మై డియర్ ఫ్రెండ్’ అంటూ పరవశించటం కొత్త కాదు. 2019 సెప్టెంబర్ 22న అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిన ‘హౌడీ మోడీ’ సభలో నరేంద్ర మోడీ "అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్" అన్నారు. భారత ఎన్నికల్లో బిజెపి ఉపయోగించిన నినాదాన్ని అమెరికా ఎన్నికల వేదికపై పునరావృతం చేశారు. మన దేశ ప్రధాని మరో దేశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి ప్రచారం చేయటం సమంజసం కాదనే అభ్యంతరాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. 2020 ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లో జరిగిన "నమస్తే ట్రంప్" కార్యక్రమంలో ట్రంప్ మోడీని "ప్రపంచంలోని గొప్ప నాయకుల్లో ఒకరు" అని కొనియాడగా, మోడీ అంతే స్థాయిలో ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. సరే, అమెరికాతో ఇంతగా పూసుకుతిరగటం వల్ల మన దేశానికి ఏమన్నా ఒరిగిందా? 2019 జూన్‌లో అమెరికా భారత్‌కు ఉన్న జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జిఎస్‌పి) హోదాను రద్దు చేసింది. దీని వల్ల భారత ఎగుమతిదారులు వందల కోట్ల విలువైన రాయితీలను కోల్పోయారు. అమెరికా తన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మన దేశం తన మాట విని తీరాలన్నట్టుగానే ఈ కాలమంతా వ్యవహరించింది. రష్యా నుంచి తగ్గింపు ధరలకు చమురు కొంటుంటే - వద్దని నిర్దేశించింది. సుంకాలు భారీగా విధించింది. మన రైతాంగానికి నష్టం కలిగించే వ్యవసాయోత్పత్తుల దిగుమతి ఒప్పందానికి మోడీని ఒప్పించింది.

ఈ కాలంలో మన విదేశాంగ విధానం కూడా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా మారిపోయింది! దశాబ్దాల పాటు ఐక్యరాజ్యసమితి వేదికలపై పాలస్తీనా ప్రజల స్వీయ నిర్ణయాధికారానికి మద్దతు తెలిపిన దేశం మనది. కానీ గాజాలో ఇజ్రాయిల్ అమానుష దాడుల ఫలితంగా వేలాది పౌరుల మరణాలు సంభవించినా మోడీ నోరు మెదపలేదు. ఇంధన భద్రత, చాబహార్ పోర్టు, మధ్య ఆసియాతో అనుసంధానం వంటి అంశాల్లో ఇరాన్ భారతదేశానికి కీలక భాగస్వామి. అయినప్పటికీ ఇరాన్‌‌పై అమెరికా దాడుల సమయంలో భారత్ తగిన స్పందన చూపలేదు. అమెరికా అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు, ప్రాంతీయ సైనిక చర్యలకు వ్యతిరేకంగా ఒక్క మాటా మాట్లాడలేదు. ఇంకా బాధాకరమైన విషయం - ఇటీవల అమెరికా దాడిలో భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై మోడీ తగినంత గట్టిగా మాట్లాడకపోవడం! ఇరాన్‌పై దాడికి వెళ్లి ఆ భూభాగంలో చిక్కుకుపోయిన సైనికుడిని రక్షించుకోవటానికి అమెరికా వాయుసేన కదలివచ్చిందంటూ మన మీడియా ఘనంగా కథనాలు రాసింది. మరి ఏ యుద్ధంతోనూ సంబంధం లేకుండానే మన నావికులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతే - మన స్పందన ఎంత వేగంగా, ఎంత గట్టిగా ఉండాలి? ఆ దాడికి కారణం అమెరికా అయినందుకు మన ప్రధాని నోరు పెగలకపోవటం ఎంత దారుణం!

మనది 140 కోట్ల మంది ప్రజలు ఉన్న సార్వభౌమ, సర్వసత్తాక, స్వతంత్ర దేశం. వలస పాలనకు వ్యతిరేకంగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా ఏకతాటిపై నిలిచి పోరాడిన వారసత్వం. దానికి తగినట్టుగా పాలకులు వ్యవహరించటం దేశానికి గౌరవం. అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశం మనల్ని తక్కువగానో, లోకువగానో చూస్తే తగు విధంగా స్పందించాలి. "భారతదేశ రక్షణ మేము చూసుకుంటాం" అనే భాష ట్రంప్ వినిపించడం అహంకారమైతే, మౌనంగా స్వీకరించడం మోడీ లొంగుబాటు వైఖరికి నిదర్శనం అవుతుంది. భారత విదేశాంగ విధానం ఏ దేశానికీ తోకగా కాకుండా, భారత ప్రజల ప్రయోజనాలకు, గౌరవానికి ప్రతినిధిగా ఉండాలి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్