మర్యాద దుస్తుల్లో అమర్యాదస్తులు
వాళ్ల చేతుల్లో లాఠీ బుసలు కొడుతూ
బూతులు వడ్డిస్తుంది!
చేతులు చేతల గట్లు తెగి
లంచం డిబ్బి గలగల శబ్దం చేస్తూ
న్యాయాన్ని అంగడి సరుకు బేరం పెడుతుంటుంది
భయం భయంగా ఒక్కో మెట్టు
పోలీసు స్టేషన్కు ఎక్కుతున్నప్పుడు
వాళ్ల కరకు మాటలు
పాదాలకు ఎరుపు బొబ్బలు పూయిస్తాయి
కొరకంచు చూపులు పదునుగా
దేహాన్ని సర్రున కోస్తాయి
అక్కడ క్రిమినల్స్, గూండాలకు
గౌరవాదరాలు, పూలదండల సత్కారాలు
ఎప్పుడూ స్వాగతగీతాలు పాడుతుంటాయి
అదో కొత్త దందా లోకం
జేబు బరువుతో న్యాయం తూగుతుంది..
చట్టం, ధర్మం, న్యాయం
మోకాళ్లమీద నిలబడ్డ నిరపరాధ ఖైదీల్లా
ఊచల మధ్య ఇరుక్కుని
జీవితకాలం శిక్షగా బేల చూపులు పారేసుకుంటాయి
ఎన్ని నిరుపేద కంఠాల ఘోష
బూట్లు తొడిగిన యమకింకరుల కాళ్ల కింద
కర్కశంగా చీల్చబడ్డాయో..
ఇంకెందరు న్యాయస్తుల కన్నీళ్లు
ఆ టోపీ చాటున ఇంకిపోయాయో..
భద్రమనుకున్న చోట
ఎంత అభద్రతా చీకటి
ఎందరిని మింగేసిందో..
ఆ ముగింపు కథలు వింటే
దుఃఖం కమ్ముకొస్తుంది!
పోలీసని నమ్మినందుకు దక్కిన బహుమానం
లాకప్ డెత్లు, సంకెళ్ల ఉచ్చులు...
లంజా.. లవిడా.. అనే అసహ్య రూపకాలు..
పాచిపట్టిన నాలికమీద నుంచి దొర్లే
మా నామవాచకాలవుతాయి
మా పల్లెల మీద మూడో నేత్రం తెరిచి
గుడిసెల్ని భస్మీపటలం చేస్తాయి..
భుజాన వేలాడే స్టార్లు ఉన్నోడికి
సెల్యూట్ చేయడానికే
సింహ తలాటాన్ని తాకట్టు పడుతుంటాయి
వాళ్లు న్యాయానికి ప్రతిరూపాలు కాదు
అన్యాయాల సెర్చ్ వారెంట్లు
చట్టం పుస్తకాలకు పట్టిన చిమ్మెట్లు..!
- నేలపూరి రత్నాజీ
89199 98753







కామెంట్లు (0)