జీవితం నీరులేని నారైనపుడు
ఆశ ఇంకిపోతుంది
బతుకు నిండా మునిగిన పంటైనపుడు
కోర్కెలు కొట్టుకుపోతాయి
వరదయినా వడగాడ్పయినా
రైతుకి కారేది కన్నీరే
తుఫానైనా ఎల్నినోనైనా
రైతుకి మిగిలేది పొల్లే -
భూమి బీటలు బారుతోంది
భూమి సెగలు కక్కుతోంది
పచ్చదనాన్ని తాకట్టుపెట్టినట్టుంది ప్రకృతి
వాగ్దాన వరదలతో నిండుకున్న నదులు, చెరువులు
ధనదాహమే తప్ప
భూమి దాహం తీర్చలేవా?
డేములు, ప్రాజెక్టులు
పంటపోలాల పగుళ్ల నోళ్లలో ప్రవహించలేవా
రైతు పాదాల్ని తాకలేవా?
పొలాల్లో కాలువలు ప్రవహించవు
విత్తిన కోర్కెలు మొలకెత్తవు
పగుళ్ళు - గుండెపోట్లు
పొలాల పగుళ్ళు రైతుల గుండెపోట్లే
నీరులేక సచ్చిన నారు
రైతుల అస్థిపంజర రూపాలే!
పాలకుల వాగ్దానాలు ఆవిరై ఎగిరిపోతున్నాయి
మేనిఫెస్టోలు నీరులేని నూతుల్లో దాక్కుంటున్నాయి
తుఫాను షెల్టర్లలో తలదూర్చేస్తుంటాయి
విపత్తుల్లో కొట్టుకుపోతుంటాయి
కొత్త సమస్యల సృష్టిలో పాలకుల ఎజెండాలు,
జెండారంగులు మారుతుంటాయి
అస్సలు సమస్యలు అటకెక్కుతాయి -
ఎండైనా, వానైనా,
వరదయినా, వడగాడ్పుయినా
తుఫానైనా, ఎల్ నినో అయిన
భూమి మౌనంగానే ఉంటుంది
అస్థిపంజరాలు మౌనంగానే ఉంటాయి
వాగ్దానాలు మౌనంగానే ఉంటాయి
సచ్చిపడున్న వరిదుబ్బు మౌనంగా ఉంటుంది
కానీ... ఆకలో!?
ఆకలి మౌనంగా వుంటుందా!!
- బొడ్డ కూర్మారావు, 99595 00360







కామెంట్లు (0)