క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ నుంచి నితేశ్ తివారీ ‘రామాయణం’ వరకు.. భారీ ఇతిహాస చిత్రాలు తెరపైకి వస్తున్న సమయంలో యాన్ కార్సన్‌కు నోబెల్ బహుమతి రావడం గమనించదగ్గ విషయం. ఒకప్పుడు భారతీయ సంప్రదాయంలో భాగంగా ఉన్న సృజనాత్మక స్వేచ్ఛను మనం దురదృష్టవశాత్తూ కోల్పోయాం. రామాయణం వందలాది రూపాల్లో ఉంది. సంస్కృతం, తమిళం, బెంగాలీ భాషల్లోనే కాకుండా జైన, బౌద్ధ సంప్రదాయాల్లో, జానపద కథల్లో, ఆగ్నేయాసియా దేశాల్లోనూ భిన్న రూపాల్లో కనిపిస్తుంది. కొన్ని కథల్లో సీత రావణుడి కుమార్తె కాగా, మరికొన్నింటిలో రావణుడే విషాద నాయకుడు. ఈ కథనాలు పరస్పరం సంభాషించుకుంటూ కొత్త అర్థాలను సంతరించుకున్నాయి. ఈ వైవిధ్యమే ఆ కథను రెండు వేల సంవత్సరాలుగా సజీవంగా ఉంచింది. పండితుడు ఏ.కె. రామానుజన్ తన ‘త్రీ హండ్రెడ్ రామాయణాస్’ వ్యాసంలో ఇదే విషయాన్ని వివరించారు. అయితే, 2011లో కొందరి నిరసనల నేపథ్యంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆ వ్యాసాన్ని చరిత్ర పాఠ్యప్రణాళిక నుంచి తొలగించింది.
మన ఇతిహాసాలను మళ్లీ చదివి, వాటితో చర్చిస్తూ, కొత్త అర్థాలను వెతికే సాహిత్యంగా చూడటానికి బదులుగా.. కదపటానికే వీల్లేని గ్రంథాలుగా పరిగణించే ధోరణి పెరుగుతోంది. మన సంస్కృతిని, విశ్వాసాలను అనుసంధానించే సంభాషణలుగా ఉండాల్సిన ఇతిహాసాలు మార్పులేని బోధనలుగా మారిపోతున్నాయి. సినిమా దర్శకుడు ఒక పాత్రకు ఎంచుకున్న దుస్తులే వివాదానికి దారితీయవచ్చు. నవలాకారుడు కథను కొత్తగా వ్యాఖ్యానిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ కథలు కోట్లాది మందికి ముఖ్యమైనవే. కానీ వాటిపై చర్చకు తావివ్వకుండా, కథల్లోని ఖాళీలను, అసంపూర్ణతను అంగీకరించకుండా ఉంటే.. అవి మూసలో బిగుసుకుపోయే ప్రమాదం ఉంది. రామాయణం, మహాభారతం రెండు వేల సంవత్సరాలుగా నిలిచాయి అంటే, వాటిని ప్రతిసారీ ఒకే విధంగా చెప్పడం వల్ల కాదు. రాబోయే రోజుల్లో ఈ ఇతిహాసాల కొత్త కథనాలు జెన్ జెడ్, ఆల్ఫా, బీటా తరాలతో సంభాషించాలి.
భారతీయ భాషల్లోనూ, ఆంగ్లంలోనూ ఇతిహాసాల పునఃకథనాలు పెరుగుతున్నాయి. వాటిని చదవడానికి ఆసక్తి చూపే పాఠకులూ ఉన్నారు. అయితే, కార్సన్ తరహాలో సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసి, దాన్ని కొత్తగా వ్యాఖ్యానించే ఆత్మవిశ్వాసం మనకూ అవసరం. ఒక ఇతిహాసాన్ని కొత్తగా చెప్పడం దానిపై గౌరవాన్ని తగ్గించదు. పైగా, దానిలోని అంతర్లీన అర్థాలను మరింత లోతుగా తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన సాహిత్య అధ్యయన విభాగాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. విశ్వవిద్యాలయాలు గ్రీకు, లాటిన్ భాషల కోర్సులను తగ్గిస్తున్నాయి. ఈ ఏడాది చికాగోలోని లయోలా విశ్వవిద్యాలయంలో ఆ భాషల్లో డిగ్రీ కోర్సులను నిలిపివేసే ప్రక్రియ మొదలైంది. కార్సన్ స్వదేశమైన కెనడాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బడ్జెట్ కోతల కారణంగా 182 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉన్నత స్థాయి గ్రీకు, లాటిన్ కోర్సులు ముగిసిపోయే ప్రమాదం ఉందని క్వీన్స్ విశ్వవిద్యాలయం 2024లో హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాచీన సాహిత్య పండితురాలికి నోబెల్ బహుమతి రావడం ఆ రంగం ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తోంది. ప్రాచీన సాహిత్యం సజీవంగా ఉండాలంటే దాన్ని అర్థం చేసుకునే పరిజ్ఞానంతోపాటు, కొత్తగా వ్యాఖ్యానించే ధైర్యం కూడా ప్రతి తరానికీ ఉండాలి. మనమూ మన సంప్రదాయాలను ప్రశ్నిస్తూ, వాటిలోని కొత్త అర్థాలను వెతికే ధైర్యాన్ని తెచ్చుకోవాలి.
(‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో ఐశ్వర్య ఖోస్లా వ్యాసానికి సంక్షిప్త రూపం)








కామెంట్‌లు (0)