కెనడా కవయిత్రి అన్నే కార్సన్‌కు 2026 సంవత్సరపు సాహిత్య నోబెల్ బహుమతి లభించింది. ప్రాచీన గ్రీకు సాహిత్యంపై లోతైన పట్టు, సమకాలీన జీవితంపై సునిశితమైన పరిశీలన, భాషతో వినూత్న ప్రయోగాలు చేయగల సృజనాత్మకత ఆమెను ప్రత్యేకమైన రచయిత్రిగా నిలబెట్టాయి. కవిత్వం, వ్యాసం, అనువాదం, సాహిత్య విమర్శ, దృశ్యకళ.. ఇలా విభిన్న ప్రక్రియల మధ్య గీతలను చెరిపేస్తూ ఆమె రచనలు సాగుతాయి. ప్రాచీన సాహిత్యంలోని కథలు, పాత్రలను యథాతథంగా తిరిగి చెప్పడం ఆమె లక్ష్యం కాదు. వాటిని ఆధునిక జీవితంతో ముడిపెట్టి ప్రేమ, కోరిక, అసూయ, వియోగం, అస్తిత్వం, భిన్నత్వం వంటి అంశాలకు కొత్త అర్థాలను ఆవిష్కరిస్తారు. 1980ల మధ్యకాలం నుంచి కార్సన్ రచనా ప్రయాణం అనేక ప్రయోగాలతో సాగుతోంది. తక్కువ పదాలతో లోతైన భావాలను పలికించడం, వ్యక్తిగత అనుభవాలను తాత్విక ప్రశ్నలుగా విస్తరించడం ఆమె శైలిలోని ప్రత్యేకత. మేధోపరమైన విశ్లేషణలోని పదును, భావోద్వేగాల చిత్రణలోని సున్నితత్వం ఆమె రచనల్లో కలగలిసిపోతాయి. ఆమె రచనల్లో చెప్పిన విషయాలతోపాటు చెప్పకుండా వదిలేసిన అంశాలూ పాఠకులను ఆలోచింపజేస్తాయి.
ప్రేమలోని సంఘర్షణ
2001లో వెలువడిన 'ది బ్యూటీ ఆఫ్ ది హస్బెండ్: ఎ ఫిక్షనల్ ఎస్సే ఇన్ 29 టాంగోస్' ప్రేమబంధం విచ్ఛిన్నమైనప్పుడు కలిగే భావోద్వేగాలను, ముఖ్యంగా లైంగిక అసూయను పరిశీలిస్తుంది. వ్యక్తిగత అనుభవాల ఛాయలతో కూడిన ఈ కల్పిత కథలోని 29 భాగాలను కార్సన్ టాంగోలుగా పేర్కొన్నారు. టాంగో నృత్యంలో భాగస్వాములు ఒకరినొకరు సమీపిస్తూ, దూరమవుతూ కదిలినట్లే, ఇందులోని భావాలు కూడా కోరికకు, కోపానికి, ఆకర్షణకు, నిరాశకు మధ్య ఊగిసలాడుతుంటాయి. ప్రేమలోని అందాన్ని మాత్రమే కాకుండా, దానిలో దాగి ఉండే అసూయ, అనుమానం, ఆధిపత్యం, బాధలను కూడా ఆమె నిర్భయంగా ఆవిష్కరిస్తారు. చురుకైన పదప్రయోగాలు, పద్యరూపంలోని కథనం రచనకు ప్రత్యేకమైన లయను అందిస్తాయి. ఒక సంబంధం ఎందుకు విఫలమైందనే ప్రశ్నకు సులభమైన సమాధానం ఇవ్వకుండా, మనుషుల భావోద్వేగాల్లోని వైరుధ్యాలను పాఠకుల ముందుంచడం ఈ రచన విశేషం.
పురాణానికి కొత్త రూపం
ప్రాచీన గ్రీకు పురాణంలోని పాత్రను ఆధునిక ప్రపంచంలోకి తీసుకొచ్చి సమకాలీన మనిషి అంతరంగాన్ని ఆవిష్కరించిన రచన 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ రెడ్'. 1998లో ప్రచురితమైన ఈ పుస్తకంలో గెరియోన్ అనే ఎర్రని రెక్కలున్న పురాణ పాత్రను కార్సన్ ఆధునిక యువకుడిగా, కళాకారుడిగా, ప్రేమలో పడే వ్యక్తిగా చిత్రించారు. ఈ రచన సంప్రదాయ నవలకూ, కవిత్వానికీ మధ్య నిలిచే వినూత్న ప్రయోగంగా గుర్తింపు పొందింది. గెరియోన్ తనను తాను అర్థం చేసుకునే క్రమంలో కుటుంబంలో వేధింపులు, ఆత్మన్యూనత, ప్రేమ, తిరస్కారం వంటి అనుభవాలను ఎదుర్కొంటాడు. తన లైంగిక గుర్తింపును అర్థం చేసుకోవడం, ఇతరులకంటే భిన్నంగా ఉండటాన్ని అంగీకరించడం, సమాజంలో తన స్థానాన్ని వెతుక్కోవడం వంటి అంశాలను కార్సన్ ఇందులో ముడిపెట్టారు. 2013లో వెలువడిన 'రెడ్ డాక్' ఈ కథకు కొనసాగింపు. ఇందులో పాత్రల జీవితాలను మరో దశలోకి తీసుకెళ్లారు. కోరిక స్వభావాన్ని పరిశీలించిన కార్సన్ తొలి పుస్తకం 'ఈరోస్ ది బిటర్‌స్వీట్' 1986లో ప్రచురితమైంది. ఆమె డాక్టరేట్ పరిశోధన ఆధారంగా రూపొందిన ఈ రచన ప్రాచీన గ్రీకు సాహిత్యం, తాత్విక ఆలోచనల ద్వారా ప్రేమ, ఆకాంక్షల స్వరూపాన్ని వివరిస్తుంది. మనిషి కోరుకునే వ్యక్తి లేదా వస్తువు పూర్తిగా అందుబాటులో లేనప్పుడు ఆ కోరిక మరింత తీవ్రంగా మారుతుందన్నది ఇందులోని ప్రధాన భావన. మనకు లేని దాని పట్ల ఆకర్షణ, దాన్ని పొందాలనే తపన, అది దూరంగా ఉండటం వల్ల కలిగే బాధ.. ఈ వైరుధ్యాల మధ్యే కోరిక బలపడుతుందని కార్సన్ విశ్లేషిస్తారు. ప్రాచీన సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొని ఈ పుస్తకం లేవనెత్తే ప్రశ్నలు నేటి మనిషికి సంబంధించినవే!
జ్ఞాపకాలు, ప్రయోగాలు
కార్సన్ రచనల్లో అత్యంత వ్యక్తిగతమైనది 'నాక్స్'. తనకు దూరమైన సోదరుడి జ్ఞాపకార్థం ఆమె ఈ పుస్తకాన్ని రూపొందించారు. సోదరుడు కెనడాను విడిచివెళ్లిన తర్వాత వారి మధ్య సంబంధం తెగిపోయింది. ఆయన మరణవార్త తెలిసిన అనంతరం జ్ఞాపకాలు, ఛాయాచిత్రాలు, ఉత్తరాలు, అనువాదాలు, వ్యక్తిగత ఆలోచనలను కలిపి ఈ రచనను రూపొందించారు. సాధారణ పుస్తకంలా కాకుండా, పెట్టెలో ఉంచిన మడతల పాఠ్యరూపంలో ఇది ఉంటుంది. పాఠకుడు దాన్ని విప్పుతూ చదవాలి. ప్రాచీన రోమన్ కవి కాటుల్లస్ తన సోదరుడి మరణంపై రాసిన కవితను అనువదించే క్రమంలో కార్సన్ తన దుఃఖాన్ని కూడా ఇందులో మేళవించారు. జ్ఞాపకాలను భాషలోకి మార్చినప్పుడు అవి ఎంతవరకు నిలుస్తాయి? మనకు దూరమైన వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అంటే ఏమిటి? వంటి ప్రశ్నలు ఈ రచనలో అంతర్లీనంగా ఉంటాయి. ఫొటోలు, ఉత్తరాలు, చేతిరాతలు, పాఠ్యశకలాలను కలపడం ద్వారా సాహిత్యాన్ని దృశ్యకళతో మేళవించారు. పుస్తకం రూపమే ఇక్కడ భావవ్యక్తీకరణలో భాగమవుతుంది. 2016లో వెలువడిన 'ఫ్లోట్' కూడా కార్సన్ ప్రయోగాత్మక దృక్పథానికి ఉదాహరణ. ఇందులో 12 చిన్న పుస్తకాలను ఒక పెట్టెలో ఉంచారు. కవితలు, నాటక పాఠాలు, సంభాషణలు, గద్య కవితలు వంటి విభిన్న రచనా రూపాలు ఇందులో చోటుచేసుకున్నాయి. పికాసో గురించి గెర్ట్రూడ్ స్టెయిన్‌తో సాగిన సంభాషణ, విమాన ప్రయాణంపై రాసిన ధ్యానాత్మక గద్య కవిత వంటి రచనలు పాఠకులను భిన్నమైన ఆలోచనా ప్రపంచాల్లోకి తీసుకెళ్తాయి. ఈ రచనలన్నీ ఒకే కథను ముందుకు తీసుకెళ్లవు. వాటి మధ్య సంబంధాలను పాఠకులే వెతుక్కోవాలి. పుస్తకాన్ని స్థిరమైన నిర్మాణంగా కాకుండా, విభిన్న రచనా పద్ధతులను పరీక్షించుకునే వేదికగా ఉపయోగించడం కార్సన్ ప్రత్యేకత.
సాఫోకు కొత్త పఠనం
ప్రాచీన గ్రీకు కవయిత్రి సాఫో కవితలకు కార్సన్ చేసిన అనువాదాలు ఆమె సాహిత్య పరిజ్ఞానానికి మరో నిదర్శనం. 2002లో ప్రచురితమైన 'ఇఫ్ నాట్, వింటర్'లో సాఫో రచనలను అనువదించారు. కాలగమనంలో సాఫో కవితల్లో చాలావరకు నశించిపోయాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి అనేక సందర్భాల్లో చిన్నచిన్న శకలాలు మాత్రమే. కొన్ని కవితల్లో ఒకటి రెండు పదాలే మిగిలి ఉండగా, మరికొన్నింటిలో కొన్ని పంక్తులు మాత్రమే కనిపిస్తాయి. అలాంటి రచనలను అనువదించేటప్పుడు లేని భాగాలను ఊహతో నింపేయకుండా, మిగిలిన పదాలతోపాటు వాటి మధ్య ఉన్న ఖాళీలను, అసంపూర్ణతను కూడా కార్సన్ సాధ్యమైనంతవరకు నిలిపారు. అనువాదం అంటే మూల రచనను మరో భాషలో తిరిగి చెప్పడం మాత్రమే కాదని, దాని పరిమితులను, నిశ్శబ్దాలను కూడా కాపాడవచ్చని ఈ పుస్తకం నిరూపిస్తుంది. సాఫో కవితల్లోని ప్రేమ, కోరిక, వియోగం వంటి భావాలు ఆధునిక పాఠకులకు చేరువయ్యేలా ఆమె చేసిన కృషి విశేషమైనది.
సాహిత్యానికి కొత్త దారులు
అన్నే కార్సన్ రచనలను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆమె ఎంచుకున్న విషయాలే కాదు, వాటిని వ్యక్తీకరించడానికి అనుసరించే పద్ధతులు కూడా. గద్యం, పద్యం, వ్యాసం, విమర్శ, అనువాదం, వ్యక్తిగత జ్ఞాపకం, దృశ్యకళలను ఆమె వేర్వేరు ప్రక్రియలుగా చూడరు. ఒకే రచనలో వాటిని కలిపి కొత్త రూపాన్ని సృష్టిస్తారు. కవితలో పరిశోధనాత్మక విశ్లేషణకు చోటివ్వడం, పురాణ కథను ఆధునిక జీవితంతో ముడిపెట్టడం, వ్యక్తిగత దుఃఖాన్ని ప్రాచీన కవిత్వం ద్వారా వ్యక్తీకరించడం ఆమె రచనా వైవిధ్యాన్ని తెలియజేస్తాయి. పొదుపైన భాషలో సంక్లిష్టమైన భావాలను వ్యక్తం చేస్తూ, విరామాలు, ఖాళీలు, అసంపూర్ణ వాక్యాలకు కూడా అర్థాన్ని కల్పిస్తారు. ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృష్టితో పునర్వ్యాఖ్యానించడం, వ్యక్తిగత అనుభవాన్ని తాత్విక ప్రశ్నగా విస్తరించడం ద్వారా సాహిత్య ప్రక్రియలపై ఉన్న సంప్రదాయ అంచనాలను సవాలు చేస్తారు. కార్సన్ రచనలను ఒక్కసారి చదివి పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. మళ్లీ చదివినప్పుడు కొత్త అన్వయాలు, కొత్త అర్థాలు కనిపిస్తాయి. వెంటనే సంతృప్తిపరిచే సమాధానాలకంటే, ఆలోచనను కొనసాగించే ప్రశ్నలకు ప్రాధాన్యమివ్వడమే ఆమె సాహిత్య ప్రత్యేకత. ప్రాచీన సాహిత్య సంప్రదాయంతో సంభాషిస్తూ సమకాలీన జీవితాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించిన ఆమె రచనా కృషికి నోబెల్ పురస్కారం గుర్తింపుగా నిలిచింది.
- సత్యాజీ







కామెంట్‌లు (0)