కొన్ని పాదాలు దారి చూపుతాయి. మరికొన్ని చరిత్ర భుజాలపై మోపిన బరువును మోస్తాయి. నలిగిన పాదాలు మాత్రం నేలను మాత్రమే కాదు, నేల కింద దాచిన నొప్పులనూ గుర్తుపడతాయి. వినోద్ కుత్తుం ‘నలిగిన పాదాలు’ కవితా సంపుటి అలాంటి పాదాల జాడ. కవిత్వం సమాధానాల కళ కాదు, ప్రశ్నల శిల్పం. వెలుగు చీకటికి ప్రత్యర్థి కాదు; చీకటిని ప్రశ్నించే ధైర్యం. అందుకే ఈ సంపుటిలో ప్రతి కవిత ముగింపు దగ్గర ఆగదు. మరో ప్రశ్నకు దారి తీస్తుంది. కవి ప్రశ్నను విసరడు. దాని ఎదుట మనిషిని నిలబెడతాడు.
‘ఏలినోడు ఏటిసేత్తన్నాడు?’ అని అడిగినప్పుడు వినోద్ ఒక వ్యక్తిని మాత్రమే నిలదీయడం లేదు. అధికారానికి అలవాటుపడిన మన నిశ్శబ్దాన్ని విచారణకు నిలుపుతున్నాడు. విచారణ అంటే ఒక స్వరం మరో మనిషిని ప్రశ్నించడం మాత్రమే కాదు; భాష తనను తాను ప్రశ్నించుకోవడం కూడా. అధికారం తన గురించి తానే కథలు చెబుతుంది. ఆ కథల్లోంచి మాయమైన నిశ్శబ్దానికి గొంతునివ్వడం కవిత్వం చేసే పని. ప్రశ్నలు వెలుగైతే, సమాధానాలు చాలాసార్లు నీడలవుతాయి. అసలు వెలుగు కనిపించేదాన్ని చూపడమే కాదు, కనిపించకుండా దాచినదాన్ని అనుమానించడం కూడా. అందుకే ప్రశ్న ఒక దీపం మాత్రమే కాదు, మనల్ని చీకటిలోకి దింపి వెలుగును వెతికించే శక్తి. చెట్టు ఆకుల్లో పుట్టేది సమాధానం కావచ్చు; వేర్లలో పుట్టేది ప్రశ్న. వినోద్ కవిత్వం వేర్ల భాష మాట్లాడుతుంది. అందులో కనిపించేది ఒక వ్యక్తి ముఖం కాదు; అధికారం అద్దంలో చూసుకున్నప్పుడు మాయమైన ముఖం. సమాధానాలది ఆరోహణా యాత్ర అయితే, ప్రశ్నలది అవరోహణా సంచారం. ఈ రెండు ప్రయాణాల మధ్యనున్న తేడాను కవి తన కవిత్వంతో ఆవిష్కరిస్తాడు.
ప్రతి రాజ్యం తన గురించి ఒక కథ రాస్తుంది. ప్రతి కవిత ఆ కథలో మాయమైన వాక్యాన్ని వెతుకుతుంది. వినోద్ కవిత్వం ఆ మౌన వాక్యానికి అక్షరరూపం ఇస్తుంది. మంచి కవిత్వం వస్తువులను వర్ణించదు; అవి ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాయో వినిపిస్తుంది. ఒక రాయి బరువెంతో శాస్త్రం చెబుతుంది. అది ఎంతకాలం మౌనంగా ఉందో కవిత్వం చెబుతుంది. చెట్టు ఎత్తును కొలవచ్చు. దాని నీడలో ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారో కొలవలేం. వినోద్ కవిత్వం కొలతలకు అందని జీవితాన్ని కొలిచే ప్రయత్నం. సమాధానం తలుపు మూసేస్తే, ప్రశ్న గోడకూ కిటికీ పెడుతుంది. ఆ కిటికీ గుండా బయట ప్రపంచాన్ని మాత్రమే కాదు, మనలోని చీకటిని కూడా చూడగలగడం ఈ కవిత్వం సాధించిన విజయం.
వినోద్ కవిత్వంలో నింద అవమానపరిచే సాధనం కాదు; అన్యాయాన్ని ఎదురొడ్డే భాష. సత్యం తనను తాను కాపాడుకోలేనప్పుడు నింద దానికి ఆశ్రయమవుతుంది. అందుకే ఈ కవితల్లో పదాలు రాళ్లలా విసరబడవు; గాయాల జ్ఞాపకాలుగా నిలుస్తాయి. కించపడ్డ సత్యాన్ని తిరిగి నిలబెట్టే నైతిక బాధ్యత నిందకు ఉందని కవి గుర్తుచేస్తాడు. ఎన్నాళ్లుగానో మౌనంగా ఉన్న రాయి ఒక్కసారిగా మాట్లాడితే దానికి చప్పట్లు దక్కకపోవచ్చు. నిందలు ఎదురుకావచ్చు. అయినా ఆ స్వరం వెనుక ఉన్న సత్యాన్ని విస్మరించలేం. నిందను నైతిక స్థితిగా, గాయపడిన సత్యం ధరించే తొలి దుస్తులుగా చూడగలగడం ఈ కవిత్వంలోని వైచిత్రి. ఈ సంక్లిష్టతను వినోద్ సమర్థంగా ఆవిష్కరిస్తాడు.
నిశ్శబ్దాన్ని కాపాడుకోవడమే వ్యవస్థల మొదటి సంస్కారం; మాట్లాడటాన్ని అవి అసభ్యతగా పరిగణిస్తాయని వినోద్‌కు తెలుసు. ‘ఊరు అంటే ఇళ్లు కాదు, చెరువు’ అని చెప్పే కవి భౌగోళిక సత్యాన్ని మాత్రమే ప్రతిపాదించడం లేదు. నీటికి జ్ఞాపకం ఉంటుందని, జలస్మృతి ఒక నాగరికత ఉనికిలో భాగమని గుర్తుచేస్తున్నాడు. చెరువు ఎండిపోతే నీరు మాత్రమే మాయమవదు; చేపల జీవితం మాత్రమే అంతరించదు. అందులో ప్రతిబింబించుకున్న మనిషి రూపం కూడా కనుమరుగవుతుంది. భాషలోని కొన్ని ఉపమానాలు సైతం కాలక్రమంలో చనిపోతాయి. అందుకే తుఫాను రాత్రిని వినోద్ వాతావరణ ఘటనగా కాక, చరిత్ర తన మీదుగా నడిచిన శబ్దంగా అనుభవిస్తాడు. తుఫాను కూల్చేది ఇళ్లను మాత్రమే కాదు; మనిషి తన గురించి నమ్ముకున్న శాశ్వతత్వాన్ని కూడా. పలాసకు ఆమడ అటూ, ఆమడ ఇటూ ఉన్న మనుషుల మధ్య పోలికలను చూడడం దూరాన్ని కొలవడం కాదు; వ్యత్యాసాల వెనుక దాగిన ఏకాంతాన్ని గుర్తించడం. ఒకరి దుఃఖం మరొకరిలో ఎలా ప్రతిధ్వనిస్తుందో, ఒక ప్రాంతపు మట్టి మరో ప్రాంతపు పాదాలకు ఎలా అంటుకుంటుందో కవి గమనిస్తాడు. రెండు ఆకులు ఒకేలా ఉండకపోయినా, గాలి రెండింటినీ ఒకే భాషలో పలకరించి కదిలిస్తుంది.
మనుషులు వేర్వేరుగా ఉంటారు. కానీ బాధ వారందరితోనూ ఒకే వ్యాకరణంతో మాట్లాడుతుంది. వినోద్ కవిత్వం ఆ వ్యాకరణాన్ని చదువుతుంది. అతడు సరిహద్దులను గీయడం కంటే, వాటిపై పేరుకున్న దుమ్మును చదవడానికి ఆసక్తి చూపుతాడు. బాధకు సరిహద్దులు లేవని గుర్తిస్తాడు. అందుకే ఈ కవితలు మనుషుల గురించా, పదాల గురించా, నేల గురించా, ఇంకా పుట్టని ప్రశ్నల గురించా అనే సందేహాన్ని పాఠకుడిలో మిగులుస్తాయి. మంచి కవిత్వానికి సారాంశం కంటే గురుత్వాకర్షణ ముఖ్యం. ఏది నిజమో, ఏది గాయమో, ఏది మనిషో, ఏది చరిత్రో అన్నింటినీ తనవైపు లాక్కునే అదృశ్య శక్తి అది. వినోద్ ఆ శక్తిని వాక్యాలుగా ప్రకటించడు; పాదముద్రలుగా వదిలిపెడతాడు. ఒకరి పాదంలో దిగిన ముల్లు మరొకరి కలలో నొప్పిగా ఎలా మారుతుందో పట్టుకోగలగడం ఈ కవిత్వంలోని మానవీయ కోణం. వస్తువును దాటి దాని నీడను, సంఘటనను దాటి దాని ప్రతిధ్వనిని, వాస్తవాన్ని దాటి దాని మర్మాన్ని వినిపించడమే ఈ కవితల ప్రయత్నం. చూసినదాన్ని రాయడం వార్త కావచ్చు; విన్నదాన్ని రాయడం వర్ణన కావచ్చు. కనిపించని దాని వెనుక దాగిన అర్థాన్ని వెలికితీయడమే కవిత్వం. వినోద్ ఆ మూడో స్థలంలో నిలబడతాడు. అతని కవితల్లో ప్రతీకలు అలంకారాలుగా కాక, దేహాలుగా వస్తాయి. మౌనాలు ఖాళీలుగా కాక, అర్థం పుట్టే స్థలాలుగా నిలుస్తాయి. కొన్ని పంక్తులు వెంటనే పాఠకుడికి పట్టుబడవు. అతని అనుభవం కోసం ఎదురుచూస్తాయి. ఎందుకంటే మంచి కవిత తన అర్థాన్ని పూర్తిగా రాసిపెట్టదు; అది పాఠకుడి అంతరంగంలో పాతుకునే వాతావరణాన్ని సృష్టిస్తుంది. వస్తువులకు నీడ ఉంటుందని మనకు తెలుసు. ఆ నీడకూ జ్ఞాపకం ఉంటుందని కవిత్వం చెబుతుంది. ఆ జ్ఞాపకాలతోనే ‘నలిగిన పాదాలు’ తన శరీరాన్ని నిర్మించుకుంది.
పక్షి ఆకాశాన్ని మోసుకెళ్లనట్టే, కవిత కూడా తన భావాన్ని పాఠకుడిపై మోపదు. అతని లోపల ఆ భావం పుట్టే ఖాళీని వదిలిపెడుతుంది. మంచి కవిత అర్థాన్ని చెప్పదు; దాని చుట్టూ పాఠకుడిని నడిపిస్తుంది. కొన్ని పుస్తకాలు తెరిస్తే కాగితం రెపరెపల శబ్దం వినిపిస్తుంది. మరికొన్ని తెరిస్తే కాలం శబ్దం వినిపిస్తుంది. ‘నలిగిన పాదాలు’ రెండో రకానికి చెందిన సంపుటి. పాదాలు నలగవు, నడక నలగదు; నలిగేది దారి, దాన్ని గుర్తుపట్టే జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్ని తిరిగి మన పాదాల కింద పరచే ప్రయత్నమే ఈ కవిత్వం. ఈ సంపుటిని చదువుతున్నప్పుడు పదాల కంటే అడుగుల శబ్దమే ఎక్కువగా వినిపిస్తుంది. అవి కవి అడుగులా, కూలీ అడుగులా, రైతు అడుగులా, చరిత్ర అడుగులా తేడా తెలియదు. బహుశా మంచి కవిత్వం వ్యక్తుల గుర్తింపులను దాటి వారి అడుగుల జాడను మాత్రమే మిగులుస్తుంది.
‘నలిగిన పాదాలు’ అనే శీర్షిక కేవలం రూపకం కాదు. చరిత్ర అడుగుల కింద నలిగిపోయిన మనుషుల జీవనరేఖ ఇది. అదే సమయంలో, ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు కదలడాన్ని ఆపని పాదాల సంకల్పం కూడా. నాగరికతను ముందుకు నడిపించేది సింహాసనాలపై కూర్చున్న పాదాలు కాదు; నేలపై నడిచి, నలిగి, మళ్లీ ముందడుగు వేసే పాదాలే. ఈ కవితలను చదవడం అంటే పదాల మధ్య నడవడం. కొన్ని చోట్ల నేల మెత్తగా ఉంటుంది. మరికొన్ని చోట్ల రక్తం ఎండిన మరకలు కనిపిస్తాయి. ఇంకొన్ని చోట్ల మన సొంత అడుగుల శబ్దమే మనకు అపరిచితంగా వినిపిస్తుంది. ఒక పాదం నేలను తాకకముందు అది శరీరంలో భాగం. నేలను తాకిన క్షణం నుంచి చరిత్రలో భాగమవుతుంది. అందుకే చరిత్రను ముఖాల్లోనే కాదు, పాదాల్లోనూ చదవాలి. మనిషి నడవడం ఆపిన చోట కూడా అతని పాదముద్ర ముందుకు కదులుతూనే ఉంటుందని వినోద్ కవిత్వం చెబుతుంది. ఈ కవితలు చదివాక కవి గుర్తుండకపోవచ్చు. కానీ మనం మరిచిపోయిన ప్రశ్నలు మళ్లీ మన వెంట నడవడం మొదలుపెడతాయి. కవిత్వం చేసే అత్యంత గొప్ప పని బహుశా ఇదే. వెలుగును అందించడం కాదు; దాన్ని వెతకకుండా ఉండలేని అసౌకర్యాన్ని మనలో నాటడం. ఆ అసౌకర్యం పేరే ‘నలిగిన పాదాలు’.
- ప్రసేన్








కామెంట్‌లు (0)