గొంతెత్తి అరిచినా గుక్కెడు నీళ్ళు
దొరకని రాళ్ల వాగుల దారులు
మిడిసిపడుతున్న పొద్దుని
వాలిపోతున్న జొన్నకంకుల పక్కనుంచి
తొంగిచూసి పలకరించిన ఊరు
ఎంత లోతుకు దిగినా తేమ తగలని చోట
నిటారుగా నిలబడ్డ ఇంటికొక చెట్టు
ఊపిరిపోస్తూ నల్లమల ఉసురు తీస్తూ ప్రాజెక్టు
వెలుతురు బుడ్లకింద పురుళ్ళు పోసుకున్న ప్రాణాలు
నేలలో పాతిపెడితే నీళ్ళలో మునిగిపోయిన శ్మశానాలు
మాకు నోరులేదని మీకు అలుసు
ఏది, నన్ను నిద్రలేపిన ఎండ?
భుజాలనిండా గొంగడి కప్పిన చలి ఎక్కడ?
వస్తానని మభ్యపెట్టిన వాన ఇంకెప్పటికి నన్ను తడపదు
నల్లతుమ్మకి పూసిన పసుప్పూలు రాలినట్టు
ఒక్కో ఇంటిపేరు ఊరునుంచి వెళ్ళిపోతుంది!
ఎంత ఏడుస్తున్నా చంటోణ్ణి హత్తుకోకుండా
చనుబాలకి రాసిన ముసాంబరం చూపిస్తుంది ప్యాకేజి
భవిష్యత్ ఊహంతా చేదు వాసన
ఎవరైనా ఇంతమంచి గాలి అప్పివ్వండి
ఈ ఊరు మట్టి వాసన మరిచిపోయేలా
నన్ను మత్తులో ముంచండి
ఇంత వక్కాకు వేసుకుని ఇల్లిల్లు తిరిగొస్తా
ఏ వీధిలోనూ నన్నాపకండి
ఈ ఎర్రమట్టిని నా వంటికి పూసుకోనివ్వండి
నిన్నటిదాకా రాళ్లమీద వాలిన వెన్నెల
ఇకమీద నీళ్ళపై పారుతుంది
పునరావాస కేంద్రంలో
తగరపు పట్టాల కింద తలదాచుకుని
రాగులుబొక్కిన నోటితో
బైరాగి రాగం పాడుకుంటున్నాను
దాహానికి నీళ్లడిగితే దేహాల్ని ముంచిరని
తలపోసుకుంటినో, ఒలపోసుకుంటినో
సొమ్ము చాలక సొంత ఇల్లు వదిలేసుకుంటినో
ఈ నీరు పారినంతమేరా
మీరు తినే ప్రతి మెతుకు
ఇకపై మా కన్నీళ్లతో ఉడుకుతుంది
ఆవాసం కోల్పోయి ఉన్నాం
అడుక్కుతిందామన్నా పక్కవాడూ నాతోటివాడే
ముందు ఆధార్ కార్డ్ అడ్రెస్ మార్చండి
ఆకలౌతుంది నూకలు తెచ్చుకోవాలి!
(వెలుగొండ ప్రాజెక్ట్ కింద ఉనికి కోల్పోయిన పదకొండు గ్రామాల ప్రజలకి సంఘీభావంగా)
- అనిల్ డ్యాని, 97033 36688






కామెంట్‌లు (0)