దుక్క ముందు కూర్చుని దిగుళ్లు మింగడమే తప్ప
పట్టిడి మీద దెబ్బపడని రోజులే అన్నీ
గుప్పెడు మెతుకులవకోసం గంపెడు యాతన
కంటిరెప్పలకు కటిక చీకటి తోరణాలు
ఏ రాగి ఉంగరమైనా చేయించుకోడానికి
ఎవరో ఒకరు రాకపోతారా అని ఆశల ఎదురు చూపులు
కష్టాలను కన్నీళ్లని చెరిసగం పంచుకుని
కాలానికి ఎదురీదుతూ, నిరాశతో పోరాడుతూ
నిట్టూర్పులు... ఓదార్పులు
రోజంతా సుత్తి దెబ్బలతో కలిగిన గాయాల్ని
పిడికెడు మెతుకులుగా మార్చి
మా పొట్టలు నిమిరేది పట్టిడిదుక్క
మా వేలికొసలు తాకి ప్రాణం పోసుకుని
మేడింటి మగువల మెడలలో మెరిసి మురిసినపుడు
గిజిగాడిని మించిన కళానైపుణ్యం వెదజల్లే స్వర్ణ కాంతులు
మా వంటింటి ఖాళీగిన్నెల్లోని చీకట్లను తరమలేకపోయేవి
సామాన్యులకు గగనమైన కనకం
కలవారి కళ్లకు విందుచేస్తూ
పేటకు పది పసిడి అంగళ్లుగా విస్తరించినా
కూరానారా వచ్చే దారేలేదు మా విస్తర్లలోకి...
మంగళ వాద్యాల నడుమ
శతమానం భవతి అనే ఆశీస్సులందించే
స్వర్ణకార సంతకం చెరిగి
మంగళసూత్రం కూడా అంగట్లోనే ఆహ్వానం పలుకుతుంది
కార్పొరేట్ కవుకుదెబ్బలకు
రెక్కలిరిగి కూలిపడ్డాయి స్వర్ణకార పక్షులు,
విరిగిన రెక్కల్ని కూడదీసుకుని
జీవనలాలస వదులుకోలేక ఏ అవతారమెత్తాలో..?
మరో మజిలీని వెతుక్కుంటూ
ఏ దూరతీరాల మీద వలసరాగమాలపించాలో...!
- ఆగూరు రామారావు
88865 55822







కామెంట్‌లు (0)