ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నగర వీక్షణం

1 గంట క్రితం

city
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 03:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​ఆ మధ్యాహ్నం

నగరం మూలమూలల్లోని ఆకలి పొట్టలన్నీ

పుట్టలు పగిలినట్టు బిలబిలమంటూ

బాలగణపతుల విగ్రహాల ముందు

బారులుతీరి నించున్నాయి!

​

పేగుల గణనాధుల చుట్టూ

పరుగులు పెడుతున్న మూషికాల్ని

అదిలించలేక అల్లాడుతూనే

తినబోయే రుచుల్ని మనసారా

ఊహించుకుంటున్నాయి!

​

క్షణాలు గడుస్తున్న కొద్దీ

క్యూలైన్లు కొండల్లా పెరుగుతూనే

నదుల్లా ప్రవహిస్తూ సాగుతుంటే

“అన్నప్రసాదం వృథా చేయకండి,

అవసరం మేరకే వడ్డించుకోండి”

మధ్యమధ్యన మైకుల్లోంచి

నురుగు తరగల్లాంటి విన్నపాలు!

​

అన్నం, ప్రసాదం అనటం బావుంది

కానీ ఎవరి ప్రసాదం?

ఎవరి అనుగ్రహంతో

సంప్రాప్తించిన సాపాటు?

ఏ బురద మట్టిలోంచో

బువ్వను పుట్టించటానికి

ఆరుగాలం తపస్సు చేసిన

మట్టిపాదాల మహా రుషుల

చెమట చిత్తడిలోంచి తడిసి వచ్చింది కదా?

​

ప్రకృతి ప్రకోపించి విరుచుకుపడుతున్నా,

దళారీ కందిరీగలు కుట్టి కుట్టి బాధిస్తున్నా,

సేద్యం తప్ప మరో ఆజీవం తెలీని

అమాయక జీవులకు మట్టితో ఉన్న

ఆ పేగు బంధాన్ని ఇవాళ

నిర్దాక్షిణ్యంగా తెగ్గోస్తుంటే,

ఏ దారీ లేక అడ్డా కూలీలుగా మారి

తిండి కోసం యాతన పడుతూ

ఇప్పుడీ క్యూలైన్లలో ఎందరో... ఎందరెందరో...

మాజీ రైతు సోదరుల ఆకలి కడుపులు!


​– పతివాడ నాస్తిక్

94417 24167

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్