సముద్రాన్ని ఏ గదిలో బంధించగలవు
అలలకు గాలం వేసి కాలాన్ని మాయ చేయనూ లేవు
అలల్ని కత్తిరించి సాగరాన్ని చెరువుగా మార్చాలని ప్రయత్నిస్తే ఫలితమేముంది నీ అల్పత్వాన్ని చాటుకోవడం తప్ప !
గూడలతో తోడి కడలిని ఖాళీ చెయ్యలేవు,
రాళ్ళదాడి చేయించినంత మాత్రాన అలలతో ఎగిసిపడే జలశరీరానికేమీ కాదు..నీకు అవమానం తప్ప!
ఉప్పెనకి ముందు వీచే గాలి హోరొక హెచ్చరిక మాత్రమే
తుఫాన్లు విరుచుకుపడేది సముద్ర గర్భంలోంచే,
విరుచుకుపడే కెరటాలకు అడ్డుకట్టవెయ్యాలనే వెర్రిభ్రమ నీది
చేపలకు నీటిలో హక్కులేకుండా చేసే తిమింగలాన్ని కాపాడాలని సునామీల్ని సృష్టించుకుంటున్న వాడా
ఆగ్రహోదగ్రార్ణవం ముందు నువ్వెంత..నీ ఒడ్డెంత..
నీ పొడవెంత?
సంద్రం చెలియలి కట్టను దాటలేదంటే అది నీగొప్ప కాదు రాజా..తీరమ్మీద కెరటాలకు గల గౌరవం.
వొళ్ళు జలదరిస్తే కకావికలు కావలసిందే యుద్ధనౌకలైనా
రగిలించకు బడబాగ్నిని, కదిలించకు జలవిద్యుత్తును,
ఇది పురాణకాలం కాదు..నువ్వు రాముడివీ కాదు
కళ్ళెర్రజేసి విల్లెత్తితే హడలి నీ కాళ్ళమీద పడడానికి
ఇది కడలి, ఉరకలేసి తరగలెత్తే మహానదుల కూడలి,
గుర్తుపెట్టుకో..
ఇది బొద్దింకల ముందు తిమింగలాలు తలదించాల్సిన
సమయం,
ఇది అలల పిడికిళ్ళెత్తి సముద్రం నినాదమై హోరెత్తే ఉద్యమ కాలం.
- లాంగుల్య.







కామెంట్‌లు (0)