పెల్లెట్లకు, బుల్లెట్లకు ఎదురొచ్చే శతఘ్ని
ఏడ్చే తరమిది కాదు,
ఎగబాకే దావాగ్ని
ఇంకా సహించలేదు-ఇది
జెన్ జీ తరము!-
మరి భరించలేదు-ఇది
మంటల స్వరమూ!
జెన్ జీ తరము..ఇది మంటల స్వరమూ!
ఎన్ని కంఠనాళాలు చిట్లిపోవాలి? ఇంకెన్ని
నిండు ప్రాణాలు
ఆహుతి కావాలీ?
ఎన్ని దశాబ్దాలు
కన్నీళ్ళతో తడవాలి? ఇంకెన్ని
కలల సౌధాలు
నిలువునా కూలాలీ?
ఇది జెన్ జీ తరమూ..ఇది
మంటల స్వరమూ!
అధికారం అడుగడుగునా
అండదండలివ్వగా!
పరీక్షలూ దగా..
ఇంటర్వ్యూలూ దగా!
అర్హతల ఫోర్జరీలు..
అడ్డగోలు పోస్టింగులు
అమ్మకాలు, కొనుగోళ్లు
దళారీల బేరాలు!
ఇక సహించలేదు..
ఇక భరించలేదు!
ఇది జెన్ జీ తరమూ..ఇది
మంటల స్వరమూ!
కులం లేదు, మతం లేదు..
ధర్మంపైనే ధ్యాస!
సంద్రం ఎద ఘోష..
సంయమనం భాష!
గుండె నిండా దేశభక్తి..
సడలని సంకల్పశక్తి!
శృతి తప్పని సమరభేరి..
గతి తప్పని పోరు దారి!
ఇది జెన్ జీ తరము; ఇది
మంటల స్వరమూ!
నల్లి ధర్మారావు,
సెల్: 76609 67313






కామెంట్‌లు (0)