సంఘీభావ స్వరం
సర్ పేరిట జరిగిన అక్రమాలను నిరసిస్తూ, ఇసిఐ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ ఉద్యమిస్తున్న జెన్ జీ కి సంఘీభావంగా కవులు, కళాకారులు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. విద్యార్థి యువజనులపై మోడీ ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత చర్యలను ఖండిస్తూ కవితలు, పాటలు సృజియిస్తున్నారు. మాకు అందిన కవితల్లో కొన్నింటిని ఈవారం ప్రత్యేకంగా ప్రచురిస్తున్నాం. - ఎడిటర్
నా దేశం చెట్టును కాపాడే
కొత్త సైనికులొచ్చారు
పచ్చగా పత్రహరితాలతో చల్లని నీడనిచ్చే
నా దేశం చెట్టుకో చీడ పట్టింది
అనేక రంగుల్ని
ఒకే రంగుగా మార్చే కుట్రలతో
చెట్టును వేరుపురుగుల్లా పట్టి పీడిస్తూ
ప్రజాస్వామ్య పత్రహరితాన్ని పాతరేస్తున్న
వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తూ
వీర సైనికులు పుట్టుకొస్తున్నారు
పచ్చగా కళకళలాడాల్సిన దేశం చెట్టు
మనుషులతో మహాద్భుత జీవనచిత్రంగా
రూపుదిద్దుకోవాల్సిన దేశం చెట్టు
ఏవో చీడపీడలు సోకి కునారిల్లిపోతుంటే
చూస్తూ ఊరుకుంటుందా కొత్త రక్తం
నరనరాల్లో భావచైతన్యాన్ని
పోటెత్తిన నదిలా నింపుకుంటూ
జెంజీ మారుతమై నగర వీధుల నిండా
పిడికిళ్లయి మొలుస్తుంది
పీఠం కదిలి వేరు పురుగులన్నీ
చెల్లాచెదురయ్యేదాకా
ఈ ధిక్కార స్వరాలు
దేశం చెట్టు చుట్టూ నిరసన నినాదాలై
పహరా కాస్తూనే వుంటాయి
కాలం కొత్త పోరాట యోధుల్ని తయారు చేస్తూ
దేశానికి కాపలా పెడుతూనే వుంటుంది!
- చిత్తలూరి
91338 32246
2
ప్రశ్నే ఆయుధం
ప్రశ్న
ఎదురొడ్డి సింహంలా నిలబడుతుంది
ప్రశ్నతో ఇపుడు దేశం అట్టుడుకుతోంది
ప్రశ్నదెపుడూ గర్జనే
జనగర్జనకు పెద్దతలలైనా అల్లాడాల్సిందే
అవతల కూడా..
సింహమే అయినపుడు గదా
సమాధానం వొస్తుంది
ప్రశ్నను దీటుగా ఎదుర్కొంటేనే
అటువైపూ వీరుడనేదీ
ప్రశ్న గెలిచందంటే
అణచివేతల్ని దాటుకుని
ప్రశ్నజెండా ఎగురుతుందంటే
అవతల జవాబు లేనట్టే
ప్రజాస్వామ్యంలో ప్రశ్న దారిదీపం
ప్రజాస్వామ్యంలో
ప్రశ్నకు పెద్ద పరపతి
ఇక్కడ జనమే ప్రశ్న
ప్రశ్నే జనం
జనం ప్రశ్నించినపుడు
గద్దెముఖం జవాబు ఇవ్వాల్సిందే!
పేదవాడి నడ్డి విరిచి
ధనవంతుడి విరిగిన దంతానికి
బంగారపుపూత పూయించుకోమని
విరాళం ఇచ్చేవాడిని
ప్రశ్నించకుండా ఎందుకుంటారు!?
జనం మోసపోతారు
కానీ, కళ్లు తెరిచిన రోజు
ప్రశ్నఖడ్గంతో యుద్ధమూ చేస్తారు!
ప్రశ్నని మించిన ఆయుధం
ప్రజలకి మరొకటి లేదు
అది వాళ్లకీ తెలుసు
జనం తిరగబడితే
అనకొండలు చెలాయించగలవా
ఇంకా విషాన్నీ...
విషమించే లోపు
జవాబులు సిద్ధం చేసుకోండి
వేరే దారి లేదు!
- మెట్టా నాగేశ్వరరావు
3
అఖండ దీపాలు
ప్రశ్నను పాచిపట్టిన రాజ్యం
పాతరేస్తున్న సంధి కాలంలో
ఓటుచెట్టు మీద గొడ్డలి వేటు పడి
బిక్కచచ్చిన అమ్మానాన్నలు
దిక్కుతోచక దేవిరిస్తోంటే....
ప్రపంచంతో పని లేనట్టు
రీల్స్ చూసుకుంటూ గడిపేస్తారన్న
అపోహల్ని పటాపంచలు చేస్తూ
తమ జెన్-జీ బిడ్డలే రోడ్ల మీదకొచ్చి
రక్తాన్ని మరిగించే ప్రశ్నలు కావడం
ఏ తల్లీ తండ్రికైనా ఎంత ఆనందం!
లక్షలాది చుక్కలు ఒక్క పెట్టున
రహదార్ల మీద రాలిపడి
ముట్టడిస్తున్న పోలీసు మబ్బుల
పాశవిక దాడిలో గాయపడుతూనే
దేశం జెండాను దేదీప్యమానంగా ఎగరేస్తోంటే
మూలన కూర్చొని మూల్గుతున్న ముసలాళ్లు సైతం
చురుకు పుట్టి ఉరకలేయరా!
పోటెత్తిన ఆ జెన్-జీల పోరాటపు
తీరును గమనిస్తోంటే...
పుస్తకాల సంచి భుజాన వేసుకొని
బడికి పోయే రేపటి బుల్లి తూనీగలు
ఉల్లాసంతో గిరికీలు కొట్టేలా
తరగతి గదులన్నీ ఉదయ సూర్యుని
ఆట మైదానాలుగా మారిపోయినట్టు
అందమైన ఊహలేవో అంకురిస్తున్నాయి!
బతుకు పట్టాలు పుచ్చుకొని
ఆశల శిఖరాలు అన్వేషిస్తూ
సాగుతోన్న విహంగాలను సేదదీర్చే
మాతృగర్భాల్లాంటి మహావృక్షాలు
కళ్ల ముందే అలవోకగా కదరాడుతున్నాయి!
ఆత్మవిశ్వాసపు నెలవంకలకు నెలవైన
నీలి కెరటాల గాలి గంధాల
స్వేచ్ఛా స్వాతంత్ర్యపు సుందర నందనవనాలు
గుండెలనిండా గూడు కట్టుకుంటున్నాయి!
అవును నిజం. జెన్-జీలంటే
చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్న
చితికిన బతుకుల లోలోపలి లోగిళ్లలో
వెలుగురేఖల్ని విరజిమ్మగల
రేపటి అఖండ దీపాలుగా
ఖాయంగానే ఇప్పుడు కానవస్తున్నాయి!
ఆ దీపాలను మన అరచేతులు
అడ్డుపెట్టి కాపాడుకుందాం!
ఆ దీపాలను ఆర్పేసే కుట్రకు
తెగబడుతున్న రాజ్యం దుర్మార్గాన్ని
రాతి గోడల మధ్య సమాధి చేద్దాం!
- పతివాడ నాస్తిక్
94417 24167
4
అదే స్ఫూర్తి!
నిజం నిప్పై మళ్లీ రాజుకుంటోంది
నినాదాల హోరెత్తిన పాతబాట కొత్త కవాతుతో
దేశం దశ దిశ దిద్దబోతోంది
ప్లకార్డులు మారినా పరంపర కొనసాగుతోంది
గుండెకాయ లాంటి ఎన్నికల వ్యవస్థ
మరమ్మత్తుకి నడుం కట్టిన
అసమాన యువ పోరాటకెరటం
అరెస్టులు ఆంక్షలు తట్టుకొని
బ్యారికేడ్లు అడ్డుగోడలు చీల్చుకొని
ఆకాశమంత ఎత్తు ఎగసిపడుతోంది
ఆయువు వాయువు ఓటు హక్కు
ఆ హక్కుని తొక్కేస్తోన్న రాజ్యం దౌర్జన్యాన్ని
రాజ్యాంగస్ఫూర్తితో ప్రశ్నించేందుకు ప్రభవించిన
కుల మత లింగ భేదం లేని నవయుగం
పరిధి దాటని నదిలా పరవళ్లు తొక్కుతోంది..!
నాడు విచ్చిన వెలుగురేకలు వాడిపోకుండా
రాత్రీ పగలు అలుపు లేని నినాదకెరటాలతో
యువతరంగం పెనునిద్దర వదిలించేందుకు
దేశ హృదయతీరాన్ని తట్టి లేపుతూనే వుంది!
నిజాన్ని, సామాన్యుడ్ని గెలిపించేందుకు
నడుం కట్టిన మువ్వన్నెల జెండాలిప్పుడు
మరో స్వతంత్రపోరాటాన్ని భుజాన మోస్తూ
కాంతులు చిమ్ముతున్నాయ్
రాజ్యం రక్కసి చేతుల్లో..
దారం తెగిన పతంగిలా చిక్కిన ప్రజాస్వామ్యాన్ని
నిలువెల్లా విడిపించేందుకు
ఈ నిత్య పోరాట జ్యోతి వెలుగుతూనే ఉండాలి!
- భీమవరపు పురుషోత్తమ్
99498 00253
5
ప్రశ్నని తోసేయలేరు
ప్రశ్నలపై ఆయుధప్రయోగం
అమాయకత్వం కానేకాదు
అది ఓ కుట్ర!
అంధకారంలోకి తోసేస్తున్నపుడు
నిలదీయకుంటే బతుకు నిలబడేదెలా?
ఓటేసిన చేతిని కాటేస్తుంటే
న్యాయమడిగే నోటిని మూసేస్తూంటే
ప్రతిఫలం ప్రతిఘటనేనని ఇప్పటికైనా
బోధపడి ఉండాల్సింది
నిప్పుల కుంపటిని
ఉఫ్ ఉఫ్ అని ఊదేస్తే ఆరిపోతుందనుకున్నారేమో
మరింత ఉధృతమై అగ్నిగుండమై తగులుతుంది
సుఖసౌఖ్యాలు అధికమై
మదించిన అధికారాక్షులకు
మనుషులు చీమల్లా...దోమల్లా...
చీకటిలో సంచరించే బొద్దింకల్లా గోచరించారు
ఆ బొద్దింకలే ఐక్యంగా వీధుల్లో విరగబడి తిరగబడి
ప్రశ్నిస్తే....?
మీ ఆయుధాలు సరిపోతాయా?
మీ జైళ్ళలో ఖాళీ సరిపోతుందాని?
నగరంలో బొద్దింకలు కవాతు చేస్తూంటే
ఢిల్లీలో పెద్దల గద్దెలు
దద్దరిల్లడం కనబడుతోందా మిత్రోమ్?
కుళ్ళిపోతున్న ప్రజాస్వామ్య
వంటగదిలో పుట్టిన బొద్దింకలు అవి
కుళ్ళంతా క్లీన్ చేసి తీరుతాయి!
ఇక క్లీన్ బౌల్డ్ ఖాయం!
- ఉప్పల అప్పలరాజు
98493 17608
6
నెగడు
ఎత్తిన లాఠీకి
గాయపడ్డ దేహానికి మధ్య జరుగుతున్నదేంటి?
విరిగిన రేపటి దృశ్యం
రోడ్డుమీద మండుతున్న గుండెయ్యింది
ఎవరైనా ఎవరినైనా ఎందుకు ప్రశ్నిస్తారు?
గతకాలపు గాయాలు ఏమీ నేర్పలేదా!
అంతా స్థబ్దుగా ఉందనుకుంటారు
కాలుతున్న కాలపు ఉనికి గమనంలోకి రాదు
ఎక్కడో ఎవరో ఒకరు
నెగళ్లను పైకెగదోస్తారు
ఒకచోట అంటుకున్న నెగడు అంతటా వ్యాపిస్తుంది
నివురుగప్పినట్టే కనిపిస్తుంది
లోపల రగులుతున్న మంట
రోడ్లను కమ్మేస్తుంది
నల్లటి తారుకింద మరుగుతున్న రక్తపు ఉప్పెన
నినాదమై ఎగసిపడుతుంది
ఉరిమే ఉత్సాహానికి అడ్డుకట్టలు అసాధ్యం
రోడ్లమీద మేకులు నాటిన కాలానికి
రహదారులు మూసేసిన కాలానికి
పెద్ద తేడా ఏముండదు
పొలం దున్నిన నాగళ్లు
తెల్లని కాగితాలపై
నల్లని విత్తనాలవుతాయి అంతే...
పెగులుతున్న గొంతుల మీద
వేలాడుతున్న కత్తులు మొద్దుబారుతున్నాయి;
ప్రవాహానికి కోసుకుపోతున్న అంచుల్లో
ఎవడు మాత్రం ఎంతకాలం
తనను తాను రక్షించుకొంటాడు;
జారుతున్న దేహాన్ని జండాకర్రకు కట్టి
సరికొత్త పతాకాన్ని ఎగరేస్తాడు!
- బండ్ల మాధవరావు
88976 23332
7
పదునైన ప్రశ్నలు !
ఒక్క నిప్పురవ్వ రాజుకొని
నిశ్శబ్ద అడవంతా అంటుకొన్నట్టు
ఆగ్రహంతో రగిలిన ఆల్ఫాజెన్లు
అంటించిన యురేనియపు అణువులౌతారు
పుడుతూనే పిడికిలి బిగించి
పుడమిపై పడుతూనే పొలికేక పెడతారు
అంబాడుతూనే అరుగుల్ని చుట్టేసి
అడుగుల తడబడుతూ తారంగమాడేస్తారు
పహరాల్లేని ప్రపంచాన్ని వీడి
హద్దులు గీసిన ఆవరణల్లో చేరి
అసమానతలను ఘోరంగా చవిచూస్తూ
అంధకార అధికారాల్ని నిలబడి ఎదిరిస్తారు
పరిసరాల్ని నిశితంగా పరికిస్తూ
ప్రజాస్వామ్య పాఠాల్ని చక్కగా పఠిస్తారు
సమస్యల తక్షణ పరిష్కారాలకై
అసమ సమయస్ఫూర్తితో స్పందిస్తారు
ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేస్తూ
పదునైన ప్రశ్నలను సూటిగా సంధిస్తారు
ప్రజా ఆందోళనలకు వెనుకంజవేయక
కడు ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకే వేస్తారు
అణచివేతలను తీవ్రంగా ప్రతిఘటిస్తూ
అధికార వీధులను అలలుగా ముంచెత్తుతారు!
పాలకులు వారిని పట్టించుకోకపోతే
పరస్పర తాడిత పరమాణువులై ప్రతిధ్వనిస్తారు!
- కరిపె రాజ్ కుమార్
81251 44729
9.తథ్యం
కిరాతకాలపై పోరాడేది
నేనే రావాలని కాదు
గొంతెత్తే హక్కు బతకాలని
ఆ హక్కుల లెక్కలు చెప్పి
ఏవైనా బొంక గలిగిన
నా కంటే బలమైన
నోటిదుల సన్నాసి రావొచ్చు
రెక్కల కష్టం బలగం నాది
సన్నాసిని సన్నాసని తేల్చగ
అదే హక్కుతో మేమే లేస్తే
నా బలగం సత్తా చూపితే
మమ్మే జనం చూడవచ్చు
తిరుగుబాటు చైతన్యం
శిలేసిన శిల్పం కాదు
జీవ నదిలా సాగే నిత్య ప్రవాహం
అది తూర్పు దిక్కుకే సాగి
ఎర్ర బారుతుంది తథ్యం
కొత్త అడుగేయడం సత్యం
- ఉన్నం వెంకటేశ్వర్లు
10
మా పేరుతో మీ పౌరుషమెందుకు?
మా శరీరాల్ని బూతులుగా మార్చి
మీ రాజకీయాల గోడల మీద రాస్తున్నారెందుకు?
మా గర్భాల్ని మీ జాతుల ఇంక్యూబేటర్లుగా,
మా ప్రేమల్ని మీ మతాల సరిహద్దులుగా
ఎవడు నియమించాడు పాలకులారా?
మేం Gen Z
మీ పాదాల కింద నలిగే కొత్త తరం కాదు,
మీ అబద్ధాల్ని స్క్రీన్షాట్ తీసి
చరిత్ర ముందు పెట్టే ప్రశ్నల తరం!
మా చేతుల్లో ఫోన్లు ఉన్నాయి
మీ విద్వేషపు ప్రసంగాలకంటే
మా నిరుద్యోగమే పెద్ద వార్త కాదా?
మా పరీక్షల ప్రశ్నపత్రాల కంటే
మీ అధికారపు ప్రశ్నలకు లీకులెందుకు లేవు?
మా ఓటు హక్కుకే అనుమతి అడగాలా?
మా ప్రశ్నకు సంకెళ్లు,
మీ అబద్ధానికి జాతీయ జెండానా?
మతం పేరుతో మమ్మల్ని విడగొట్టి
మీ కుర్చీలకు కొత్త రంగులేస్తారా?
మా సోదరి మీద దాడి జరిగితే
ఆమె మతం చూసి న్యాయం చేస్తారా?
మా ఆకలికి కులముందా?
మా కన్నీళ్లకు మతముందా?
వినండి పాలకులారా
మా నాలుకల్ని బూతులతో బంధించలేరు,
మా ప్రశ్నల్ని దేశద్రోహపు ముద్రతో చెరపలేరు!
మీరు దేశమంటే మీరే అంటారు
మరి మేమెవరం?
మీ ఎన్నికల నాటి వేలిముద్రలా
ఐదేళ్లకోసారి గుర్తొచ్చే పౌరులమా?
మేం మీ యుద్ధాలకు ఇంధనం కాము,
మీ విద్వేషానికి చప్పట్లు కాము,
మీ సింహాసనాల కింద పరచిన
మౌనపు తివాచీలం కాము!
మా ప్రశ్నలు వీధుల్లోకి వస్తాయి,
మా గొంతులు పార్లమెంటు గోడల్ని తడుముతాయి
పాలకులారా,
దేశం మీ సొంత ఆస్తి కాదు;
మా భవిష్యత్తు మీ ఎన్నికల ప్రచార పోస్టర్ కాదు!
- ఇబ్రహీం నిర్గుణ్
11
దేవుడా.. రక్షించు నా దేశాన్ని...
దేవుడా... రక్షించు నా దేశాన్ని!
మనుషుల్ని మనుషుల్లాగే ఉంచి గుండెకాయల్ని దొంగిలించే
చోరుల్నుంచి,
తమ అనుయాయిని ఎవరూ ప్రశ్నించలేని అజేయశక్తిగా నిలబెట్టి
ఒకేవొక్క విలువైన హక్కును పౌరుల చూపుడువేళ్ళనుండి చెరిపేసే కుట్రదారుల్నించి,
కాలాన్ని తమ కాళ్ళకింద తొక్కిపట్టి..
ఎదురులేని అధికారం శాశ్వతం కావాలని కలలుగనే దుస్స్వాప్నికుల నుంచి
దేవుడా....! రక్షించు నా దేశాన్ని!
ప్రశ్నల కొడవళ్ళై నూనూగు మీసాలు మెలితిరుగుతున్న వేళ
లాఠీలు.. తూటాలు ..పెల్లెట్లు.. విరుచుకుపడి
కటకటాల కోరలకు లేలేత శరీరాల్ని మేతగా అందించే లోహహస్తాల నుంచి,
మనుషుల మధ్య మతమౌఢ్యాన్ని కఠినశిలాకుఢ్యంగా నిర్మించి..
సనాతనజలాన్ని తీర్థంగా పంచే కుహనా స్వాముల నుంచి
అయోనిజులమని, అందరిలా అమ్మకడుపున పుట్టలేదని
కారణజన్ములమని కట్టుకథలల్లే నటనసూత్రధారుల నుంచి,
దేవుడా...! రక్షించు నా దేశాన్ని!
దిశానిర్దేశం చేసే మహాగ్రంధంలో
పేజీలకు పేజీలే మారిపోయే ప్రమాదం నుంచి,
ఒకటే జాతి, ఒకటే భాష, ఒకటే మతం...
ఒకే రంగు జండా రెపరెపల సందెవెలుగు ఛాయల్లో
పతాక వందనం సమర్పించాల్సిన విపత్తు నుంచి,
చారిత్రిక వాస్తవాన్ని వక్రీకరించి, సాంస్కృతిక వైవిధ్య వైభవాన్ని చెరిపేసి,
నారింజ చెట్టును జాతీయ వృక్షంగా ప్రకటించబోయే కీడు నుంచి,
దేవుడా....! రక్షించు నా దేశాన్ని!
సాంస్కృతిక ఔన్నత్యాన్ని నిర్మూలించి,
మమతానురాగాల ప్రేమైక సౌందర్య ముఖచిత్రాన్ని తొలగించాలనే
చాందసత్వాల, దురూహల దుష్టతంత్రాల నుంచి,
నాల్గుపడగల హైందవ నాగరాజుకు ప్రాణంపోసి,
మనువుకు ఊపిరులూదాలని మనసుపడే మహాజ్ఞానుల మనో వైకల్యం నుంచి,
గిరిశిఖరాలు దూకి, చీకటి లోయల్ని దాటి, కారడవుల్ని అధిగమించి,
మైదానంలో విస్తరించి ఉరకలెత్తే ప్రవాహాన్ని వెనక్కిమళ్ళించాలనే తిరోగమన వాదుల తలపుల్లోంచి,
దేవుడా... రక్షించు నా దేశాన్ని!
దేవుడా...! నిజంగా నువ్వే ఉంటే..
సందెవెలుగు ఆహ్వానంతో ఆవరించబోయే
చిక్కని చీకటితెరలను చీల్చి కొత్త వేకువను ప్రసాదించు
బాకుల్లా విచ్చుకుని కంచై విస్తరించే సహస్రదళ సుమమేల మాకు?
అరుణానురాగ మందారాలు
తెల్లని చల్లని నవ్వుల మల్లెలు
పచ్చాపచ్చని ఆశల పంటచేలు
ఇవి చాలు...
దేవుడా .. అనుమతించు
తండ్రీ... అనుగ్రహించు..!
(తిలక్ను గుర్తు చేసుకుంటూ)
- లాంగుల్య







కామెంట్లు (0)