శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచివరి రోజూ అదే తీరు..

1 గంట క్రితం

1-1792776456585-9128.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 12:22 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

  • కొనసాగిన ‘కూటమి’ దౌర్జన్యం

  • విపక్షాల వారిపై దాడులు

  • నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేత

  • పోలీసుల ప్రేక్షక పాత్ర

ప్రజాశక్తి- యంత్రాంగం : జనం నుండి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ అధికార కూటమి వైఖరిలో ఏ మాత్రమూ మార్పు లేదు. ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఆఖరి రోజైన శుక్రవారం కూడా దాడులు, దౌర్జన్యాలు యథేచ్ఛగా కొనసాగాయి. ప్రత్యర్థి పార్టీల వారి నామినేషన్‌ ‌పత్రాలను లాక్కొని చించివేయడం, నామినేషన్‌ ‌వేయనీయకుండా అడ్డుకోవడం వంటివి చేస్తున్నా పోలీసులు కళ్లప్పగించి చూశారు. మార్కాపురం జిల్లా పామూరు పట్టణంలోని టిడిపి నేతలు బరితెగించారు. పట్టణంలోని ఐదో ఎంపిటిసి స్థానానికి సిపిఎం తరఫున నామినేషన్‌ ‌వేయడానికి వెళ్లిన సయ్యద్ షర్మిల నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేశారు. దీనిపై కలెక్టర్ కు, రాష్ట్ర ఎన్నికల అధికారికి సిపిఎం నేతలు ఫోన్లో ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు పామూరుకు డిఎస్‌‌పి వచ్చి షర్మిలతో నామినేషన్ వేయించాలని ఎస్‌ఐ అనూక్ కుమార్ ను ఆదేశించి వెళ్లారు. దీంతో, ఆమెను సాయంత్రం నాలుగు గంటల సమయంలో నామినేషన్ కేంద్రానికి పోలీసులు తీసుకెళ్లారు. క్యూలో రావాలని అక్కడ ఉన్న టిడిపి నేతలు అడ్డుకున్నారు. క్యూలో ఉన్న షర్మిల వద్ద నుంచి నామినేషన్ పత్రాలను లాక్కొని చించేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఎస్ఐ ముందే ఈ ఘటన జరగడంతో షర్మిల అక్కడే నిరసన తెలిపినా నామినేషన్‌ ‌వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.


ప్రొద్దుటూరులో సిపిఎం అభ్యర్థిపై దాడి

కడప జిల్లా ప్రొద్దుటూరు అమృతనగర్-6 ఎంపిటిసి స్థానానికి నామినేషన్ దాఖలు చేయడానికి ఎంపిడిఒ కార్యాలయానికి వచ్చిన సిపిఎం అభ్యర్థి మురళిపై టిడిపి శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. నామినేషన్‌ పత్రాలను లాక్కొని ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి వాహన డ్రైవర్ యేసు, నారాయణరెడ్డి చించివేశారు. ఈ సంఘటనను పోలీసులు కళ్లప్పగించి చూశారే తప్ప, కనీసం నివారించే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో ఎన్నికల అధికారి వచ్చి మురళితో నామినేషన్‌ ‌దాఖలు చేయించారు.

సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో చేతికి కట్టుతో సిపిఎం నాయకులు ఆంజనేయులు నాయక్సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో చేతికి కట్టుతో సిపిఎం నాయకులు ఆంజనేయులు నాయక్

క్రోసూరులో సిపిఎం నాయకులపై లాఠీఛార్జి, కులం పేరుతో దూషణ

నామినేషన్లు వేయడానికి పల్నాడు జిల్లా ‌క్రోసూరు ఎంపిడిఒ కార్యాలయానికి వచ్చిన సిపిఎం అభ్యర్థులు కుంభ శివకోటేశ్వరరావు (పెరిగపాడు), శాఖమూరి పద్మ (ఊటుకూరు), తిమ్మిశెట్టి హనుమంతరావు (ఎర్రబాలెం)లను, సిపిఎం నాయకులను టిడిపి నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు టిడిపి వారికి కొమ్ముకాసి సిపిఎం వారిపై లాఠీఛార్జి చేశారు. టిడిపి నాయకులు కూడా దాడి చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.అంజనేయులు నాయక్‌‌ను పోలీసులు కులం పేరుతో దూషించి తోసేసి లాఠీలతో కొట్టారు. దీంతో, ఆయనకు చెయ్యి విరగడంతో సత్తెనపల్లె ప్రభుత్వాసుప్రతిలో చికిత్స పొందుతున్నారు.

పత్తికొండ, కోసిగిలో టిడిపి అరాచకం

కర్నూలు జిల్లా కోసిగి, పత్తికొండలో వామపక్ష‍ పార్టీల ఎంపిటిసి అభ్యర్థుల నామినేషన్లకు టిడిపి నాయకులు అడ్డగించారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కోసిగి-5 ఎంపిటిసి సిపిఎం అభ్యర్థి కె.రాముడు, కోసిగి-6 ఎంపిటిసి సిపిఐ అభ్యర్థి ఎం.రాజు నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా టిడిపి నాయకులు అడ్డుకుని నామినేషన్‌ పత్రాలు లాక్కున్నారు. దీంతో, నామినేషన్‌ ‌వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. పత్తికొండ మండలం పత్తికొండ-6 ఎంపిటిసి సిపిఐ అభ్యర్థి నెట్టి కంటయ్య నామినేషన్‌ వేసేందుకు వెళ్తుండగా టిడిపి నాయకులు నామినేషన్‌ పత్రాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. సిఐ జోక్యం చేసుకుని లాఠీఛార్జి చేసి టిడిపి నాయకులపై చెదరగొట్టారు. దీంతో, నెట్టి కంటయ్య వెళ్లి నామినేషన్‌ ‌దాఖలు చేశారు.

మాజీ మంత్రి విడదల రజనిపై ఆమె ఇంట్లోనే మహిళా ఎస్ఐ దౌర్జన్యం

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి, వైసిపి నాయకురాలు విడదల రజనిపై ఆమె ఇంట్లోనే మహిళా ఎస్‌ఐ దౌర్జన్యం చేశారు. ఎస్‌‌ఐ తోసివేయడంతో పడిపోయిన ఆమెకు స్వల్ప గాయమైంది. రజనినీ పోలీసులు గత మూడు రోజులుగా గృహనిర్బంధంలో ఉంచారు. ఆమెను కలిసేందుకు రజని ఇంటికి వచ్చిన యడ్లపాడు జెడ్‌‌పిటిసి వైసిపి అభ్యర్థి కందుల బుల్లబ్బాయిని పోలీసులు లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో, వాగ్వాదం చోటుచేసుకుంది. తనను కలవడానికి వచ్చిన పార్టీ అభ్యర్థిని గేటు వద్దే అడ్డుకోవడం పట్ల పోలీసులను రజని ప్రశ్నించారు. ఆయనను లోపలికి అనుమతించాలని కోరారు. ఈ నేపథ్యంలో చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ ప్రియాంక కలుగజేసుకొని రజనినీ ఇంట్లోకి దౌర్జన్యంగా నెట్టివేయడానికి ప్రయత్నించారు. దీంతో, నేలపై పడిపోయిన రజని చేతికి దెబ్బ తగిలింది.

అనంతపురం జిల్లాలో పోలీసుల సమక్షంలోనే దాడులు

అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో నామినేషన్‌ ‌వేసేందుకు వెళ్తున్న వైసిపి అభ్యర్థులను టిడిపి మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో, టిడిపి, వైసిపి మద్దతుదారులు ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకున్నారు. ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. అనంతరం ఉద్రిక్తల నడుమ వైసిపి నుంచి తొమ్మిది మంది నామినేషన్లు దాఖలు చేశారు. తిమ్మంపల్లి ఎంపిటిసి స్థానానికి వైసిపి ఎవరిని నామినేషన్‌ వేయనీయకుండా టిడిపి మద్దతుదారులు అడ్డుకున్నారు. పెద్దవడుగూరులో ఎంపిటిసి స్థానాలకు నామినేషన్‌ వేయడానికి వెళ్తున్న వైసిపి అభ్యర్థులను టిడిపి మద్దతుదారులు అడ్డుకోవడంతో ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు. వైసిపి అభ్యర్థులను పోలీసులు వారి కార్లలో నేరుగా ఎంపిడిఒ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా మరోసారి టిడిపి, వైసిపి మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వైసిపి మద్దతుదారుడికి చెందిన జీపు అద్దాలు ధ్వంసమయ్యాయి.

పూతలపట్టులో ఉద్రిక్తత... పోలీసుల లాఠీఛార్జి

నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వైసిపి ఎంపిటిసి అభ్యర్థులను చిత్తూరు జిల్లా పూతలపట్టులో పోలీసులు బారికేడ్ల వద్ద అడ్డుకొని వేరే మార్గంలో వెళ్లాలని చెప్పారు. ఈ సందర్భంగా వైసిపి శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్కడికి టిడిపి శ్రేణులు కూడా రావడంతో వివాదం పెద్దదైంది. ఈ క్రమంలో వైసిపి అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్ పత్రాలను టిడిపి వారు లాక్కొని చించివేశారు. దీనిని నిరసిస్తూ వైసిపి శ్రేణులు రోడ్డుపై బైఠాయించాయి. జాయింట్‌ కలెక్టర్‌ జోక్యం చేసుకొని వైసిసి అభ్యర్థులతో నామినేషన్లు వేయించాలని పోలీసులకు ఆదేశించారు. దీంతో పోలీసులు మొదటగా ఒక నామినేషన్ వేయడానికి అనుమతించారు. రెండో నామినేషన్ వేయడానికి వెళ్తుండగా టిడిపి శ్రేణులు అడ్డుకొని దాడి చేసి నామినేషన్‌ పత్రాలను చించివేశాయి. పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. పూతలపట్టు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త సునీల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.

పల్నాడు జిల్లాలో జెడ్‌‌పిటిసి స్థానాలకు నామినేషన్లు వేయలేకపోయిన వైసిసి

పల్నాడులో జిల్లాల్లో అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసూరు, పెదకూరపాడు, దుర్గి, యడ్లపాడు, చిలకలూరిపేట, కారంపూడి, నరసరావుపేట, రెంటచింతల, శావల్యాపురం, వెల్దుర్తి, వినుకొండ తదితర మండలాల్లో వైసిపి వారిని జెడ్‌‌పిటిసి స్థానాలకు నామినేషన్లు వేయనీయకుండా టిడిపి వారు అడ్డుకున్నారు. వైసిపి మాజీ ఎమ్మెల్యేలందరినీ పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఎంపిటిసి స్థానాలకు కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. వైసిపి వారి నుంచి నామినేషన్‌ ‌పత్రాలను లాక్కొని టిడిపి వారు చించివేశారు.

వైఎస్‌ఆర్‌ కడపలో...

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా వేంపల్లి, సింహాద్రిపురం, మైలవరంలో వైసిపి ఎంపిటిసి నామినేషన్లు వేసేందుకు వెళ్తుండగా పోలీసులు, టిడిపి నాయకులు అడ్డంకులు కల్పించారు. పోరుమామిళ్లలో టిడిపి గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు సాగింది. అన్నమయ్య జిల్లాలో గుర్రంకొండలో నామినేషన్లు వేసేందుకు గుంపులుగా వెళుతున్న టిడిపి ‌నాయకులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. పీలేరులో నామినేషన్లు వేయడానికి వెళ్తున్న తమ అభ్యర్థులను కొందరు అడ్డుకుంటున్నారని వైసిపి నాయకులు ఆందోళనకు దిగారు. సోమలలో నామినేషన్ వేసేందుకు అనుమతించాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై వైసిపి అభ్యర్థులు బైఠాయించి నిరసన తెలిపారు.

విశాఖలో నామినేషన్‌ ఉపసంహరించుకున్న వైసిపి అభ్యర్థి భర్తపై దాడి

విశాఖ నగరంలోని జివిఎంసి14వ వార్డు వైసిపి కార్పొరేటర్‌ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్న రెడ్డి కిరణ్మయి భర్త లావేటి దాసుపై ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడి చేసి, ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు అద్దాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఈగల జగదీష్, నక్కాన ఎర్రాజీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూటమి నేతల ప్రలోభాలకు లొంగి నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్టు వైసిపి ఆరోపిస్తున్న దరిమిలా వైసిపి నేతలే ఈ దాడి చేయించినట్టు పలువురు చెప్పుకుంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్