రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 'యోగా డే'లో వివాదాస్పద బాబా రాందేవ్ ముఖ్య అతిథిగా పాల్గొనడం ఆందోళనకరం. అశాస్త్రీయతను వైద్యంగా ప్రచారం చేస్తున్నందుకుగాను ఉన్నత న్యాయస్థానం తీవ్ర మందలింపులకు గురైన వ్యక్తి కూటమి ప్రభుత్వం చేత ఈ గౌరవం పొందడం శాస్త్రీయ విజ్ఞానాన్ని అగౌరవ పరచడమే. హైటెక్ సిటీ నుండి, గూగుల్ డేటా సెంటర్, క్వాంటమ్ కంప్యూటర్ వరకు నిత్యం ఆధునిక విజ్ఞానాల గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, ఈ బాబా ముందు చేసిన విన్యాసాలు 'యోగా' కోసమేనా? అంతకు మించిన మోడీ-షా ల కరుణా కటాక్షాల కోసమా? ఈ బాబా కేవలం యోగా గురువు మాత్రమే కాదు, సంవత్సరానికి సుమారు రూ.70 వేల కోట్ల టర్నోవరు చేస్తున్న వ్యాపారవేత్త. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ ప్రచారం చేస్తూ యావజ్జీవితాన్ని ధారపోసిన వేమన, అన్నమాచార్యులు నడయాడిన నేలపై ఈ విన్యాసాల వినోదాలు ఏమిటి? కాలం చెల్లిన రుగ్మతలను దునుమాడి, ఆధునికత దిశగా ప్రజలను నడిపించడం కోసం కందుకూరి, గురజాడ, త్రిపురనేని రామస్వామి చౌదరి, చలం, కొడవటిగంటి కుటుంబరావు లాంటి ఎందరో మహానుభావులు సాహిత్య, సాంస్కృతిక, సేవా రంగాల ద్వారా కృషి చేసిన తెలుగు నేలపై యోగా కొత్తదేమీ కాదు, ఇందు కోసం కోట్లు తగలెయ్యడం గిరీశం అన్నట్లు 'అధికస్య అధికం ఫలం' కోసమా?
వ్యాపార సాధువు
1965లో హర్యానాలో పుట్టిన రాంకిసాన్ యాదవ్ కాలక్రమంలో రామ్‌దేవ్ బాబాగా అవతరించాడు. పరిమిత ప్రాంతంలో యోగా గురువుగా మాత్రమే గుర్తింపు పొందిన ఈయన 2014కు ముందు ఢిల్లీలో అన్నా హజారే నాయకత్వంలో సాగిన అవినీతి వ్యతిరేక ఉద్యమ వేదికలో యోగాసానాలు చేసి దేశవ్యాపితంగా ప్రాచుర్యం పొందాడు. సాధవు ముసుగులో వున్న ఈయన 2006లో 'పతంజలి ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్' అనే వ్యాపార సంస్థను బాలకృష్ట అనే మరో వ్యక్తితో కలిసి స్థాపించాడు. భారతీయ రుషిగా, యోగా గ్రంథాన్ని రచించిన వ్యక్తిగా ప్రచారంలో వున్న పతంజలి పేరును తన కంపెనీకి పెట్టుకోవడంలోనే ఈయన లక్ష్యం స్పష్టమవుతుంది. 2007 నాటికి దాని వార్షిక టర్నోవర్ రూ.51 కోట్లు. 2014లో మోడీ అధికారంలోకి రావడంతో ఈ వ్యాపార బాబా దశ తిరిగింది. పాలకుల ఆశీస్సులతో యోగా గురువుగా దేశమంతటా పర్యటిస్తూ తన వ్యాపార సామ్రాజ్యమైన పతంజలి గ్రూప్‌ను ప్రోత్సహించడానికి మతం, జాతీయవాద భావాలను ఉపయోగించుకున్నాడు. హిందూ మతాచారాలు, సాంప్రదాయాలను విస్తృతంగా వాడుకున్నాడు. 'ఇంతింతై వటుడింతయై' అన్నట్లు 2016-17 నాటికి రూ.10,561 కోట్లు, 2024లో రూ.67 వేల కోట్లు, ప్రస్తుతం సుమారు రూ.70 వేల కోట్ల టర్నోవరు చేయగలుగుతున్నాడు. ప్రస్తుతం ఈయన దృష్టి విద్యా రంగం మీదకు మళ్ళింది (రాజపోషకులు మళ్ళించారేమో!).
మత విద్వేషాలతో వ్యాపారం
మత విద్వేషాలు రాజకీయ అస్త్రంగా మారిపోయిన తరుణంలో ఈ అంశాన్ని వ్యాపారంతో బాబా రాందేవ్ మేళవించాడు. తనను తాను యోగా గురువుగా ప్రకటించుకున్న ఈయన తమ సరుకుల అమ్మకానికి మతపరమైన చిహ్నాలను, భావాలను చాకచక్యంగా ఉపయోగించుకున్నాడు. ప్రాచీన వైద్యంగా ప్రజల్లో విస్తృత ప్రచారంలో వున్న యోగాను తన ప్రచార అస్త్రంగా మార్చుకున్నాడు. మెజారిటీ మతస్తులను ఆకర్షించడం కోసం ఒకవైపు ఈయన బ్రాండ్లకు సంస్కృత పదాలను ఉపయోగిస్తూ, మరోవైపు ఆధునిక వైద్యాన్ని కించపరుస్తూ లబ్ధి పొందుతున్నాడు. కోవిడ్ సమయంలో తమ కంపెనీ తయారు చేసిన 'కరోనిల్' అనే ఔషధాన్ని అమ్ముకునేందుకు అల్లోపతి వైద్యంపై నిందారోపణలు చేశాడు. 'అల్లోపతి తెలివిలేని శాస్త్రం' అని, కరోనాలో అల్లోపతి మందులు వాడిన తర్వాతే ఎక్కువ మంది చనిపోయారని తీవ్రమైన విమర్శలు చేశాడు. చనిపోయిన వారిలో ఎందుకని ముస్లింలు ఎక్కువ లేరని అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలు పొరపాటుగా అన్నవి కాదు, రాచరిక వ్యవస్థను తిరిగి ప్రతిష్టించాలనే రాజకీయ ఎజెండా, తన కంపెనీ వస్తువుల అమ్మకం కోసం ఆధునిక విజ్ఞానాన్ని కించపరచడం, మత వైషమ్యాలను సృష్టించడం అనే బహుముఖ వ్యూహంలో భాగంగా ఆయనలా అన్నాడు. రాందేవ్ బాబా మాటలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. దేశంలో అనేక ప్రాంతాల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.హర్షవర్ధన్ అనివార్యంగా స్పందించాల్సి వచ్చింది. సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పాడు.
అయితే ఈ వివాదం తన సరుకుల అమ్మకాలకు, పాలకుల ప్రశంసలకు మంచి ప్రయోజనకారిగా భావించి వివాదాలను వ్యాపార వ్యూహంగా మార్చుకున్నాడు. 2022 నవంబరు 25న మహిళల దుస్తుల మీద, 2023 ఫిబ్రవరి 16న ఢిల్లీ లోని రాంలీలా మైదానంలో జరిగిన సభలో 'ముస్లింలందరూ ఉగ్రవాదులే' అన్నాడు. మరో సభలో 'భారత మాతా కి జై అననివాని తల నరకి చంపేయాలని వుంది, అయితే చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పని చేయలేకపోతున్నాను' అన్నాడు. 2025 ఏప్రిల్ 1న 'షర్బత్ జిహాద్' అని మరో వివాదాన్ని సృష్టించాడు. వేసవి కాలంలో తాగే చల్లని పానీయం 'గులాబ్ షర్బత్, ఖుస్ షర్బత్'ను పతంజలి కంపెనీ తయారు చేసింది. వీటిని అమ్ముకోవడానికి 1906 నుండి పాత ఢిల్లీ లోని లాల్ కువాన్‌లో 'హమ్దార్డ్ లాబరేటరీస్ లిమిటెడ్' తయారు చేస్తున్న షర్బత్‌పై ద్వేషం పెంచడానికి ఆయన ఇలా మాట్లాడారు. ముస్లిం కంపెనీ కంటే తమ కంపెనీ షర్బత్ ఎంత నాణ్యమైందో చెప్పుకోవడం కాకుండా, ఆ షర్బత్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో మదర్సాలు, మసీదులు నిర్మిస్తారని, తన షర్బత్‌ను కొనడం ద్వారా గురుకులాలకు, దేవాలయాలకు మద్దతు ఇవ్వాలని ఈ రాందేవ్ బాబా ప్రచారం చేసుకున్నాడు. ఈయన కేవలం ఉత్పత్తి అయిన సరుకులు మాత్రమే అమ్మడంలేదు, ఒక భావజాలాన్ని అమ్ముతున్నారని తేలికగా గుర్తించవచ్చు. ఏ కొనుగోలుదారుడైనా నాణ్యతను చూసే కొంటాడనేది నిజం. అయితే గత 12 ఏళ్ళుగా సామాజిక జీవనంలోని ప్రతి అంశం మతం చుట్టూ పరిభ్రమిస్తున్నప్పుడు, మతపరమైన ఆకర్షణకు ప్రభావితమయ్యే వారి సంఖ్య పెరుగుతుందనే వ్యాపారత త్వాన్ని గుర్తించిన వ్యక్తి రాందేవ్. అందుకే సున్నితమైన మత విశ్వాసాన్ని రెచ్చగొట్టడం ద్వారా మెజారిటీ ప్రజల్లో వచ్చే ఆగ్రహం, ఖరీదైన వ్యాపార ప్రకటనల కంటే వివాదం వేగంగా వ్యాపిస్తుందని గుర్తించి, దానిని సొమ్ము చేసుకోవ డంలో రాందేవ్ బాబా దిట్ట అని పదేపదే రుజువవుతుంది.
కేంద్ర బిజెపి ప్రభుత్వం అన్ని రంగాల్లోకి విదేశీ కంపెనీలను యథేచ్ఛగా అనుమతిస్తుంటే ఏనాడూ ఒక్క మాట మాట్లడని ఈ బాబా తన సరుకులకు పోటీగా వున్న యూని లివర్, ప్రాక్టర్ అండ్ గాంబెల్ లాంటి బహుళజాతి కంపెనీలను స్వదేశీ ముసుగు నుండి విమర్శలు చేస్తుంటాడు. ప్రస్తుతం దేశంలో వినియోగ వస్తువులు అత్యధికంగా అమ్ముకుంటున్న హిందుస్తాన్ లివర్ తర్వాత రెండో స్థానం పతంజలి కంపెనీవే. ఈ పోటీలో తాను మొదటి స్థానం లోకి రావడానికి....సంపద బయటకు వెళ్లకూడదనే ఈ సరుకులు ఉత్పత్తులు చేస్తున్నాని, వాటిని కొనడం దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవడమేనని చెబుతూ దేశభక్తిని కూడా సొమ్ము చేసుకుంటున్నాడు. బిస్కట్ల నుండి షాంపూల వరకూ, నెయ్యి నుండి బాడీ లోషన్ వరకు 500 రకాల సరుకులను 'పతంజలి` తయారు చేసి మార్కెటింగ్ చేస్తుంది.
కార్మికుల పొట్టగొట్టి...
హరిద్వార్ లోని 'పతంజలి ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్'లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, కార్మిక చట్టాలు అమలు కావడంలేదనే విమర్శలు చాలా కాలంగా వున్నాయి. వారానికి ఆరు రోజులు, రోజుకు 12 గంటల పని, నెలకు ఆరు నుండి ఎనిమిది వేల లోపు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక చేసిన సర్వేలో కార్మికులు చెప్పారు. 'స్వార్థపరుడు మాత్రమే జీతం పెంపును అడుగుతాడు' అని ప్రచారం చేయడం ఇక్కడ సర్వసాధా రణమని కార్మికులు చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. తనకు ఏ ఆస్తులు అక్కరలేదు, ఇదంతా దేశం కోసమేనని చెప్పే ఈయన అక్రమంగా దళితులు భూములను ఆక్రమించి ఫ్యాక్టరీ నిర్మించాడనే విమర్శలను ఇప్పటికీ ఎదుర్కొంటూనే వున్నాడు. పరిశ్రమ వాతావారణానికి భిన్నంగా ఇక్కడి కార్మికులు కాషాయ వస్త్రాలు ధరించడం, రాందేవ్ బాబా, వారి వ్యాపార భాగస్వామి బాలకృష్ణలకు పాదాభివందనం చేయడం, కుర్చీలపై కాకుండా నేలపై కూర్చోవడం లాంటి పద్ధతులు పాటించాల్సిందేనట!
ఇలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి యోగాలు చేయించడం ద్వారా ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకున్నారో కూటమి నేతలకే తెలియాలి. ప్రగతిశీల భావాలకు పుట్టినిల్లు అయిన తెలుగు నేల ఇలాంటి వాటిని తిరస్కరిస్తుందని ఆశిద్దాం.
వి. రాంభూపాల్









కామెంట్‌లు (0)