అయోధ్య రామాలయంలో ఏం జరుగుతుందన్న ప్రశ్న భక్తుల నుంచి ఎదురవుతున్నది. భక్తులు ఇచ్చిన సొమ్ములు, బాల రాముని ఆభరణాలు, ఆస్తులు భద్రమేనా? అన్న సంశయం వీరిలో వ్యక్తమవుతున్నది. అయోధ్య ఆలయంలో భక్తులు ఇచ్చిన కానుకలు, రాముని ఆభరణాలు చోరీకి గురయ్యాయని గత కొంతకాలంగా విమర్శలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ స్పందించలేదు. పైగా ఇవి ఆరోపణలేనని కొట్టిపారేస్తూ వచ్చారు. రామ జన్మభూమి ట్రస్టులో వివాదాలు ముదిరి ఒకరిపై... మరొకరు ఆరోపణలు చేసుకునే స్థాయికి వెళ్ళటంతో రాముని ఆలయంలో ఏం జరుగుతుందన్న చర్చ ... జాతీయ మీడియాలో చోటు చేసుకోవడంతో ఈ సమస్యపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనివార్యంగా స్పందించాల్సి వచ్చింది. ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
2025 జనవరి-ఫిబ్రవరి నెలలలో జరిగిన మహా కుంభమేళా సందర్భంగా హుండీల ద్వారా వచ్చిన సొమ్ముకు లెక్కా పత్రం లేకుండా పోయిందని ‘సిట్’ గుర్తించింది. బంగారం, వెండి, నగలు, వజ్రాలు వంటి కానుకలకు వచ్చిన రసీదులకు... ఆలయంలో ఉన్న రికార్డులకు సరిపోలటం లేదని తేలింది. మహా కుంభమేళా సందర్భంగా ప్రతిరోజూ 10 లక్షల మంది భక్తులు అయోధ్యను సందర్శించారని, హుండీలు గంటల వ్యవధిలో నిండిపోయేవని, రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగిందని, ఈ రెండు నెలల పాటు వచ్చిన విరాళాలు, కానుకలకు సరైన లెక్కలు లేవని తేలింది. సి.సి టీవీ ఫుటేజీలను డిలీట్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో ఆలయ సిబ్బంది తమకు తెలియకుండా అయోధ్య విడిచి వెళ్ళకూడదని ఉద్యోగులకు ‘సిట్’ ఆంక్షలు పెట్టింది.
దేశంలోని ఆలయాలన్నింటినీ ప్రభుత్వ పెత్తనం నుంచి తొలగించి... అయోధ్య తరహాలో హిందూ సమాజానికి అప్పగించాలని, ఆర్ఎస్ఎస్ అనుయాయ సంఘాలు దేశమంతటా హిందూ శంఖారావ సభలు పెట్టి యాగీ చేస్తున్న సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకోండి. స్వయంగా ప్రధాని మోడీ 11 రోజులపాటు ప్రత్యేక దీక్షను చేపట్టి 2024 జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన అతిథిగా పాల్గొని మోడీ చేసిన ప్రసంగంలో...శతాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికామని, రామ మందిరాన్ని దేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా అభివర్ణించిన విషయం గుర్తుందిగా!
2024 ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసం మోడీ, ఆయన పరివారం... ఆర్ఎస్ఎస్ బృందం పెద్ద ఎత్తున హడావిడి చేసి దేశవ్యాప్తంగా ఆలయ ప్రారంభ కార్యక్రమాన్ని ఓ ఈవెంట్ లా మార్చి ప్రచారం పొందిన విషయం గుర్తుండే ఉంటుంది.
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆలయ వ్యవహారంలో బిజెపి పరివారానికి దేవుని మీద భక్తి కంటే... దేవుని ఆస్తులు, కానుకలు, హుండీల మీదనే కన్ను ఉన్నట్టుగా నిరూపితమైంది.
అయోధ్యలోని రామ మందిర నిర్వహణ ట్రస్టు విడుదల చేసిన ఆదాయ వివరాలను పరిశీలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆలయం మొత్తం ఆదాయం సుమారు రూ. 327 కోట్లు. ప్రకటించిన ఆదాయంలో భక్తుల విరాళాలు రూ153 కోట్లుగా పేర్కొన్నారు.
తిరుమలలో రోజుకు 70 వేల నుంచి 75 వేల మంది భక్తులు వస్తుంటారు. సెలవు, ప్రత్యేక దినాలలో 90 వేల నుంచి లక్ష మందికి పైగా వస్తుంటారు. టిటిడి కి రోజుకు సరాసరిన రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఆదాయం ఉంటుంది. తిరుమల ఆలయంలో లక్ష మంది లోపు దర్శించుకుంటే సరాసరిన రోజుకు రూ. నాలుగు కోట్ల ఆదాయం వస్తుంటే అయోధ్య ఆలయాన్ని 2025 జనవరి - ఫిబ్రవరి నెలలలో రెండు నెలల పాటు సరాసరిన 10 లక్షల మంది ప్రతిరోజూ దర్శించుకుంటే ఆదాయం ఏ స్థాయిలో ఉండాలి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రామ మందిరం ట్రస్ట్ ప్రకటించిన వార్షిక ఆదాయంపై అనుమానాలు ఎవరికైనా తలెత్తుతాయి. సామాన్యునికైనా కలిగే ఈ సందేహాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి గానీ కేంద్రం నుంచి కానీ సమాధానం లేదు. అయోధ్య ఆలయంలో జరుగుతున్న తంతుపై హిందుత్వ వాదులు కిమ్మనకుండా కూర్చున్నారు. దేశంలోని ఆలయాలను హిందూ సమాజానికి అప్పజెప్పాలని, ప్రభుత్వ పెత్తనం నుంచి విముక్తి కల్పించాలని... దేశమంతటా హిందూ శంఖారావం పేరిట సభలు జరుపుతున్న విశ్వహిందూ పరిషత్ పెద్దలకు, అయోధ్య ఆలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధుసంతులకు ఎందుకు నోట మాట రావడం లేదు? తిరుమల ఆలయ వివాదాలైతే అయినదానికి, కానిదానికి విరుచుకుపడే పెద్ద మనుషులకు నోరు పెగలక పోవడానికి కారణం... ఈ వివాదాల వెనుక మోడీ పరివారం ఉన్నందునేనా! బాల రాముడికి... బాలారిష్టాలు తప్పిపోయి... భక్తి విశ్వాసాలతో భక్తులు సమర్పించిన కానుకలకు భద్రత వుండాలని కోరుకుందాం.
కందారపు మురళి









కామెంట్‌లు (0)