మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రహసనంగా ప్రజాస్వామ్యం..

15 గంటల క్రితం

violcens
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

​రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ఆధిక్యం సాధించింది. కానీ, ఈ విజయాల వెనుక ఎన్నికల ప్రక్రియలో అడుగడుగునా పాలక కూటమి అనుసరించిన నిరంకుశ పద్ధతులను ప్రజాస్వామ్య వాదులు నిరసిస్తున్నారు. నామినేషన్ల దశ నుంచే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను అడ్డుకోవడం, దాడులు చేయడం, బెదిరించడం, నామినేషన్‌ పత్రాలను చింపివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికారిక సమాచారం ప్రకారంం మున్సిపల్‌ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా 261 కేసులు నమోదయ్యాయి. పరిషత్‌ ఎన్నికలలో నామినేషన్ల సందర్భంగా 13 జిల్లాల్లో 31 కేసులు నమోదయ్యాయి. పరిషత్‌ ఎన్నికల కేసులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రావాల్సిఉంది. పోలీసులు నమోదు చేసిన వాటిలో కొన్ని అధికారపక్షం బనాయించినవి కాగా, మిగిలినవి బెదిరింపులు, దౌర్జన్యాలు అధిగమించి స్టేషన్లదాకా వచ్చినవి! పోలీస్‌‌ స్టేషన్‌ ‌దాకా రాలేని వారు, రాని వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. పోలింగ్‌ సమయంలోనూ ప్రతిపక్ష ఏజెంట్లను కేంద్రాల నుంచి బయటకు పంపడం, దాడులు, రిగ్గింగ్‌ వంటి ఆరోపణలతోపాటు కౌంటింగ్‌ ‌సమయంలోనూ ఈ తరహా అక్రమాలకు పాల్పడ్డారంటూ వార్తలు రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఎన్నికల్లో గెలవడం ఒక ఎత్తయితే, ప్రత్యర్థులకు స్వేచ్ఛగా పోటీ చేసే అవకాశం కల్పించడం మరో ఎత్తు. రాష్ట్రంలో అటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగలేదన్నది జనవాక్యం!

పోలీస్‌ ‌యంత్రాంగంతో పాటు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ‌వ్యవహార తీరు కూడా ఈ ఎన్నికల్లో ప్రశ్నార్ధకంగా మారింది. అక్టోబరు 21న సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థుల ఫిర్యాదులు, ఆధారాలను పరిశీలించి అవసరమైన చోట్ల గడువు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు అక్టోబరు 22న నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్ల గడువును 48 గంటలు పొడిగించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఆదేశాల తరువాత జరిగిన పరిషత్‌ ‌ ఎన్నికల నామినేషన్ల సందర్భంగానూ అధికార కూటమి అక్రమాలు ఏ మాత్రం ఆగక పోవడం బరితెగింపునకు నిదర్శనం. నిజానికి ఎన్నికల సంఘం స్వతంత్రంగా, పారదర్శకంగా వ్యవహరించి ప్రతి ఫిర్యాదుపై నిష్పాక్షిక విచారణ జరపాల్సి ఉంది. అక్రమాలకు సంబంధించిన ఆధారాలను పరిశీలించి, తప్పు చేసినవారు ఏ పార్టీకి చెందినవారైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ఆరోపణలు నిజమని తేలిన చోట నిబంధనల ప్రకారం రీపోలింగ్‌ నిర్వహించాలి. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టడం ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం బాధ్యత. అలా వ్యవహరించకుండా అత్యధిక చోట్ల పోలీసులు అధికార కూటమి కనుసన్నల్లో పనిచేశారన్నది జగద్విదితం. కొన్నిచోట్ల రిటర్నింగ్‌ ఆఫీసర్ల కస్టడీలో ఉన్న నామినేషన్‌ ‌పత్రాలు, బి-ఫారాలు సైతం చించివేశారన్న ఆరోపణలు సత్యదూరం కాదు. ప్రభుత్వ అధికారులు, పోలీస్‌ ‌యంత్రాంగం ప్రజలకు, ప్రజాస్వామ్యానికి విధేయులుగా వుండాలి తప్ప అధికారంలోని పార్టీకి సేవ చేయడానికి కాదు. అధికారపార్టీ ఒత్తిళ్ల మధ్య చట్ట ప్రకారం, నిజాయితీగా వ్యవహరించడం చిన్న ఉద్యోగులకి కొంత కష్టం కావచ్చు. కానీ, ఉన్నత స్థాయి అధికారులు సైతం ప్రలోభాలాకో, ఒత్తిళ్లకో తలొంచితే ఎలా? చిత్తశుద్ధితో, నిజాయితీగా పనిచేశామా లేదా అన్నది వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ ఎన్నికలలో తాము బాధితులమని ఒక వైపు చెబుతూనే మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఇదే తరహాలోనో, ఇంతకు రెండింతలుగానో వ్యవహరిస్తామని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ‌మోహన్‌‌రెడ్డి సంకేతాలు ఇవ్వడం ఏ మాత్రం సరికాదు.

ప్రస్తుత ఎన్నికలు జరిగిన తీరును బీహార్‌‌తో పోలుస్తూ తాము అధికారంలోకి వస్తే దానినే కొనసాగిస్తామని చెప్పడంలో అర్ధం ఏమిటి? రాష్ట్రాన్ని రావణకాష్టంలా రగిలించడంలో పోటీ పడితే ఇక అభివృద్ధి ఎక్కడ? ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం, మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం మాత్రమే కాదు. ప్రతిపక్షానికి పోటీ చేసే హక్కు, ప్రచారం చేసుకునే హక్కు, ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలి. ప్రజాస్వామ్యంలో ఇవి అంతర్భాగాలు. అధికార బలాన్ని, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ప్రతిపక్షం గొంతు నొక్కడం, దానికి ప్రాతినిధ్యం లేకుండా చేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. స్థానిక సంస్థలు గ్రామీణ, పట్టణ ప్రజల సమస్యలను ప్రతిబింబించాలి. అది జరగాలంటే, ప్రతిపక్షం గొంతు వినిపించాలి. దీనికి భిన్నంగా అన్నీ అధికార కూటమికే దక్కాలన్న వైఖరి ఏ మాత్రం వాంఛనీయం కాదు. అధికార కూటమి ఎంత భయానక పరిస్థితులను సృష్టించినా, ఏమాత్రం భయపడకుండా గణనీయమైన స్థానాల్లో ప్రతిపక్షాన్ని ప్రజలు గెలిపించారు. డబ్బు, మద్యం వంటి అనేక అక్రమాలను తిరస్కరించి పరిమిత స్థానాల్లోనైనా వామపక్షాల అభ్యర్థులను ఎన్నుకోవడం అభినందనీయం. ఎన్నికల అక్రమాలను ప్రశ్నించడం, బాధితులకు అండగా నిలవడం, అధికార దుర్వినియోగాన్ని వ్యతిరేకించడం ప్రతి ఒక్కరి బాధ్యత! ఆ దిశలో ప్రజలను చైతన్య పరచాలి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్