‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పింపగన్’... అంటూ కవి పలికిన మాటలు నేడు విజయకేతనాలై రెపరెపలాడుతున్నాయి. అమ్మాయిలకు నేర్పిస్తే నేర్చుకోలేని విద్య ఏదైనా ఉందా? అవకాశం కల్పిస్తే అందుకోలేని శిఖరం ఏదైనా ఉంటుందా? జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల విజయాలను చూస్తుంటే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. శనివారం నాటికి భారత బృందం సాధించిన 80 పతకాల్లో 18 స్వర్ణాలు, 26 రజతాలు, 36 కాంస్యాలు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా అమ్మాయిలు సాధించినవే కావటం దేశానికి గర్వకారణం. ఇది మహిళలు ఆటల్లో సాధించిన విజయం మాత్రమే కాదు; వారి సామర్థ్యాలను చిన్నచూపు చూసే సామాజిక దృక్పథంపై సాధించిన విజయం కూడా!
భారత మహిళల హాకీ జట్టు 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించి స్వర్ణం సాధించింది. ఫైనల్లో చైనాను ఓడించి 2028 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సంపాదించింది. ఆర్చరీలో 17 ఏళ్ల కుమ్‌కుమ్ మొహద్ వ్యక్తిగత రికర్వ్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. షూటింగ్‌లో నీరూ ధాండా మహిళల ట్రాప్ విభాగంలో స్వర్ణం సాధించి, ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహెయిన్, పర్వీన్ హూడా పసిడి పతకాలు సాధించారు. ఒక్కో పతకం వెనుక ఒక్కో కథ ఉంది. నీరూ ధాండా హర్యానాలోని పేద రైతు కుటుంబం నుంచి వచ్చింది. అరువు తెచ్చుకున్న తుపాకీతో సాధన మొదలుపెట్టి అంతర్జాతీయ వేదికపై స్వర్ణం సాధించింది. కుమ్‌కుమ్ మొహద్ ప్రయాణం అమ్మమ్మ ఇచ్చిన మూడు వేల రూపాయలతో కొన్న సాధారణ చెక్క విల్లుతో మొదలైంది. ఆమె తండ్రి స్వీట్ దుకాణాలకు అట్టపెట్టెలు తయారు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కుటుంబం ఆమె ఆశయానికి అండగా నిలిచింది. ప్రతిభకు పేదరికం అడ్డుకావచ్చు. కానీ పట్టుదలకు కుటుంబ ప్రోత్సాహం, సరైన శిక్షణ, అవకాశాలు తోడైతే అసాధ్యమనుకున్న లక్ష్యాలను సైతం చేరుకోవచ్చని ఈ విజయాలు నిరూపిస్తున్నాయి.
‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నారు పెద్దలు. అలా అని కేవలం కృషి ఉంటే సరిపోదు. ఆ కృషికి తోడ్పడే వాతావరణం కూడా ఉండాలి. ఒక అమ్మాయి క్రీడాకారిణి కావాలంటే మైదానం, శిక్షకులు, పరికరాలు, ఆర్థిక సహాయం కావాలి. మన సమాజంలో అబ్బాయిలకు లభించే ప్రోత్సాహం అమ్మాయిలకు దొరకదు. ఇంటి పరువు పేరుతో రకరకాల ఆంక్షలు, భద్రత పేరుతో ప్రయాణాలపై పరిమితులు నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. శిక్షణ పొందే చోట కూడా వివక్షను, వేధింపులనూ ఎదుర్కోవాల్సి రావటం మరొక దారుణం. దేశానికి ఎన్నో పతకాలు తెచ్చిపెట్టిన వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్ వంటి మహిళా రెజ్లర్లు తమను లైంగికంగా వేధించిన అప్పటి భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై పోరాటానికి దిగినా తగిన న్యాయం దొరకలేదు. “స్త్రీలు పుట్టరు... తయారు చేయబడతారు” అన్నారు ఫ్రెంచ్ తత్వవేత్త సిమోన్ ద బువార్. రకరకాల పేరుతో బాల్యం నుంచే అనేక నియంత్రణలు, నిషేధాలూ విధించి, అమ్మాయిలను ప్రధాన స్రవంతి నుంచి వేరు చేస్తోంది సమాజం. వేధింపులతో బరితెగిస్తుంది పురుషాధిపత్య భావజాలం. అయినా, ఆ కంచెలను కూల్చి, ఆధిపత్యాన్ని ఎదిరించి మహిళలు తమను తాము నిరూపించుకోవటం అభినందనీయం!
‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటూ కీర్తించే సనాతనం మహిళ ఏ దశలో ఎవరిపై ఆధారపడాలో శ్లోకాలు వల్లిస్తుంది. నియమాలూ నిబంధనల పేరిట అడ్డుకంచెలు నిర్మిస్తుంది. ఒకవైపు దేవత అని భజిస్తూనే మరోవైపు మనిషిగా ఆమెకు ఉండాల్సిన స్వేచ్ఛను హరించడం ఎంతటి వైరుధ్యం! మతం, సంప్రదాయం, మార్కెట్... రూపాలు ఏవైనప్పటికీ మహిళను రెండో స్థానంలో ఉంచే ధోరణిని అవి పాటిస్తున్నాయి. మహిళలు సమీపంలో ఉంటేనే అపవిత్రం అన్నట్టుగా ఆ మధ్య ఈఫిల్ టవర్ ఎక్కిన సనాతన చాదస్తుల లింగ వివక్ష ప్రపంచవ్యాప్తంగా నవ్వులపాలైంది. దేవుడి ముందు అందరూ సమానులని చెప్పే చోట మహిళల్లో అపవిత్రతను వీక్షించడం హీనదృష్టి తప్ప మరొకటి కాదు. మార్కెట్ కూడా మహిళను స్వేచ్ఛగల వ్యక్తిగా కాకుండా, అమ్మకాలకు ఉపయోగపడే వస్తువుగా చూస్తోంది. సబ్బుల నుంచి కార్ల వరకు అనేక ఉత్పత్తుల ప్రకటనల్లో మహిళ శరీరాన్ని ఆకర్షణీయమైన ప్రచార సాధనంగా ఉపయోగించటం కార్పొరేట్ల వికృత దృష్టికి నిదర్శనం. మహిళా సాధికారతను ప్రచారం చేస్తూనే ఆమె అందాన్ని, శరీరాన్ని వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం దాని ద్వంద్వ వైఖరి, నీచ సంస్కృతి! అలాగే వివక్ష మన భాషలోనూ, సామెతల్లోనూ, రోజువారీ సంభాషణల్లోనూ ఇంకిపోయింది. చేతగానితనాన్ని ఎత్తిచూపడానికి ‘గాజులు తొడుక్కున్నావా?’ అనటం, ‘మగాడిలా నిలబడు’ అని బోధించటం, ‘మగాడివైతే రా’ అంటూ సవాలు చేయటం పురుషాధిపత్య పైత్యానికి ప్రతీకలు. భాషలో, ప్రవర్తనలో ఈ కించపరిచే పోలికలు, ధోరణులు తొలగినప్పుడే ఆలోచనల్లోనూ సమానత్వానికి చోటు ఏర్పడుతుంది.
ప్రతిభ ఒక విత్తనం అయితే అవకాశం దానికి నేల. శిక్షణ నీరు. ప్రోత్సాహం వెలుతురు. ఇవన్నీ అందినప్పుడే అది మహావృక్షమవుతుంది. విద్య, విజ్ఞానశాస్త్రం, కళలు, క్రీడలు, రాజకీయాలు, పరిపాలన, వ్యాపారం... ఏ రంగమైనా మహిళలు తమదైన ముద్ర వేయగలరు. అందుకు సమాన విద్య, ఆర్థిక స్వావలంబన, సమాన గౌరవం, భద్రత, నిర్ణయాధికారం కల్పించాలి. అమ్మాయిలకు నేర్పించకుండా, సాధనకు తోడ్పడకుండా, వారి కలలకు కంచెలు వేసి, సామర్థ్యానికి సంకెళ్లు వేసి, ఆ తర్వాత ‘వాళ్ల వల్ల ఏమవుతుంది?’ అని ప్రశ్నించడం అన్యాయం! అడ్డంకులు తొలగిస్తే అమ్మాయిలు సాధించలేనిదంటూ ఏదీ లేదని ఎప్పుడో రుజువైపోయింది! చాందసవాదులు, ఆధిపత్య ప్రేలాపకులు, మార్కెట్ బేహారులు తమ తమ తలకాయలను ప్రక్షాళన చేసుకొని, మహిళల పట్ల చిన్నచూపును వదిలించుకోవటం ఒక్కటే మిగిలింది!







కామెంట్‌లు (0)