అరెస్టు చేసిన వ్యక్తిని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాల్సిన 24 గంటల గడువు, పోలీసులు అరెస్టును లాంఛనంగా నమోదు చేసినప్పటి నుంచి కాదు, ఒకరి స్వేచ్ఛను వాస్తవంగా హరించిన క్షణం నుంచే మొదలవుతుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేయడం పోలీసు నిర్బంధానికి ముకుతాడు వేయడంగా భావించవచ్చు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ల ధర్మాసనం ఇచ్చిన ఈ రూలింగ్ పౌర స్వేచ్ఛల పరిరక్షణలో కీలక ముందడుగు. సంబంధిత వ్యక్తిని పోలీసులు ముట్టుకున్నప్పటి నుండి లెక్కించాలని ధర్మాసనం నిరిష్టంగా చెప్పింది. పోలీసులు తరచూ ఉపయోగించే తెలివైన ఎత్తుగడను ఈ రూలింగ్ పూర్తిగా నిరోధించింది. దర్యాప్తు పేరుతో కొన్ని గంటలో, కొన్ని రోజులో ఎవరినైనా అనధికారికంగా నిర్బంధించి, ఆ తర్వాత కాగితాల్లో అరెస్టు చూపించడం ఇకపై చెల్లదు. మాదకద్రవ్యాల నిరోధ చట్టం కింద నమోదైన కేసులో నిందితులను 2025 సెప్టెంబరు 29 మధ్యాహ్నం 2 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టును మాత్రం మరుసటి రోజు ఉదయం 11 గంటలకు చూపించారు. దాదాపు 18 గంటల పాటు వారు అక్రమ నిర్బంధంలో ఉన్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనేనని చెప్పిన న్యాయపాలిక, ‘అరెస్టు’, ‘నిర్బంధం’ అనే రెండు పదాల మధ్య కృత్రిమ తేడా సృష్టించడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. అలాగే, 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 57 రెండు విభిన్న పరిమితులను నిర్దేశిస్తుందని కోర్టు వివరించింది. సమాచారాన్ని రాబట్టేందుకు, బలవంతంగా అపరాధాన్ని అంగీకరించేలా చేయడానికి దర్యాప్తు సమయంలో పోలీసులు కస్టడీలో హింసించడం హీనమైనదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రయాణ సమయం తప్ప మరేదీ 24 గంటల నుంచి మినహాయించరాదన్న కోర్టు అభిప్రాయం సముచితం. ఒరిస్సా, కేరళం, మద్రాస్ హైకోర్టులు గతంలో వెలిబుచ్చిన విరుద్ధ అభిప్రాయాలను ధర్మాసనం తిరస్కరించింది.
యుఎపిఎ కేసుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ), రాష్ర్టానికి చెందిన ప్రత్యేక పోలీసు దళాలు నిందితులను అనేక రోజుల పాటు రహస్యంగా నిర్బంధించి, విచారిస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రూలింగ్ ప్రకారం నిందితుడి స్వేచ్ఛను హరించిన క్షణం నుండే లెక్క ప్రారంభమవుతుంది. దీంతో యుఎపిఎ కింద ఎప్పుడో ఆధీనంలోకి తీసుకుని, ఇప్పుడే అరెస్ట్ చేశామంటే ఇక నుండి చట్టం అనుమతించదు. అయితే, యుఎపిఎ లాంటి కఠిన చట్టాలైనా, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను దర్యాప్తు సంస్థలు కాలరాయలేవని సర్వోన్నత న్యాయస్థానం రూలింగ్ పునరుద్ఘాటించింది.
తెలుగునాట ఇలాంటి ఉల్లంఘనలూ నమోదు కావడం ఆందోళనకరం. ఈ ఏడాది రాష్ట్రంలో వరుసగా వెలుగుచూసిన ఘటనలు పోలీసు వ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయి. విజయవాడలో గాదె సాయికృష్ణ కేసు ఇందులో అత్యంత తీవ్రమైనది. సిట్ అభియోగపత్రం ప్రకారం, మే 6న అదుపులోకి తీసుకుని రాణిగారితోటలోని పాడుబడిన భవనంలో తీవ్రమైన చిత్రహింసలకు గురై మే 12న మరణించాడు. పోలీసులే మృతదేహాన్ని రాత్రివేళ స్వర్గపురి శ్మశానానికి తరలించి దహనం చేశారని సిట్ వెల్లడించిన విషయం తెలిసిందే. సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో ఇదంతా బయటపడింది. అతడిని మేజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరుపరచలేదని, ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యమైందని, స్టేషన్ సిసి టివి దృశ్యాలను ఎందుకు తొలగించారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కర్నూలు జిల్లా ఆదోనిలో మాల గంగమ్మ కస్టడీలోనే మరణించారని, మృతదేహాన్ని బంధువులకు అప్పగించకుండా దహనం చేశారన్న ఆరోపణలొచ్చాయి. ఇలాంటివెన్నో.
ఈ ఉదంతాల్లో ఒక కామన్ విషయం అందరినీ కలవరపెడుతోంది. దర్యాప్తు పేరుతో అదుపులోకి తీసుకోవడం, ఆ నిర్బంధాన్ని రికార్డుల్లో చూపకపోవడం, మరణిస్తే కేసును తారుమారు చేసే ప్రయత్నాలు జరగటం విచారకరం. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయాన్ని తప్పనిసరిగా నమోదు చేసే పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. స్టేషన్లలో సిసి టివిల పనితీరుపై స్వతంత్ర పర్యవేక్షణ ఉండాలి. కుటుంబ సభ్యులకు వెంటనే సమాచారం ఇవ్వడం, కస్టడీ మరణాల్లో స్వతంత్ర దర్యాప్తు, బాధ్యులైన అధికారుల్లో జవాబుదారీతనం ఉండాలి. పౌరుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కగానే తన రాజ్యాంగ హక్కులను కోల్పోడు. అరెస్టు పేరుతో స్వేచ్ఛను పరోక్షంగా హరించే పద్ధతికి ఈ రూలింగ్ అడ్డుకట్ట వేయాలి. దాని నిజమైన ప్రయోజనం, న్యాయస్థానం చెప్పిన సూత్రాలు పోలీసు విధానాల్లోనూ మేజిస్ట్రేట్ విచారణల్లోనూ అమలైనప్పుడే కనిపిస్తుంది.








కామెంట్లు (0)