దేశంలో, రాష్టంలో చోటు చేసుకుంటున్న పార్రిశామిక ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత మూడు రోజుల్లోనే తమిళనాడు ఆక్వా, పరవాడ ఫార్మాలో చోటుచేసుకున్న ప్రమాదాల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని నిత్యం ప్రకటించే పాలకులు అందుకోసం కారుచౌకగా భూములను, సహజ వనరులను, విద్యుత్ వంటి మౌలిక వసతులను ప్రోత్సాహకాలుగా కట్టబెడుతున్నారు. పటిష్ట భద్రత, కాలుష్య నివారణ వంటి అంశాలపై చర్యలు చేపడుతున్నారా? తదితర అంశాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా కనబడవు. బ్రిటీష్ వలస పాలన నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కోడ్‌లుగా మార్చేసి, వారి హక్కులను కాలరాసిన మోడీ సర్కారు ఏలుబడిలో ఉద్యోగానికే కాదు ప్రాణాలకూ భద్రత ప్రశ్నార్థకంగా మారిపోతోంది. కార్పొరేట్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ పేరుతో తనిఖీల యంత్రాంగం తూతూమంత్రంగా తయారైపోయింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ రాష్టంలోని టిడిపి కూటమి సర్కారు యజమానుల ఉల్లంఘనల్ని పట్టించుకోదు. అసలు తనిఖీల ఊసే లేదు.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని దక్షిణ ఎన్‌వైడ్ కెమికల్ కంపెనీలో తాజాగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవ దహనం కావడం పారిశ్రామిక భద్రతను మరోసారి చర్చనీయాంశం చేసింది. పరవాడ ఫార్మా సిటీ, అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఇజెడ్) ప్రాంతాల్లో గ్యాస్ లీకులు, రియాక్టర్ పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటుండటం ఆందోళనకరం. విశాఖ ఎల్‌జి పాలిమర్స్‌లో 2020 మే 7న స్టైరిన్ గ్యాస్ లీక్ కావడంతో 13 మంది మరణించడం దేశవ్యాప్త చర్చకు కారణమైంది. 2024 ఆగస్టు 21న అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లోని ఎస్సెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్‌లో జరిగిన భారీ పేలుడు 17 మందిని బలిగొని అత్యంత ఘోర పారిశ్రామిక ప్రమాదంగా నమోదైంది. ఇటువంటి ఘటనల్లో ఏటా పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా తగిన భద్రతా చర్యలు తీసుకోవడం లేదనేది నిష్టుర సత్యం.
తమిళనాడు పెరియపాళయం సీఫుడ్స్ పరిశ్రమలో అమోనియా గ్యాస్ లీకైన ఘటనలో ఎనిమిదిమంది వలస వచ్చిన మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 68 మంది ఆసుపత్రి పాలు కాగా, అనేకమంది వెంటిలేటర్‌పై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రొయ్యలు వలిచి వాటిని నిలువ చేసేందుకు అమోనియా గ్యాస్‌ను ఈ పరిశ్రమలో నిలువ చేస్తారు. ఆ గ్యాస్ లీకైన కొన్ని క్షణాల్లోనే... శ్వాస తీసుకోలేక, నోటి నుంచి, ముక్కు నుంచి రక్తం వచ్చి నరక యాతన పడిన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆ మహిళల అవస్థలు తలచుకుంటేనే కన్నీళ్లొస్తాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ర్టియల్ సేఫ్టీ అండ్ హెల్త్ (డిఐఎస్‌హెచ్), తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు సభ్య కార్యదర్శి, అదనపు ప్రజారోగ్య సంచాలకులతో కూడిన ఒక కమిటీ అంతకుముందే జరిపిన విచారణలో అనేక లోపాలు వెల్లడయ్యాయి. ఆ కమిటీ సిఫార్సులు బుట్టదాఖలయ్యాయి. న్యాయస్థానం పరిధిలో ఉండగానే ఈ ఘోరం జరిగిపోయింది. తాజా ఉదంతంతో 6,669 ప్రమాదకర పరిశ్రమలను తనిఖీలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించడం సరైన చర్య. పారిశ్రామిక ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో అత్యధికులు కాంట్రాక్టు కార్మికులు, వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారే. తీవ్రంగా గాయపడి వాటి దుష్ఫలితాలను అనుభవిస్తున్న, అంగవికలురైన వారి కష్టాలు వర్ణనాతీతం. ప్రమాదం అనంతరం ఇచ్చే పరిహారాలు ఆర్థికంగా కొంత ఊరటనిచ్చినా కోల్పోయిన జీవితాలు, ఆ కుటుంబాల ఆశలు, భవిష్యత్ తిరిగి వచ్చేవి కాదు. ఎంతో విలువైన ప్రాణాలు అర్ధాంతరంగా కోల్పోవడానికి, కుటుంబాల తీరని శోకానికి, తీర్చలేని వెలితికి ప్రధాన కారణమవుతున్న యాజమాన్యాల అత్యాసను, నిర్లక్ష్యాన్ని నిలువరించడం అత్యవసరం. ఇటువంటి ఘోరాలను నివారించే దృఢ సంకల్పంతో ముందుకెళ్లడం, నిర్లక్ష్యంపై ఉక్కుపాదం మోపడమే విరుగుడు.









కామెంట్‌లు (0)