సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

3 సెంట్లు, 2 సెంట్లు మాటల్లోనేనా!

22 గంటల క్రితం

tdp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 05:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఇంటి స్థలం హామీ నెరవేరిందెక్కడ?

- 4,59,051 దరఖాస్తులు.. 1,43,496 కే ఆమోదం

- ఇంకా పరిశీలనలో 1,26,694

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రచారం ఘనం.. చేతల్లో శూన్యం అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి కనబడుతోంది. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఇంటి స్థలం ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండు సంవత్సరాల నాలుగు నెలలు దాటినా పేదల సొంతింటి కల సాకారం కావడం లేదు. ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పేద కుటుంబానికి మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత ‘హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌’ పేరుతో కొత్త విధానాన్ని ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఆమోదాల ప్రక్రియ సాగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు అందించే ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దరఖాస్తులు భారీగా.. ఆమోదాలు పరిమితం

ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం.. ‘హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌’ కింద మొత్తం 4,59,051 దరఖాస్తులు అందాయి. వీటిలో 1,43,496కు ఆమోదం లభించింది. 1,88,861 తిరస్కరణకు గురయ్యాయి. మరో 1,26,694 పరిశీలనలో ఉన్నాయి. మొత్తం దరఖాస్తుల్లో సుమారు మూడో వంతుకే ఆమోదం లభించగా, గణనీయమైన సంఖ్యలో దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

​ ‘హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌’ మార్గదర్శకాలు

​పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం 2025 జనవరి 27న జిఓ జారీ చేసి ‘హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌’ మార్గదర్శకాలు రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం కల్పించాలనేది విధానంగా ప్రకటించింది. అర్హత ఉన్న కుటుంబంలోని మహిళ పేరు మీద పట్టా ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నచోట దానిని వినియోగించడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో భూమిని సమీకరించి స్థలాలు అందించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.

కాలయాపనకు తావులేకుండా చర్యలు చేపట్టాలి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైగా గడిచిన నేపథ్యంలో ‘హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌’ కింద దరఖాస్తుల పరిశీలన, ఆమోదాలతో పాటు వాస్తవంగా ఇంటి స్థలాల పంపిణీపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకటనలకే పరిమితం కాకుండా భూమి గుర్తింపు, భూ సమీకరణ, లేఅవుట్ల అభివృద్ధి, పట్టాల పంపిణీ వంటి ప్రక్రియలను వేగవంతం చేయాలని పేదలు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్