శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనీటి కొలత ఆధారంగా వసూళ్లు

18 నిమిషాల క్రితం

water taps meaters.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 07:37 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రెగ్యులేటరీ కమిషన్‌ చేసేది ఇదే

  • వాల్యూమెట్రిక్‌ విధానంలో ధర నిర్ణయం

  • గతంలో మీటర్లు పెట్టి వెనక్కు తగ్గిన ప్రభుత్వం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

సాగునీటికి సంబంధించి రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటు వల్ల రైతులపై పెనుభారం పడనుంది. నీటి సరఫరాను వాల్యూమెట్రిక్‌ ‌విధానంలో లెక్కించి నీటి వినియోగం ఆధారంగా వసూలు చేయనున్నారు. దీనికోసం స్లూయిస్‌ (‌గేట్లు) వద్ద మీటర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 2000 సంవత్సరంలో కృష్ణా జిల్లా పమిడిముక్కల, తేలప్రోలు పొలాల్లో మీటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా అప్పట్లో రైతులు అడ్డుకున్నారు. అక్కడకు వచ్చిన ప్రపంచ బ్యాంకు బృందాన్ని కూడా రైతులు అడ్డుకున్నారు. నీటి మీటర్లు, యూజర్‌ ‌ఛార్జీల కోసం ఉమ్మడి అసెంబ్లీలో 12/1997 చట్టాన్ని ఆమోదించారు. అనంతరం కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 15/2009 చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిపైనా విమర్శలు రావడంతో ఆగిపోయింది. అయినప్పటికీ ప్రపంచ బ్యాంకు పెట్టిన షరతుల్లో భాగంగా విద్యుత్‌‌, నీటి సరఫరాకు సంబంధించి అయిన ఖర్చును కచ్చితంగా రాబట్టాలనే నిర్ణయం మేరకు రెగ్యులేటరీ కమిషన్‌ అంశం తెరమీదకు తెచ్చారు. దీని ఆధారంగా కాలువలకు సరఫరా చేసే నీటికి లెక్కగట్టి ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తారు. విద్యుత్‌ ‌రెగ్యులేటరీ కమిషన్‌ ముందుగానే ధర ఎలా నిర్ణయిస్తుందో అదే పద్ధతిలో ధర నిర్ణయించనున్నారు. ప్రస్తుతం చెరకుకు ఏడాదికి రూ.300, వరికి రూ.350, చెరువుల కింద ఆరుతడి పంటలకు ఎకరాకు రూ.150 చొప్పున నీటి తీరువా వసూలు చేస్తున్నారు. రెగ్యులేటరీ కమిషన్‌ అమల్లోకి వస్తే ఇది ఎంతవరకైనా పెరిగే అవకాశం ఉంటుందని ఎపి రైతు సంఘం నాయకులు వై కేశవరావు తెలిపారు.

నీటి వృథా పేరుతో దోపిడీ

ప్రస్తుతం నీటి సరఫరాకు సంబంధించి వృథా నీరు ఎక్కువగా పోతోందని, దీన్ని నివారించాలంటే మీటర్లు, నీటి లెక్కలు తప్పనిసరని ప్రభుత్వం గతంలో ప్రచారం చేసింది. దీని ప్రకారం కాలువలకు గేట్ల వద్ద నీటి రీడింగ్‌ ‌పద్ధతిని అమలు చేస్తే నిర్వహణ ఖర్చుతోపాటు అదనపు భారం పడే ప్రమాదమూ ఉంది. నీటి సరఫరాలో కొంత బయటకు పోతుంది. ఆవిరి కూడా అవుతుంది. ఈ మొత్తాన్ని కూడా రైతుల నుండే వసూలు చేయనున్నారు.

కౌలు రైతులపైనే పెనుభారం

రెగ్యులేటరీ కమిషన్‌ అమల్లోకి వస్తే అన్ని ప్రాంతాల్లోనూ కౌలు రైతులపైనే అదనపు భారం పడుతుంది. కృష్ణా, గోదావరి డెల్టాలో 80 శాతం కౌలు రైతులే పొలాలు సాగు చేస్తున్నారు. రెండో పంట మీద వచ్చే ఆదాయంలో కొంత వారికి మిగులుతోంది. అది కూడా అప్పులు చెల్లించడానికే సరిపోతోంది. మొదటి పంట మొత్తం కౌలు, ఖర్చులకు సరిపోతోంది. ఈ నేపథ్యంలో ఎకరాల లెక్కల నీటి తీరువాను పెంచుకుంటూ పోతే అంతిమంగా కౌలు రైతులపై పెనుభారం పడుతుంది. దీనివల్ల వ్యవసాయం దెబ్బతినిపోయే ప్రమాదమూ ఉంది.

వసూళ్లు చేసేది ఇలా..

నీటి నిర్వహణకు అయ్యే ప్రతి ఖర్చునూ లెక్కగట్టి మరీ వసూలు చేయడంపై గతంలో ప్రపంచ ‌బ్యాంకు నివేదిక రూపొందించింది. ఉదాహరణకు కృష్ణా పశ్చిమ కాలువకు ఈ సీజన్లో రూ.200 కోట్లు పెట్టి పనులు చేస్తే ఆ మొత్తాన్ని ఆయకట్టు పరిధిలో ఉన్న రైతుల నుంచి వసూలు చేస్తారు. అంటే మొత్తం వ్యయాన్ని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు విడగొట్టి గ్రామాల్లో ఉంటే నీటి వినియోగదారుల సంఘాలకు ఆ మొత్తం వసూలు బాధ్యతను అప్పగించనున్నారు. ఉదాహరణకు 3 లక్షల ఎకరాల సాగున్న కాలువ పరిధిలో రూ.200 కోట్లు పెట్టి పనులు చేస్తే ఎకరాకు సుమారు రూ.6,670 పడుతుంది. ఆ మొత్తాన్ని రైతుల నుండి వినియోగదారుల సంఘాలు వసూలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో నీటి వనరుల నిర్వహణకు సంబంధించి నాగార్జునసాగర్‌ ఆయకట్టుపై ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదిక 88వ పేజీతో ఈ అంశాన్ని ప్రస్తావించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్