సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రుణంతో బొగ్గు గనుల వేలానికి...

2 గంటల క్రితం

ap[mdc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 12:47 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎపిఎండిసికి రూ.115 కోట్ల ప్రభుత్వ గారంటీ

- 5 శాతం గారంటీ కమిషన్ ఇవ్వాలంటూ నిబంధన

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు రూ.115 కోట్ల అదనపు ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సంస్థకు ఇప్పటికే ఉన్న రూ.906.52 కోట్ల రుణ సదుపాయ పరిమితి రూ.1,021.52 కోట్లకు పెరిగింది. గతంలో ఎపిఎండిసి వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాంక్ గ్యారెంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్, నగదు రుణ సదుపాయాలు వంటి నాన్‌ఫండ్ ఆధారిత రుణ సదుపాయాలను రూ.906.52 కోట్ల వరకు పొందేందుకు ప్రభుత్వం అనుమతించింది. బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనడంతోపాటు సంస్థ వ్యాపార అవసరాలకు అవసరమైన అదనపు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు మరో రూ.115 కోట్ల గ్యారెంటీని మంజూరు చేయాలని ఎపిఎండిసి వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం అదనపు గ్యారెంటీకి ఆమోదం తెలిపింది. ఇందుకోసం కొన్ని నిబంధనలు కూడా విధించారు. రుణ కాలపరిమితి మొత్తం ప్రభుత్వ గ్యారెంటీ అమల్లో ఉంటుందని, రుణ అసలు, వడ్డీ రెండింటికీ ప్రభుత్వ గ్యారెంటీ వర్తిస్తుందని పేర్కొన్నారు.

రుణాన్ని ముందుగానే తిరిగి చెల్లించినప్పుడు అదనపు ఛార్జీలు లేకుండా ఒప్పందంలో నిబంధన ఉండేలా ఎపిఎండిసి చూసుకోవాలని పేర్కొంది. రుణ అసలు, వడ్డీ తిరిగి చెల్లింపు షెడ్యూల్‌తోపాటు వడ్డీ రేటు, రుణ కాలపరిమితి, మారటోరియం వ్యవధి తదితర వివరాలను సమర్పించాలని, రుణ వాయిదాలు, వడ్డీ చెల్లింపులను ఎపిఎండిసి తన సొంత వనరుల నుంచే భరించాలని స్పష్టం చేసింది. రుణదాత సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను ఎపిఎండిసి చెల్లించడంలో విఫలమైనప్పుడు మాత్రమే ప్రభుత్వ గ్యారెంటీ అమల్లోకి వస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ అధికారి సంతకం చేసినప్పుడే గ్యారెంటీ డీడ్ చెల్లుబాటు అవుతుందని, గ్యారెంటీ పొందిన మొత్తంపై ఎపిఎండిసి ఐదు శాతం గ్యారెంటీ కమిషన్‌ను ప్రభుత్వానికి చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనేందుకు ఎపిఎండిసికి అదనపు రుణ సదుపాయం అందుబాటులోకి రానుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్