సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇంకా.... సమర్థిస్తే ఎలా?

-552 నిమిషాల క్రితం

cec
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 05:45 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- వి.ఆర్‌

ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరంగా మారిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వైఖరిపై దేశమంతా గగ్గోలు పెడుతుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనను సమర్థించడం తీవ్ర ఆందోళనకరం. గత 12 సంవత్సరాలుగా రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ బిజెపి తమ స్వార్థ రాజకీయ, మతతత్వ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తూనే ఉంది. ఈ పాపాలపుట్ట పగిలి ఒక్కొక్కటి బట్టబయలు అయి కేంద్ర పాలకులు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మన సిఎం ఇంకా.. వారిని సమర్థించడం రాష్ట్రంలోని ప్రజాతంత్ర వాదులనే కాక తెలుగుదేశం పార్టీ మౌలిక విధానాలకు కట్టుబడిన అనేకమంది అను భవజ్ఞులను ఆందోళనకు, తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. బిజెపితో తిరిగి పెట్టుకోవడంతో ప్రారంభమైన లౌకిక విధానాల జారుడు రోజులు గడిచే కొద్దీ మరింత దిగజారుతూనే ఉంది. చీకట్లో నీడ అదృశ్య మైనట్లు, బిజెపిని గుడ్డిగా సమర్థించిన పార్టీలన్నీ తమ జాడ కోల్పోయి (తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి) విలవిలలాడుతున్న తీరును ఒకనాడు 'చక్రం' తిప్పిన నేత గమనించకపోవడం స్వయంకృతాపరాధం కాక తప్పదు కదా.!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓట్లు విషయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తీసుకున్న ఏకపక్ష వైఖరులు కోట్ల మంది భారతీయుల జీవితాలను ఓటు హక్కు లేని పౌరులుగా మార్చేస్తున్నాయి. గత పది నెలల్లో 14 సార్లు తోటి కమిషనర్లు అభ్యంతరం చెబుతున్నప్పటికీ 'మో షా' ల మద్దతుతో అనేక అక్రమాలకు, మోసాలకు పాల్పడిన ప్రధాన కమిషనర్ దేశం ముందు దోషిగా నిలబడ్డారు‌. ధర్మేంద్ర ప్రధాన్ వ్యవహారం పునరావృతం అవుతుందేమోనని కేంద్ర పాలకులు బెంబేలెత్తుతూంటే చంద్రబాబు నాయుడు మాత్రం నిస్సంకోచంగా బలపరచడానికి సిద్ధం కావడం టిడిపికే కాదు, రాష్ట్రానికే పెద్ద కళంకం. ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చేసిన ట్వీట్ స్వతంత్ర కోల్పోతున్న రాజకీయ పార్టీ స్థాయికి టిడిపిని దిగజారుస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించడమే కాదు, ఫెడరల్ విధానం, లౌకికతత్వ పరిరక్షణకు దేశ రాజకీయాల్లో ఒకనాడు కీలకపాత్ర పోషించిన పార్టీ ఏ కారణం చేతనైనా ఇలా వ్యవహరించడం సరికాదు.

'ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్.ఎస్ సంధూ, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ మన రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేసింది' అని చంద్రబాబు చెప్పారు. ఏ విషయాల మీద, ఎక్కడ ఏకగ్రీవంగా వివరణ ఇచ్చారు?! 'ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు తెరదించారు' అని పేర్కొన్నారు. సుమారు వంద రోజుల తర్వాత నిన్నటి రోజు సమావేశమైన ఎన్నికల కమిషన్ ఇచ్చిన పత్రికా ప్రకటన ప్రధాన కమిషనర్ తప్పుల మరకలను తుడుచుకోవడానికి ప్రయత్నించినట ్లుగా ఉంది తప్ప అపోహలకు తెర దించినట్లు ఎక్కడుంది? సుమారు వంద రోజుల తర్వాత హడావుడిగా సమావేశమైన ఎన్నికల కమిషన్, సహచర కమిషనర్లు లేవనెత్తిన ఏ ఒక్క అభ్యంతరంపై వివరణ ఇచ్చిందా‌. 'ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, సంస్థాగత విధివిధానాలను కచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారు' అని చంద్రబాబు చెప్పారు. ఇలా జరగలేదనే కదా దేశమంతట ఆందోళన... 'మన రాజ్యాంగ సంస్థలను గౌరవించడం అత్యంత ముఖ్యం. భారత ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి ఉమ్మడి బాధ్యత". ఈ బాధ్యతను విస్మరించి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో వేసిన మోడీని నిలదీయకుండా లోకానికి నీతులు చెబితే ఏమి ప్రయోజనం? ఎన్నికల వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు నమోదు విషయంలో జ్ఞానేష్ కుమార్ తీసుకున్న ఏకపక్ష వైఖరి కోట్ల మంది భారతీయులు తమ పనులు మానుకుని ఎన్నికల అధికారుల చుట్టూ తిరిగేలా చేసిన సత్యం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా సమర్థింపు న్యాయమా?. ఎన్నికల వ్యవస్థను కేంద్రం ఇంత దుర్వినియోగం చేసిన తీరు బట్టబయలు అయిన తర్వాత కూడా ఎన్‌‌డిఎకు తాము ఇస్తున్న మద్దతును పునఃపరిశీలించుకోకపోతే ఎలా? ఇంతగా సాగిలపడడం ప్రజలు ముఖ్యంగా నవ యువతరం అంగీకరీంచజాలదు. మోడీ పాలనపై పుష్కర కాలం మౌనంగానే ఉన్న ఈ తరం ఒక్కసారి నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ రోడ్లపైకి వచ్చిన విషయాన్ని టిడిపి, జనసేన గుర్తించాలి.

గత 12 ఏళ్ళుగా రాజ్యాంగ సంస్థలను, ప్రజాస్వామ్య ప్రక్రియలకు పాతరేసి, ప్రజల విశ్వాసాన్ని (అయోధ్య రామాలయంతో సహా) దారుణంగా వంచించింది ఎవరో దేశం చూస్తోంది.

ఎన్నికల కమిషన్ ఎంపిక ప్రక్రియ సవరణకు 2023లో మద్దతు ఇచ్చి, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని వైసిపి అధినేత ఎందుకు చెప్పినా ప్రస్తుత పరిస్థితుల్లో సరైందే! మునిగే పడవ మీద ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించి టిడిపిని ముంచుతారా? తత్వం బోధపడి పశ్చాతాప పడతారా? అనేది కొద్దికాలంలోనే తేలిపోనుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్