మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘కొటియా’ @ 90 ఏళ్లు

20 గంటల క్రితం

kota
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 12:40 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సరిహద్దుల నిర్థారణలో నిర్లక్ష్యం వల్లనే అంతర్రాష్ట్ర వివాదం

- సతమతవుతున్న 21 గ్రామాల గిరిజనులు

ప్రజాశక్తి- కె.సింహాద్రి, పార్వతీపురం : ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల మధ్య కొటియా గ్రామాల సరిహద్దు వివాదం తొమ్మిది దశాబ్దాలుగా నలుగుతోంది. బ్రిటిష్‌ పాలనలో 1936లో మొదలైన ఈ వివాదానికి నేటికీ శాశ్వత పరిష్కారం లభించలేదు. రెండు రాష్ట్రాలూ 21 గ్రామాలపై తమ హక్కులను వినిపిస్తూ పోటీపడుతున్నాయి. ప్రభుత్వాల మధ్య సాగుతున్న పోరులో అక్కడి గిరిజనులు నలిగిపోతున్నారు. రెండు రాష్ట్రాల గుర్తింపు కార్డులు ఉన్నా... కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోని దుస్థితి వారిది. తాజా స్థానిక ఎన్నికల సమయంలో మరోసారి తెరపైకి వచ్చిన ఈ వివాదం... 90 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని పాలకుల వైఫల్యాన్ని కళ్లకు కడుతోంది.

వివాదం మొదలైందిలా...

జయపూర్‌ ‌సంస్థానంలో భాగంగా ఉన్న ఒడిశా 1936 ఏప్రిల్ ఒకటిన ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. బ్రిటిష్ పాలనలో సరిహద్దుల పునర్వ్యవస్థీకరణలో కొటియా ప్రాంతం కూడా ఒడిశా పరిధిలోకి వచ్చింది. కానీ, ఈ గ్రామాల సరిహద్దులు, రెవెన్యూ రికార్డుల విషయంలో స్పష్టత లేకపోయింది. 1942లో బ్రిటిష్‌ అధికారి హెచ్‌ఎస్‌ గిల్బీ సమక్షంలో మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సర్వేలో కొటియా పంచాయతీ పరిధిలో మొత్తం 28 రెవెన్యూ గ్రామాలు ఉండగా, వాటిలో ఏడు గ్రామాలను మాత్రమే ఒడిశా రెవెన్యూ గ్రామాలుగా నమోదయ్యాయి. మిగిలిన 21 గ్రామాల విషయంలో స్పష్టమైన సర్వే రికార్డులు లేకపోవడం వివాదానికి దారి తీసింది. ఒడిశా 1936 నాటి ఉత్తర్వులను ప్రస్తావిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు, రెవెన్యూ రికార్డులను ఆధారంగా చూపిస్తోంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1955 మార్చిలో ఆంధ్రా అధికారులు కొటియా గ్రామాల్లో భూమి శిస్తు వసూలు చేసేందుకు ప్రయత్నించడంతో ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకముందే ఈ వివాదం ప్రారంభమైంది.

పార్లమెంటు పరిధిలోనే పరిష్కారించుకోవాలన్న సుప్రీం కోర్టు

వివాదాస్పద గ్రామాల్లో 1967లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎపి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో 1968లో ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 38 ఏళ్లు సాగిన వివాదంపై 2006 మార్చి 30న సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాన్ని ఈ కేసు పరిధిలో పరిష్కరించడం సాధ్యం కాదని, ఇలాంటి అంశాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటు పరిధిలో పరిష్కారం అవసరమని స్పష్టం చేసింది. అంతవరకూ యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఇరు రాష్ట్రాలనూ ఆదేశించింది. ఇప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. కొటియా సమస్య సరిహద్దులు, రికార్డుల వంటి పాలనాపరమైన విషయాల కంటే రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడిన పార్లమెంట్‌ ‌తేల్చాలన్నది సుప్రీం ఆదేశంతో ఎవరికైనా బోధపడుతుంది. ఇప్పుడు ఒడిశాలోనూ, ఎపిలోనూ ఎన్‌‌డిఎ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ, ఎపిలోని తాజా స్థానిక ఎన్నికల్లో కొటియా గ్రామస్తులను ఓటువెయ్యనీయకుండా అడ్డుకున్నది కేవలం ఒడిశా అధికారులు, పోలీసులు మాత్రమే కాదు... కోరాపుట్ బిజెపి ఎమ్మెల్యే రఘురామ్‌ ‌మత్సో కూడా రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు. ఎపి నుంచి వెళ్లే ఓటర్లను అడ్డగించిన వివరాలు మీడియాలో చాలా వచ్చాయి. కేంద్రంలోని ఎన్‌‌డిఎ ప్రభుత్వానికి ఆక్సిజన్‌ అందిస్తోన్న టిడిపి... ‘కొటియా’ సమస్య పరిష్కారానికి ఏమీ చేయలేదా? ఇదీ సామాన్యుల ప్రశ్న.


- రెండో భాగం రేపు...

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్