- వైజాగ్ ఫైర్ బర్డ్స్‌పై 27 పరుగుల తేడాతో ఘన విజయం
- 91 పరుగులతో చెలరేగిన పుష్పిత.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
- విజయంతో ఫైనల్‌కు చేరిన గోదావరి గోల్డెన్ ఈగల్స్
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుఎపిఎల్)లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ సత్తా చాటింది. వైజాగ్ ఫైర్ బర్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోదావరి జట్టు 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అద్భుత బ్యాటింగ్‌తో 91 పరుగులు చేసిన గోదావరి బ్యాటర్ పుష్పితకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. టాస్ గెలిచిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 156 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. గోదావరి బ్యాటర్లలో పుష్పిత అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. కేవలం 56 బంతుల్లోనే 91 పరుగులు చేసిన ఆమె తన ఇన్నింగ్స్‌లో పది ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదారు. కెప్టెన్ హెన్రీట్టా పెరీరా కూడా 29 బంతుల్లో 34 పరుగులు చేసి జట్టు స్కోరుకు కీలక సహకారం అందించింది. ఆమె ఖాతాలో రెండు ఫోర్లు ఉన్నాయి. వైజాగ్ ఫైర్ బర్డ్స్ బౌలర్లలో రిషిక, సరయు చెరో వికెట్ పడగొట్టారు. అయితే గోదావరి బ్యాటర్ల దూకుడును పూర్తిగా అడ్డుకోలేకపోయారు. దీంతో వైజాగ్ ముందు 157 పరుగుల విజయలక్ష్యం నిలిచింది.
లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన వైజాగ్ ఫైర్ బర్డ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైజాగ్ బ్యాటర్లలో యశస్విని 18 బంతుల్లో 23 పరుగులు, హాసిని 15 బంతుల్లో 20 పరుగులు చేశారు. హాసిని తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు బాదారు. వీరిద్దరి మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో వైజాగ్ జట్టు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. గోదావరి గోల్డెన్ ఈగల్స్ బౌలర్లలో శ్రీష్టి శేఖర్ రెండు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించారు. వైష్ణవి, హారిక, అక్షయ తలా ఒక వికెట్ సాధించారు. సమిష్టి బౌలింగ్ ప్రదర్శనతో వైజాగ్ బ్యాటింగ్ లైనప్‌పై ఒత్తిడి పెంచిన గోదావరి బౌలర్లు విజయాన్ని ఖాయం చేశారు. చివరికి వైజాగ్ ఫైర్ బర్డ్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులకే పరిమితమైంది. దీంతో గోదావరి గోల్డెన్ ఈగల్స్ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పుష్పితకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో గోదావరి గోల్డెన్ ఈగల్స్‌లో ఫైనల్‌లో స్థానం సంపాదించింది. ఫైనల్‌కు చేరిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు తమ టైటిల్ పోరుకు సన్నద్ధమవుతోంది.









కామెంట్‌లు (0)