మంగళవారం, 27 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానానికి హర్మన్‌ప్రీత్‌

1 గంట క్రితం

Harmanpreet Kaur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 04:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకుకు చేరుకుంది. ఐసీసీ మంగళవారం ఈ ర్యాంకులను విడుదల చేసింది. మరోవైపు, భారత ప్రస్తుత కెప్టెన్‌ స్మృతి మంధాన తన అగ్రస్థానాన్ని కోల్పోయారు. జింబాబ్వేతో ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో 32, 0 పరుగులకే పరిమితం కావడంతో ఆమెను దక్షిణాఫ్రికా కెప్టెన్‌ లారా వోల్వార్డ్‌ అధిగమించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ శతకాలతో చెలరేగారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో భారత్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత జట్టుకు వరుసగా రెండో స్వర్ణాన్ని అందించిన అనంతరం హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంది. దీప్తి శర్మ కూడా తాజా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. వన్డే బ్యాటర్ల జాబితాలో నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 23వ స్థానానికి చేరుకుంది. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకును సాధించింది. బౌలర్ల జాబితాలోనూ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఎనిమిదో స్థానానికి చేరింది. భారత యువ బ్యాటర్‌ ప్రతీకా రావల్‌ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు ఎగబాకి 21వ ర్యాంకును అందుకుంది. ఇది ఆమె కెరీర్‌లోనే అత్యుత్తమ స్థానం. జింబాబ్వే క్రికెటర్లు మోడెస్టర్‌ ముపాచిక్వా ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 39వ ర్యాంకుకు, చిపో ముగేరి-తిరిపానో నాలుగు స్థానాలు ఎగబాకి 47వ ర్యాంకుకు చేరారు. బెలవ్డ్‌ బిజా ఏకంగా 16 స్థానాలు మెరుగుపరుచుకుని 56వ ర్యాంకును సాధించింది.
తాజా మహిళల టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లోనూ భారత క్రీడాకారిణులు పురోగతి సాధించారు. షఫాలీ వర్మ ఒక స్థానం మెరుగుపరుచుకుని మూడో ర్యాంకుకు చేరగా, స్మృతి మంధాన నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. వన్డేల్లో అగ్రస్థానాన్ని కోల్పోయినప్పటికీ టీ20 ర్యాంకింగ్స్‌లో మంధాన తన స్థానాన్ని మెరుగుపరుచుకోవడం విశేషం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్