శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర - భారత మహిళల హాకీకి స్వర్ణం

1 గంట క్రితం

hockey
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 08:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆట చివరి క్షణాల వరకు ఇరు జట్ల మధ్య తీవ్ర పోటీ

నగోయా: 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఐచి-నగోయాలో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాను 1-0 తేడాతో ఓడించి భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆట చివరి క్షణాల వరకు ఇరు జట్ల మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. ఒక గోల్ ఆధిక్యంలో ఉన్న భారత్.. చైనా చేసిన పునరాగమన ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకుంది. చివరి నిమిషాల్లో చైనా నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైనా భారత రక్షణ విభాగం పటిష్టంగా నిలిచి ఆధిక్యాన్ని కాపాడుకుంది. దీంతో భారత్ స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. భారత మహిళల హాకీ జట్టు చివరిసారిగా 1982 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించింది. ఆ తర్వాత 44 ఏళ్లకు ఇప్పుడు మరోసారి ఆసియా క్రీడల ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయం భారత మహిళల హాకీ జట్టుకు మాత్రమే కాకుండా దేశ హాకీ చరిత్రలోనూ ప్రత్యేకంగా నిలిచింది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించడంతో భారత్ మరో కీలక ఘనతను కూడా అందుకుంది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు భారత మహిళల హాకీ జట్టు నేరుగా అర్హత సాధించింది. ఆసియా క్రీడల ఛాంపియన్‌కు లభించే ఒలింపిక్ కోటాను భారత్ సొంతం చేసుకుంది.

దీంతో 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల స్వర్ణం, అదే సమయంలో 2028 ఒలింపిక్స్ బెర్త్.. భారత మహిళల హాకీ జట్టుకు ఈ విజయం మరింత ప్రత్యేకంగా మారింది. ఇప్పుడు భారత జట్టు దృష్టి లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌పైకి మళ్లనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్