- ఆసియా క్రీడల్లో రెండో బంగారు పతకం
- 50మీ. రైఫిల్-3 టీం విభాగంలో రజతం
ఐచి-నగోయా(జపాన్): 20వ ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణ పతకం లభించింది. శుక్రవారం జరిగిన 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సురుచి, కమల్‌జీత్ జోడి బంగారు పతకాన్ని అందించారు. హోరాహోరీ ఫైనల్లో సురుచి, కమల్‌జీత్ 484.6 పాయింట్లతో దక్షిణ కొరియాపై విజయం సాధించారు. నాలుగు దేశాల మధ్య జరిగిన ఫైనల్లో భారత షూటర్లు ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించారు. చివర్లో దక్షిణ కొరియా షూటర్ల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనా.. 6.6 పాయింట్ల ఆధిక్యతను సంపాదించి స్వర్ణ పతకాన్ని సాధించారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో టాప్-4లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరగా.. 18 షాట్ల తర్వాత ఇండోనేషియా ఎలిమినేట్ అయ్యింది. తొలి సిరీస్‌లో 364.7 స్కోరు అగ్రస్థానంలో నిలిచి దక్షిణ కొరియా, ఇరాన్ను వెనక్కి నెట్టింది. రెండో సిరీస్ ముగిసేసరికి 424.9 స్కోరుతో ప్రథమస్థానంలోనే ఉంది. కానీ మూడో, చివరి సిరీస్‌లో కొరియానుంచి గట్టి పోటీ ఎదురైంది. 23 షాట్స్ ముగిసేసరికి ఇరాన్ జట్టు 415.8 పాయింట్లతో కాంస్య పతకానికి పరిమితమైంది. ఈ క్రమంలో స్వర్ణ పతకం కోసం భారత్, దక్షిణ కొరియా జట్ల మధ్య ఉత్కంఠపోరు సాగింది. కానీ చివర్లో నిలకడగా రాణిస్తూ భారత ద్వయం టాప్‌తోనే ముగించింది. దీంతో సురుచి, కమల్‌జీత్ 484.6 పాయింట్లతో ప్రథమస్థానంతో ముగించి బంగారు పతకాన్ని ముద్దాడగా.. దక్షిణ కొరియా (478.0 పాయింట్లు) రజత పతకానికి పరిమితమైంది. ఇక మహిళల క్రికెట్ లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం దక్కిన సంగతి తెలిసిందే. 50మీ. రైఫిల్-3 టీం విభాగంలో భారత్‌కు రజత పతకం లభించింది. ఐశ్వరీ ప్రతాప్ సింగ్ థోమర్, నీరజ్ కుమార్, రుద్రాంక్ష పాటితో కూడిన భారత పురుషుల బృందం 1762పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. చైనా(1766పాయింట్లు) స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకోగా.. దక్షిణ కొరియాకు కాంస్య పతకం దక్కింది.







కామెంట్‌లు (0)