89 పరుగులకే కుప్పకూలిన భారత్
నాల్గో వన్డేలో 244 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు
మౌంట్ మౌంగనుయి: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారతజట్టు 334 పరుగుల భారీ ఛేదనలో భాగంగా కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. దీంతో కివీస్ గడ్డపై టీమిండియా తొలిసారి 244 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. మౌంట్ మౌంగనూయ్‌లోని బే ఓవల్ మైదానంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఓపెనర్ల విల్ యంగ్(125) శతకానికి తోడు మరో ఓపెనర్ టిమ్ షెఫర్ట్(58) అర్ధసెంచరీతో రాణించాడు. ఫిన్ అలెన్ (41), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (24), క్రిస్టియన్ క్లార్క్ (22) ఫర్వాలేదనిపించారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు కూల్చగా.. అర్ష్‌దీప్ సింగ్, నమన్ ధీర్ చెరో వికెట్ పడగొట్టారు. భారీ ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. తొలి ఓవర్లోనే మ్యాట్ హెన్రీ తొలి బంతికి రోహిత్ శర్మ గోల్డెన్ డక్ కాగా.. ఐదో బంతికి కోహ్లి, ఆరో బంతికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఔటయ్యారు. దీంతో తొలి ఓవర్ ముగిసేసరికి టీమిండియా పరుగుల ఖాతా తెరవకుండానే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత గైక్వాడ్(5) కూడా నిరాశపరిచాడు. టీమిండియా స్కోర్ 9 పరుగులకు చేరేసరికి నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయం చేసుకుంది. టీమిండియా జట్టులో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(27), అక్షర్ పటేల్ (21), నమన్ ధీర్ (21) చెప్పుకోదగ్గ స్కోర్లు చేయగా.. మిగతా వారంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో టీమిండియా 26.4 ఓవర్లలో కేవలం 89 పరుగులకే ఆలౌటైంది. కివీస్ సీనియర్ పేసర్ మ్యాట్ హెన్రీ(6/27) ఆకాశమే హద్దుగా చెలరేగి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. మ్యాట్ ఫిషర్ మూడు వికెట్లు, కైలీ జెమీషన్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ పరాజయంతో టీమిండియా 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత పవర్‌ప్లేలో నమోదు చేసిన అత్యల్ప స్కోరు (26/4)ను బ్రేక్ చేసింది. అలాగే 244 పరుగుల పరంగా వన్డే క్రికెట్ చరిత్రలో భారత్‌కు ఇది రెండో అతిపెద్ద పరాజయం. చివరిసారి 2000 అక్టోబర్‌లో శ్రీలంక చేతిలో ఇండియా 245 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. మళ్లీ 26 ఏళ్ల తర్వాత ఇంత భారీ తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యతలో ఉండగా.. సిరీస్ విజేతను తేల్చే ఐదో వన్డే ఆదివారం ఇదే బే ఓవల్ మైదానంలో జరగనుంది.
లోపాలను సరిదిద్దుకుంటాం: శ్రేయస్
టీమిండియా ఘోర పరాజయంపై కెప్టెన్ శ్రేయస్ మాట్లాడుతూ.. బ్యాటింగ్, బౌలింగ్ విభా గాల్లో ఎక్కడ లోపాలు జరిగాయో విశ్లేషించుకుని సిరీస్‌ను కైవసం చేసుకుంటమన్నాడు. రెండు మ్యాచ్‌లు గెలిచామన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, దాని నుంచి సానుకూల అంశా లను తీసుకుని, నిర్ణయాత్మక 5వ వన్డేకు సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతామన్నాడు.








కామెంట్‌లు (0)