అన్న క్యాంటీన్లకు నాసిరకం ఆహారం సరఫరా
నిర్వహణపై పీపుల్స్ పల్స్ సర్వే
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యాన నడిచే అన్న క్యాంటీన్ల ద్వారా అక్షయపాత్ర లబ్ధి పొందుతోంది. నిరుపేదలు ఆహారం తీసుకునే ఈ క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించకుండా నాసిరకం ఆహారాన్ని అందిస్తూ ఆ సంస్థ లాభం పొందుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి కూటమి ప్రభుత్వం 204 అన్న క్యాంటీన్లను నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మరో 64 క్యాంటీన్లను ప్రారంభించేందుకు ఇటీవల మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 204 క్యాంటీన్ల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యాన నడిచే అక్షయపాత్రకు అప్పగించింది. ఈ క్యాంటీన్లపై ఈ నెల మూడు నుంచి పదో తేదీ వరకు నిర్వహించిన పీపుల్స్ పల్స్ సంస్థ ఒక సర్వే చేపట్టి దీనిపై ఒక నివేదికను ఇటీవల విడుదల చేసింది. అన్న క్యాంటీన్లకు నాణ్యత లేని నాసిరకం భోజనాన్ని అక్షయపాత్ర అందిస్తోందని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. ప్రతి క్యాంటీన్ వద్ద 50-60 మంది లబ్ధిదారులతో.. మొత్తంగా 1,200 మందితో చర్చించినట్లు సర్వే సంస్థ వెల్లడించింది. భోజనం నాణ్యత, సిబ్బంది ప్రవర్తన, సమయపాలన, పరిశుభ్రత, పథకాన్ని ఎవరు ఎక్కువ వినియోగించుకుంటున్నారు? ఈ పథకం వల్ల ప్రభుత్వానికి రాజకీయంగా లబ్ధి చేకూరుతోందా?, నిర్వహణలో ప్రస్తుతం ఉన్న లోపాలేమిటి? అనే ఆరు అంశాలపై సంస్థ సర్వే నిర్వహించింది. ప్రతిపక్షంలో టిడిపి నాయకులు నిర్వహించిన ప్రైవేట్ అన్న క్యాంటీన్లలో అందించిన ఆహారంతో పోలుస్తూ ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంటీన్ల ఆహారం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వెల్లడించింది. ఉదయం పూట అల్పాహారంలో అందించే చట్నీ చెడిపోయి వాసన వస్తోందని, భోజనానికి ఇచ్చే చట్నీ కూడా నాణ్యంగా ఉండటం లేదని తెలిపింది. ఉదయం పూట అల్పాహారానికి లబ్ధిదారుల నుంచి ఏజెన్సీ సంస్థ రూ.5, ప్రభుత్వం నుంచి రూ.17 చొప్పున తీసుకుంటుంది. భోజనానికి లబ్ధిదారుల నుంచి రూ.5, ప్రభుత్వం నుంచి రూ.34 చొప్పున తీసుకుంటోంది. అక్షయపాత్ర అల్పాహారంలో అందిస్తున్న ఇడ్లీ, పొంగల్, పూరీలు నాణ్యతగా ఉండటం లేదని లబ్ధిదారులు తెలిపారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో బండ్ల మీద టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు రూ.15 నుంచి రూ.20లకే 5 ఇడ్లీలు గానీ, 4 పూరీలుగానీ, ఉప్మా గానీ నాణ్యతతో అందిస్తున్నారని తెలిపింది. రూ.22 తీసుకుంటున్న ఏజెన్సీ మాత్రం నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తోందని లబ్ధిదారులు చెబుతున్నారు. రూ.20 నుంచి రూ.25లకు లెమన్‌రైస్, వెజిటబుల్ బిర్యానీ, టమాటా రైస్, పెరుగన్నం మంచి నాణ్యతతో అందిస్తున్నారని, క్యాంటీన్లలో రూ.34 తీసుకుంటున్న అక్షయపాత్ర మాత్రం నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదని అంటున్నారు. పరిమాణంలో ఇవ్వాల్సిన దానికంటే తక్కువగా లబ్ధిదారులకు అందిస్తోందని సర్వే సంస్థ వెల్లడించింది. 400 గ్రాముల అన్నం కాకుండా 350 గ్రాములే అందిస్తోందని పేర్కొంది. దీంతో లబ్ధిదారుల కడుపు నిండడం లేదని తెలిపింది. మెనూ ప్రకారం భోజనంలో ఒక కూర, సాంబార్ ఇవ్వాలి. కానీ ఒక్క సాంబారు మాత్రమే అందిస్తున్నారు. అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేస్తున్న అక్షయపాత్ర.. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఆహారం అందిస్తోంది. ప్రస్తుతం అక్షయపాత్ర కిచెన్లు ఉమ్మడి జిల్లాకు ఒకటి లేదా రెండు జిల్లాలకు ఒకటి ఉంటున్నాయి. దీనివల్ల దూర ప్రాంతాలకు ఆహారం వెళ్లేసరికి చల్లబడి నాణ్యత తగ్గుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మరిన్ని కిచెన్లు పెంచాలని అక్షయపాత్రకు ప్రభుత్వం సూచించాలని సంస్థ సూచించింది. ఆహారాన్ని వేడిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని తెలిపింది. ఈ క్యాంటీన్లలో ఎక్కువగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారే ఆహారం తీసుకుంటున్నారని పేర్కొంది. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తున్న క్యాంటీన్లను మండల కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయాలని తెలిపింది. మహిళల కోసం ప్రత్యేకంగా క్యాంటీన్లను ప్రయోగాత్మకంగా ప్రారంభించి వీటిని మహిళా సంఘాలకు అప్పగిస్తే బాగుంటుందని సూచించింది. దీనివల్ల మహిళలకు పోషకాహారం అందడంతోపాటు మహిళా సంఘాలకు ఉపాధి కూడా లభిస్తుందని చెప్పింది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రయోగాత్మకంగా కొన్నింటి నిర్వహణ అప్పగించి వారు నడిపే తీరును పరిశీలించి భవిష్యత్తులో వారికే అప్పగించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించింది.