-48 షాపులు దగ్ధం, రూ.3 కోట్ల వరకూ ఆస్తినష్టం
ప్రజాశక్తి - రామచంద్రపురం (డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా) : మండలంలోని ద్రాక్షారామంలోగల కూరగాయల మార్కెట్లో గురువారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 48 దుకాణాలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.రెండు కోట్ల వరకూ ఆస్తినష్టం సంభవించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ద్రాక్షారామం మార్కెట్ లో కూరగాయలు, మాంసం ఇతర దుకాణాలు 50కి పైగా ఉన్నాయి. గురువారం వ్యాపారాలు నిర్వహించిన అనంతరం రాత్రి 10 గంటల తరువాత అన్ని దుకాణాలను మూసివేసి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. అర్ధరాత్రి 12.30 గంటలు దాటిన తరువాత దుకాణాల్లో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రామచంద్రపురం, కాకినాడ, మండపేట నుంచి మూడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను ఆర్పారు.
అయితే, అప్పటికే 48 దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్టు ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రెవెన్యూ తదితరులు పరిశీలించారు. బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా తన సొంత నిధులు రూ.20 లక్షలను అందించారు.









కామెంట్‌లు (0)