mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

శీతల ఖండంలో నిప్పుల వర్షం.. వడగాల్పులకు 10 రోజుల్లో 1300 మంది బలి

2 గంటల క్రితం

europe high temperature
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 01:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

యూరప్ : వాతావరణ మార్పుల ప్రభావంతో .... యూరప్‌ ఈసారి ఎన్నడూ లేనంత తీవ్రమైన ఎండలను ఎదుర్కొంటోంది. పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోవడంతో ప్రజలు ఉక్కపోత, వడగాలులు, వడదెబ్బలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత పది రోజుల్లోనే ఎండల కారణంగా 1,300 మందికిపైగా మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా వేసింది.


తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా యూరప్‌లోని అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించింది. అత్యవసర అవసరాలు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వడదెబ్బకు గురైన బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, పెరుగుతున్న కేసుల కారణంగా ఆస్పత్రులపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.


జర్మనీలో గత ఆదివారం 41.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా, ఫ్రాన్స్‌లో 43.3 డిగ్రీలు, బ్రిటన్‌లో 38.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరాయి. 1950 తర్వాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా వేసవికాలంలో 20 నుంచి 27 డిగ్రీల మధ్య ఉండే ఉష్ణోగ్రతలు ఈసారి 40 డిగ్రీలకు పైగా చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి వేళల్లోనూ వేడి తగ్గడం లేదు. అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్‌కు పైనే నమోదవుతుండటంతో ప్రజలకు విశ్రాంతి లేకుండా పోతోంది. ప్రపంచ సగటు కంటే యూరప్‌లో ఉష్ణోగ్రతలు మరింత వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


గత పది రోజుల్లో మరణించిన వారిలో చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో ఆస్పత్రులు వడదెబ్బ బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. కొన్నిచోట్ల వైద్య సదుపాయాలు సరిపోకపోవడంతో చికిత్స అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.


2022 నుంచి యూరప్‌లో తీవ్రమైన ఎండల ప్రభావం క్రమంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలోనే సుమారు 60 వేల మంది ఎండల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు అంచనాలు వెల్లడిస్తున్నాయి. శీతల వాతావరణానికి అనుగుణంగా నిర్మించిన ఇళ్లు, భవనాలు వేడిని ఎక్కువసేపు నిల్వ ఉంచుతుండటంతో, ఇంట్లో ఉన్నవారు కూడా అధిక ఉష్ణోగ్రతల ప్రభావానికి గురవుతున్నారని నిపుణులు చెబుతున్నారు.


వాతావరణ మార్పుల తీవ్రతకు తాజా ఉదాహరణగా యూరప్‌లో నెలకొన్న ఈ పరిస్థితులను నిపుణులు అభివర్ణిస్తున్నారు. భూతాపం పెరుగుతున్న కొద్దీ ఇటువంటి తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాలులు, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్