- రాష్ట్ర హోం మంత్రిని కోరిన రైతు సంఘం
ప్రజాశక్తి-వేపాడ : వేపాడ మండలం కొండగంగుపూడి ప్రాంతంలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న నిరుపేద రైతులకు భూ హక్కు పట్టాలు మంజూరు చేయాలని జిల్లా రైతు సంఘం నాయకుడు చల్లా జగన్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను కోరారు. మంగళవారం రాత్రి విశాఖపట్నంలోని హోం మంత్రి నివాసంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. కొండగంగుపూడి ప్రాంతంలో గిరిజన, బీసీ, దళిత కుటుంబాలకు చెందిన సుమారు 200 మంది తాతముత్తాతల కాలం నుంచి భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి హక్కు పత్రాలు లేవని వివరించారు. దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రాయితీలు అందడం లేదని, పలుమార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా జోక్యం చేసుకుని పేదలకు భూ పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కోళ్ల లలిత కుమారితో కూడా చల్లా జగన్ ఈ అంశంపై చర్చించారు. కొండగంగుపూడితో పాటు పలు గ్రామాల్లో పట్టాల సమస్య ఉందని ఎమ్మెల్యే మంత్రికి వివరించి, అసైన్‌మెంట్ కమిటీ ఏర్పాటు చేసి అర్హులైన నిరుపేదలకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని కోరారు.
దీనిపై స్పందించిన హోం మంత్రి అనిత మాట్లాడుతూ, పేదలకు భూ పట్టాలు అందించే అంశంపై ఇప్పటికే మంత్రివర్గంలో చర్చ జరిగినట్లు తెలిపారు. త్వరలోనే అసైన్‌మెంట్ కమిటీ ద్వారా అర్హులైన సాగుదారులకు పట్టాలు మంజూరు చేసే చర్యలు చేపడతామని చల్లా జగన్‌కు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆర్డీవోతో పాటు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)