mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సామాజిక న్యాయం లక్ష్యం కావాలి

1 గంట క్రితం

Central Tribal University's First Convocation Ceremony
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 10:36 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • జ్ఞానం, నైపుణ్యాలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలి

  • కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకలో రాష్ర్టపతి ద్రౌపది ముర్ము

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో, ఎంవిపి.కాలనీ : ‘గిరిజన విశ్వవిద్యాలయం సామాజిక న్యాయం లక్ష్యంగా స్థాపించబడింది. ఇలాంటి విద్యాసంస్థలు తమ పరిధిలోని గిరిజన సమాజాల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, అటవీహక్కుల పరిరక్షణ కోసం క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన బాధ్యతను కలిగి ఉండాలి. ఈ విశ్వవిద్యాలయంపై అనేక ప్రత్యేక బాధ్యతలున్నాయి. గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు విధాన రూపకల్పన సామర్థ్యాలను పెంచే కేంద్రంగా ఎదగాలి’ అని భారత రాష్ర్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. జ్ఞానం నైపుణ్యాలు, అనుభవాలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేలా పట్టాలు పొందిన వారంతా జీవితంలో కష్టపడి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మంగళవారం విశాఖలోని నోవోటల్‌ ‌హోటల్‌‌లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (విజయనగరం) ప్రథమ స్నాతకోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ... స్నాతకోత్సవ పట్టాలందుకుంటున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. తొలుత ఆమె ప్రసంగాన్ని హిందీలో, కొద్దిసేపు ఒరియాలో ప్రసంగించారు. స్నాతకోత్సవంలో పట్టాలు అందుకున్న విద్యార్థుల్లో 46 శాతం మంది అమ్మాయిలున్నారని, బంగారు పతకాలు సాధించిన 13 మందిలో 70 శాతం వారే ఉన్నారని, ఈ విషయం తనకు చాలా ఆనందం కలిగించిందని చెప్పారు. రాబోయే కాలంలో గిరిజన విశ్వవిద్యాలయం వెనుకబడిన తరగతులు, గిరిజన యువత సమగ్రాభివృద్ధితో పాటు ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి కూడా సార్థక కృషి చేస్తుందనే విశ్వాసం తనకుందని అన్నారు. 2021 నుంచి 2025-26 కాలంలో నాణ్యమైన విద్యకు కేంద్రంగా వర్సిటీ అభివృద్ధి చెందిందని తాను భావిస్తున్నానన్నారు. యూనివర్శిటీలు ఆచరణాత్మక అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఆధునిక విజ్ఞాన ప్రవాహాలతో సమర్థవంతంగా సాగాలన్నారు. గిరిజన యూనివర్శిటీ ఈ ప్రాంత గిరిజనులు, వెనుకబడిన తరగతుల జీవనోపాధి మెరుగుకు వినూత్న వ్యవస్థలను రూపొందించాలని, అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, చిరుధాన్యాలు, ఔషధ మొక్కలు, ఎకో టూరిజం, స్థానికంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలాగ కృషిచేయాలని రాష్ర్టపతి ఆకాంక్షించారు. గిరిజన భాషలు, మాండలికాల పరిరక్షణ కోసం మిషన్‌ ‌మోడ్‌‌లో పనిచేయాలని అన్నారు. ‘నేను మా గ్రామంలో తొలి పట్టభద్రురాలిని. ఈ రోజు మీలో కూడా అలాంటి తొలి పట్టభద్రులు ఉండే ఉంటారు’ అని ఆమె తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

​కొత్త దశలోకి ఎపి కొత్త ఆర్థిక వ్యవస్థ : ధరేంద్ర ప్రధాన్‌

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కొత్త దశలోకి అడుగుపెడుతోందని అన్నారు. రాబోయే సంవత్సరాల్లో ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సామర్థ్యం కోసం రాష్ర్ట ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. విద్యా పరిశోధనను సమాజ అవసరాలతో అనుసంధానించి విశ్వవిద్యాలయాలు ముందుకు సాగాలన్నారు.

​ఉన్నత విద్యా సంస్థలు ప్రజల ఆశలను నెరవేర్చాలి: గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌

2019లో ‌విజయనగరం జిల్లాలో ఏర్పాటైన కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం ఈ ప్రాంత ప్రజల ఆశలు నెరవేర్చాలని రాష్ర్ట గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ ‌నజీర్‌ అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ‌మాట్లాడుతూ... ఒక డిగ్రీతో బాధ్యత తీరిపోదని, ప్రజల జీవితాలను మార్చే పరిష్కారాలు చూపడమే అసలైన విద్య లక్ష్యమని అన్నారు. విశ్వవిద్యాలయాలు డిగ్రీలు ఇచ్చే ఫ్యాక్టరీలు కావని, సమాజ కలలను నెరవేర్చే సంస్థలని అన్నారు. తొలుత అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బంగారు పతకాలు అందజేశారు. విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం ఛాన్సలర్‌ ప్రొఫెసర్ మదన్ లాల్ మీనా, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.

కేసుల సాకుతో పట్టభద్రులను అడ్డుకున్న పోలీసులు

కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం సందర్భంగా వర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులను పోలీసులు లోపలికి అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారింది. పట్టాలు పొందేందుకు పలువురు విధ్యార్ధులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా, వారిలో తొమ్మిది మంది విద్యార్థులను పోలీసులు ప్రవేశ ద్వారం వద్ద అడ్డుకున్నారు. పట్టాలు అందుకునేందుకు తల్లిదండ్రులతో కలిసి ఎంతో ఆశగా వచ్చిన కె.జగదీశ్, మోహన్ నాయక్, రామకృష్ణ, విబిన్, ఉమా, జె.రవికుమార్, పి.రాజులను పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు మాట్లాడుతూ 2019-20లో లాక్‌డౌన్ సమయంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం కింద నమోదైన కేసులను ఆధారంగా చేసుకుని తమను అడ్డుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కేసులను అప్పట్లోనే లోక్ అదాలత్ లో కొట్టివేసినప్పటికీ, వాటినే కారణంగా చూపి ఈ కార్యక్రమానికి దూరం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. కేసులు నమోదైన తొమ్మిది మందిలో తుదకు ఇద్దరు విద్యార్థులకు అనుమతి ఇచ్చి, మిగిలిన ఏడుగురిని అడ్డుకోవడంపై వివక్ష జరిగిందంటూ ఆరోపించారు. ఈ ఘటనకు నిరసనగా బాధిత విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాము, నిఖిల్, సాయితేజలను పోలీసులు అరెస్టు చేశారు. కేసులు ఉన్నాయని పేరుతో కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరుకానీయకుండా చేయడాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్