చందు సరిగా బడికి వెళ్లకుండా అల్లరి పిల్లలతో ఆడుకుంటూ, గొడవలు పడుతూ ఉండేవాడు. అమ్మానాన్న ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఓ రోజు చందుకు వాళ్ల మామయ్య ఒక డైరీ ఇచ్చి వెళ్లాడు. "అది చాలా మహిమ గలదని, అందులో ఏది రాస్తే అది జరుగుతుంద"ని చెప్పాడు. ఆ మహిమ చూద్దామని చందు డైరీలో "బడికి వెళ్లాను" అని రాశాడు. చాలాసార్లు అలా రాశాడు. బడికి వెళ్లకుండా అలా రాయడం ఎందుకో చందుకు నచ్చలేదు. డైరీకి అబద్ధం చెబితే ఏం జరుగుతుందో అన్న భయంతో ప్రతిరోజూ బడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
ఆ తరువాత కొన్ని రోజులకు "ఎవరితో గొడవలు పడకుండా, బుద్ధిగా చదువుకున్నాను" అని డైరీలో రాశాడు. తగాదాలు పడితే డైరీ ఏం చేస్తుందో ఏమోనని తోటి వారితో స్నేహంగా మెలిగాడు. పెరటి తోటలో మొక్కలకు నీళ్లు పోయడం, తోటను సాగు చేయడం, తాను చేసిన అన్ని పనులను డైరీలో రాయడం చందుకు బాగా అలవాటైంది. మొదట డైరీ మీద ఉన్న భయంతో అలా చేసినా, నెమ్మదిగా మంచి అలవాట్లకు అలవాటుపడ్డాడు. "డైరీ చాలా మహిమ గలది" అని మామయ్య చెప్పిన అబద్ధం చందును బాగా మార్చేసిందని తెలిసి వాళ్ల అమ్మానాన్నలు, మామయ్య ఎంతో ఆనందించారు.
- అమ్మిన వెంకట అమ్మిరాజు
పేరూరు, తెలంగాణ
94407 08656







కామెంట్‌లు (0)