చివరి రోజు భారీగా తరలొచ్చిన యాత్రికులు
మత సామరస్యానికి నిదర్శనం : మంత్రి ఆనం
ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి : బారాషాహీద్ రొట్టెల పండుగ మంగళవారంతో ముగిసింది. ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు ఐదు రోజులపాటు నగరంలోని స్వర్ణాల చెరువులో ఘనంగా రొట్టెల పండుగ నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి లక్షల్లో యాత్రికులు దర్శించుకున్నారు. స్వర్ణాల చెరువులో స్నానం చేసి, తమ కోర్కెలు తీర్చే రొట్టెలను పట్టుకున్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో నగరం, జిల్లా నుంచి పెద్ద ఎత్తున యాత్రికులు తరలి వచ్చారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులోని చారిత్రాత్మక బారాషాహీద్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి బారాషాహీద్‌ను దర్శించుకుని దేశ ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పవిత్ర క్షేత్రం బారాషాహీద్ దర్గా అని పేర్కొన్నారు. భిన్న మతాలు, భిన్న సంప్రదాయాలు, భిన్న సంస్కృతులు కలిగిన ప్రజలు ఒకే వేదికపై కలుసుకుని పరస్పర గౌరవం, సోదరభావాన్ని చాటుకునే అపూర్వ ఆధ్యాత్మిక ఉత్సవం రొట్టెల పండుగ అని అన్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం కేవలం ఆధ్యాత్మిక విశ్వాసానికి మాత్రమే పరిమితం కాకుండా, సర్వమత సౌభ్రాతృత్వానికి, సామాజిక ఐక్యతకు, మానవ విలువలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు.








కామెంట్‌లు (0)