mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగూగుల్ డేటా సెంటర్‌కు ఇచ్చిన.. రాయితీలను వెనక్కి తీసుకోవాలి

1 రోజు క్రితం

eas sharma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 11:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సిఎంకు కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్‌.శర్మ లేఖ

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖపట్నంలో ప్రతిపాదిత గూగుల్–రైడెన్–అదానీ డేటా సెంటర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న భారీ రాయితీలను పునఃపరిశీలించి, విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రోత్సాహకాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్‌.శర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. ఆ వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. విశాఖ ప్రాంతంలోని డేటా సెంటర్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ప్రసార సంస్థ ప్రత్యేక విద్యుత్ ప్రసార వ్యవస్థను నిర్మించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రస్తావించిన శర్మ అందుకు వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యయాన్ని సాధారణ విద్యుత్ వినియోగదారులపై లేదా రాష్ట్ర ప్రజలపై మోపకుండా డేటా సెంటర్ నిర్వహించే గూగుల్ సంస్థ నుంచే అదనపు విద్యుత్ ఛార్జీల రూపంలో వసూలు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 11న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గూగుల్ డేటా సెంటర్‌కు యూనిట్ విద్యుత్‌పై ఒక రూపాయి చొప్పున పదిహేనేళ్ల పాటు రాయితీ కల్పిస్తూ, మొత్తం 4,800 కోట్ల రూపాయల వరకు ప్రోత్సాహకాన్ని ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో డేటా సెంటర్లు అధికంగా విద్యుత్, నీటిని వినియోగిస్తున్నందున వాటిపై అదనపు సుంకాలు, ప్రత్యేక ఛార్జీలు విధిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాయితీలు ప్రకటించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని శర్మ అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజలకు పరిమిత స్థాయిలో మాత్రమే ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం సమంజసం కాదన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్‌కు భూముల కేటాయింపు, విద్యుత్ రాయితీలు, ముద్రణ రుసుము, రిజిస్ట్రేషన్ చార్జీల మినహాయింపులు, రాష్ట్ర వస్తు సేవల పన్ను రాయితీలు, విద్యుత్ సుంకాల మినహాయింపులు వంటి అనేక ప్రోత్సాహకాలు ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ డేటా సెంటర్లకు దీర్ఘకాలిక పన్ను రాయితీలు ప్రకటించడం వల్ల గూగుల్‌కు మరింత ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. అందువల్ల గూగుల్ డేటా సెంటర్‌కు ప్రకటించిన విద్యుత్ రాయితీని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, డేటా సెంటర్ కోసం తలపెట్టే ప్రత్యేక విద్యుత్ ప్రసార మౌలిక వసతుల వ్యయాన్ని గూగుల్ సంస్థ నుంచే వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని శర్మ ప్రభుత్వాన్ని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్