mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘ఉక్కు’ భూముల్లో ఐరన్ ఓర్ బ్లెండింగ్ ప్లాంట్

1 గంట క్రితం

steel plant
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 03:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ‘అదాని, మిట్టల్‌’ కోసం కేంద్రం వ్యూహాత్మక పావులు!

  • ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే స్టాక్‌ ‌యార్డుకు సన్నాహాలు

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కాబోయే ఆర్సెలార్‌ ‌మిట్టల్‌ ‌స్టీల్‌ప్లాంట్ ‌కోసం, విశాఖ జిల్లా గంగవరంలోని అదాని పోర్టు కోసం కేంద్రంలోని బిజెపి పెద్దలు అత్యంత చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. బాలాచెరువు సమీప ప్రాంతంలో వైజాగ్ స్టీల్‌ ‌ప్లాంట్‌‌కు చెందిన 1167 ఎకరాల భూముల్లో ఐరన్‌ ఓర్‌ ‌బ్లెండింగ్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో నేషనల్‌ ‌మినరల్‌ ‌డెవలప్‌‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ (ఎన్‌ఎండిసి), రైల్‌ ‌వికాస్‌ ‌నిగమ్‌ ‌లిమిటెడ్‌ (ఆర్‌‌విఎన్‌ఎల్‌)‌లను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రంగంలోకి దింపాయి. ప్రతిపాదిత 1167 ఎకరాల విశాఖ స్టీల్‌‌ప్లాంట్‌ భూముల్లోనే ఐరన్‌ ఓర్‌ ‌బ్లెండింగ్‌ ‌ప్లాంట్‌‌ను మరో ఏడాదిన్నరలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదాని గంగవరం పోర్టుకు అత్యంత సమీపంలోనే ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంలో వేరు ఉద్దేశం కూడా ఉంది. ఛత్తీస్‌‌గఢ్‌ ‌నుంచి ఐరన్‌ ఓర్‌‌ను ఈ పోర్టుకు దిగుమతి చేసుకునే వ్యూహంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. ఐరన్‌ ఓర్‌ ‌డస్ట్‌‌తో పెల్లెట్లు తయారు చేసి అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కాబోయే ఆర్సెలార్‌ ‌మిట్టల్‌‌కు, విశాఖ ఉక్కు కర్మాగారానికి వాటిని సరఫరా చేస్తారని కేంద్రం చెబుతోంది. ఏడాదికి పది మిలియన్‌ ‌టన్నుల సామర్థ్యంగల ఈ బఫర్‌ ‌స్టాక్‌ ‌బ్లెండింగ్‌ ‌యార్డును బాలాచెరువు-అదాని గంగవరం పోర్టు మధ్యలో పెదగంట్యాడ సమీపంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడే ముడిపదార్థాల నిల్వ, నిర్వహణ చేస్తారు. దీంతో రవాణా సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయని ప్రభుత్వం చెబుతోంది. ఆ క్రమంలోనే పెదగంట్యాడలో 160 అడుగుల రోడ్డును సిద్ధం చేస్తున్నారు.

​కాలుష్య కాసారంగా గాజువాక

ఈ ప్లాంట్‌ యార్డుతో పెద్ద ఎత్తున ‌కాలుష్యం వెలువడుతుందని పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అదాని గంగవరం పోర్టు వల్ల ఉత్పన్నమవుతున్న కాలుష్యంతో భీతిల్లుతున్న గాజువాక నియోజకవర్గ ప్రజలు తాజా పరిస్థితుల నేపథ్యంలో మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 28న భారీ మానవహారం, నిరసన చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇదివరకే పెదగంట్యాడలో అదాని అంబుజా సిమెంట్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకించిన ప్రజలు ఐరన్‌ ఓర్‌ ‌బ్లెండింగ్‌ ‌ప్లాంట్‌పైనా పోరాటానికి సిద్ధమవుతున్నారు. తాజా ప్లాంట్‌‌తో డస్ట్‌ ‌నిర్వహణ, రోడ్డుపై వాహనాలతో విశాఖ, గంగవరం పోర్టులకు సరుకును రవాణా చేయడం ద్వారా ఈ ప్రాంతమంతా కాలుష్యకాసారం కాబోతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పబ్లిక్‌ ‌హియరింగ్‌ ‌నిర్వహించకుండా దీన్ని ఎస్‌ఇజెడ్‌ ‌పరిధిలోకి తీసుకొచ్చి ఆర్‌‌విఎన్‌ఎల్‌‌కి 33 ఏళ్లు లీజుకు ఇస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. ‌

​ఎస్సార్‌‌ను ఇలాగే దించారు

విశాఖ పోర్టు ఏరియాలో ఎస్సార్‌ ‌పెల్లెట్స్‌ ‌కంపెనీ వస్తే విశాఖ ఉక్కుకు ముఖ్యంగా విశాఖ ‌పోర్టుకు లాభం జరుగుతుందని ప్రచారం చేసి పాలకులు... ఎస్సార్‌ ‌ప్రైవేట్‌ ‌కంపెనీని తరువాత కాలంలో ఎఎంఅండ్‌ఎన్‌ఎస్‌ (ఆర్సెలార్‌ ‌మిట్టల్‌ అండ్‌ ‌నిప్పన్‌ ‌స్టీల్స్‌) కంపెనీ దక్కించుకుంది. ఈ కంపెనీయే ‌ప్రస్తుతం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో స్టీల్‌‌ప్లాంట్‌‌ను ఏర్పాటు చేస్తోంది. విశాఖ పోర్టు ఏరియాలోనే సదరు ఎఎంఅండ్‌ఎన్‌ఎస్‌ మకాం వేసి ప్రభుత్వ విశాఖ పోర్టుకు వ్యాపారం లేకుండా చేస్తోంది. అదే సమయంలో అదాని పోర్టు నుంచి ఐరన్‌ ‌పెల్లెట్స్‌‌ను ఎగుమతి, దిగుమతులు చేసుకుంటోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్