ప్రజాశక్తి-కాకినాడ : నగరంలోని రాజా ట్యాంక్ పార్కులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయనున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) తెలిపారు. బుధవారం ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణతో కలిసి రాజా ట్యాంక్‌ను సందర్శించి వాకర్లు, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వాకర్లు చెరువులోని నీరు పచ్చటి రంగులోకి మారి దుర్వాసన వెదజల్లుతోందని, నీటి నాణ్యత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వాకింగ్ ట్రాక్ పలు చోట్ల దెబ్బతినడంతో నడకకు ఇబ్బందిగా మారిందని, మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పిల్లల ఆట పరికరాలు తుప్పుపట్టి ప్రమాదకరంగా మారాయని, ఓపెన్ జిమ్ సామగ్రి కూడా వినియోగానికి అనువుగా లేదని తెలిపారు. అలాగే షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు వర్షాలతో బురదమయంగా మారిందని, టాయిలెట్ల సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు. వాకర్లు ప్రస్తావించిన సమస్యలను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజా ట్యాంక్ నగర ప్రజలకు ముఖ్యమైన విశ్రాంతి, ఆరోగ్య కేంద్రంగా మారిందని ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే నేపథ్యంలో సౌకర్యాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రజల భద్రత, సౌకర్యాలకు భంగం కలిగించే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. ఈ పర్యటనలో కార్పొరేషన్ ఎస్‌ఈ పి వెంకట్రావు, వాటర్‌వర్క్స్ డీఈ లక్ష్మీనారాయణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దళేపృథ్వీ చరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, వాకర్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రాజా ట్యాంక్ సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం : ఎమ్మెల్యే కొండబాబు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 24, 2026, 05:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)