ప్రజాశక్తి-గండేపల్లి
ప్రతి నీటి చుక్క ఎంతో విలువైనదని చెబుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఆచరణలో మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండల కేంద్రమైన గండేపల్లి గ్రామ శివారులోని శ్మశాన వాటిక వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకు నుంచి సోమవారం ఉదయం నుంచి నీరు వృథాగా ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మండలంలోని పలు గ్రామాల్లో తాగునీరు సక్రమంగా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు అందుబాటులో ఉన్న నీరు ఇలా వృథాగా పోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు. నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలాంటి సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ అధికారులు స్పందించి వాటర్ ట్యాంకు వద్ద నీటి వృథాను అరికట్టి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.








కామెంట్‌లు (0)