అడిషనల్ ఎస్పీ జోక్యంతో సద్దుమణిగిన ఉద్రిక్తత
ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ హిందూపురం కౌంటింగ్ కేంద్రం రాజకీయ వివాదానికి వేదికైంది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకులు (పీఏలు), పలువురు టీడీపీ నాయకులు కౌంటింగ్ నిర్వహిస్తున్న కళాశాల ఆవరణలో ఉండటంపై వైఎస్సార్సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార పార్టీకి ఒక న్యాయం.. ప్రతిపక్ష పార్టీకి మరో న్యాయమా.. అంటూ వైసీపీ ముఖ్య నాయకుడు వేణు రెడ్డి పోలీసులను నిలదీయడంతో కొద్దిసేపు అక్కడ వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. చివరకు జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. హిందూపురం నియోజకవర్గ పరిధిలోని హిందూపురం రూరల్ మండలంతో పాటు లేపాక్షి, చిలమత్తూరు మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ స్థానాలు, మూడు జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియను శనివారం పట్టణంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన, డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో సీఐలు, పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కొనసాగుతున్న సమయంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు చెందిన ఇద్దరు పీఏలు పలువురు టీడీపీ నాయకులతో కలిసి కళాశాల ఆవరణలో ఉన్నట్లు వైఎస్సార్సీపీ నాయకులకు సమాచారం అందింది. వారిలో ఒకరు స్థానికేతరుడని, కౌంటింగ్ కేంద్రం ఆవరణలో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు వేణు రెడ్డి పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వేణు రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాలకృష్ణకు చెందిన ఇద్దరు పీఏలు కౌంటింగ్ కేంద్రం ఆవరణలో ఉండటానికి ఎవరు అనుమతించారని, వారిలో ఒకరు స్థానికేతరుడైనప్పటికీ లోపలికి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన వారికి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీ నాయకులకు మరో న్యాయమా.. రాజ్యాంగంలో ఇలాంటి నిబంధనలు ఉన్నాయా.. అంటూ పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. గేటు వద్ద తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌంటింగ్ కేంద్రంలో అధికార పార్టీకి చెందిన నాయకులకు అనుమతి ఇచ్చి, ప్రతిపక్ష నాయకులను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నించాయి. దీంతో అక్కడ కొద్దిసేపు రాజకీయ వాతావరణం వేడెక్కింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన స్వయంగా జోక్యం చేసుకున్నారు. కౌంటింగ్ కేంద్రం ఆవరణలో ఉన్న బాలకృష్ణ పీఏలు, ఇతర నాయకులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులను కూడా పోలీసులు అక్కడి నుంచి పంపించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మొత్తానికి ప్రజాప్రతినిధుల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్న సమయంలో కౌంటింగ్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తుల ఉనికి, వారికి కల్పించే అనుమతుల విషయంలో నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాలనే అంశం ఈ ఘటనతో మరోసారి తెరపైకి వచ్చింది.









కామెంట్లు (0)