ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సముద్రపు అలలు
మొదలయిన ఈదురుగాలులు
50 మీటర్ల మేర వెనక్కి వెళ్లిన సముద్రం
మత్స్యకారులను అప్రమత్తం చేసిన అధికారులు
ప్రజాశక్తి - భోగాపురం (విజయనగరం) : మండలంలో తుఫాన్ ప్రభావం తెల్లవారు జాము నుంచే కనిపిస్తోంది. తీరప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీస్తుండగా, ముక్కాం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో పాటు సముద్రం సుమారు 50 మీటర్ల మేర వెనక్కి వెళ్లడం మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
తుఫాన్ నేపథ్యంలో మండల ప్రత్యేక అధికారి ఎన్.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ పి.రమేష్ ముక్కాం గ్రామంలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. మత్స్యకారులను అప్రమత్తం చేస్తూ సముద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టంగా హెచ్చరించారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చే వరకు సముద్ర తీరానికి వెళ్లకుండా, పడవలు, వేట సామగ్రి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. బలమైన ఈదురుగాలులు, సముద్ర అలల ఉధృతి నేపథ్యంలో పిల్లలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ గ్రామంలోనూ అధికారులను అప్రమత్తం చేశారు.
తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పరిస్థితులను ఆయా గ్రామాల అధికారులను అడిగి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తుఫాన్ ప్రభావంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, అవసరమైన సహాయక చర్యలకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.








కామెంట్‌లు (0)