- పలు దేశాల్లో పెల్లుబికిన ప్రజాగ్రహం
- ధరలు, ఇళ్లు, విద్యకై రోడ్డెక్కిన జనం
- అమెరికా నుండి అర్జెంటీనా వరకు వీధుల్లోకి జనం
పారిస్/బ్రస్సెల్స్/లిస్బన్ : ప్రపంచంలోని పలు దేశాల్లో ఇటీవల భారీ నిరసనలు చెలరేగాయి. ఫ్రాన్స్ నుంచి అర్జెంటీనా వరకు ఈ ఆందోళనల వెనుక దాదాపు ప్రతి దేశంలో కనిపించే సమస్యలు ఇళ్ల ధరలు, ద్రవ్యోల్బణం, ప్రజా సేవలకు నిధుల కోత, ప్రభుత్వ వ్యతిరేకత. వీటిలో ఫ్రాన్స్, అల్బేనియాలు ప్రభుత్వ విధానాలపై అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. శనివారం నాడు ఫ్రాన్స్ అంతటా లక్షల మంది వీధుల్లోకి వచ్చారు. పెరిగిన ధరలు, క్షీణిస్తున్న ప్రభుత్వ సేవలు, శిథిలావస్థలోని పాఠశాలలు, విద్యా నిధుల కోతలపై ఈ ప్రదర్శనలు జరిగాయి.
ఉద్యమం ఎలా మొదలైందంటే..
గత నెల పారిస్ ఉత్తర శివార్లలోని పేద ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలల్లో ఈ ఉద్యమం మొదలైంది. ఉపాధ్యాయుల కొరత, శిథిలమైన భవనాలపై కోపం క్రమంగా అసమానత, ప్రజా వ్యయం, జీవన ప్రమాణాలపై విస్తృత ఉద్యమంగా మారింది. పాఠశాలల్లో నిరసనలు మొదట స్థానికంగా మొదలై తరగతులు స్తంభించాయి. ఆ తర్వాత ఇంధన ధరలు, జీవన వ్యయంపై భారీ ఆందోళనగా రూపుదాల్చాయి. 2018 నాటి ‘‘గిలెట్స్ జోన్’’(ఎల్లో వెస్ట్) ఉద్యమాన్ని పునరుద్ధరించాలని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పిలుపులు శనివారం మరింత మందిని వీధుల్లోకి తెచ్చాయి. అప్పట్లో ఇంధన పన్నుల పెంపుపై మాక్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరిగింది. కొందరు ప్రదర్శకులు హై-విజిబిలిటీ జాకెట్లు ధరించి రోడ్లను అడ్డుకున్నారు. కార్మిక సంఘాలు కూడా ఈ ఆందోళనలకు మద్దతిస్తూ అధిక వేతనాలు, పింఛన్లు, తక్కువ ధరలును డిమాండ్ చేసింది. ‘‘జీవన వ్యయం మరీ భారంగా ఉంది, అందుకే పోరాడుతున్నాం’’ అని పారిస్‌లో 19 ఏళ్ల నిరసనకారిణి లోలా చెప్పారు. ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఎక్కువ మంది ఉపాధ్యాయులను అడిగినందుకు విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. అక్టోబర్‌లో 2 వేల మందిపై జరిపిన సర్వేలో 45 శాతం మంది ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందుతున్నట్లు తేలింది. ప్రభుత్వ రుణాన్ని తగ్గించే ప్రయత్నాలు పెట్టుబడిదారుల కోసమేనని, ప్రభుత్వ రుణ వ్యయాలు రెండు దశాబ్దాలలో అత్యధిక స్థాయికి చేరాయని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఘటనలు అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌పై ఒత్తిడిని పెంచాయి. నిబంధనల ప్రకారం ఆయన మళ్లీ పోటీ చేయలేరు. ఆరు నెలల్లో ఆయన వారసుడి కోసం ఎన్నికలు జరగనున్నాయి. హింసకు పాల్పడినవారిని విచారించి శిక్షిస్తామని, ‘‘గందరగోళాన్ని విత్తేవారికి’’ వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలుస్తుందని ఆయన ఆదివారం చెప్పుకొచ్చారు. అయితే. ఫ్రాన్స్ ‘‘మూడో ప్రపంచాన్ని దిగుమతి చేసుకుంది’’ అని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ వలసలను నిందించారు. ఫ్రాన్స్ విద్యార్థి ఉద్యమంలో స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఇతర యూరప్ దేశాల్లోనూ ఆందోళనలు
బెల్జియం: ఇంటి ఖర్చులు పెరగడం, ప్రజా వ్యయంలో కోతల నేపథ్యంలో విద్యార్థులు ఉన్నత విద్య, విశ్వవిద్యాలయ రిజిస్ట్రేషన్ రుసుముల పెంపును వ్యతిరేకిస్తున్నారు. ఇది బెల్జియం అంతటా జీవన వ్యయ నిరసనగా విస్తరించింది. బ్రస్సెల్స్, లీజ్ నగరాల్లో పోలీసులతో ఘర్షణలు జరిగాయి. పోలీసులు బాష్పవాయువు, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. లీజ్‌లో 45 మందిని అరెస్టు చేశారు. ఇది ‘‘సమాజాన్ని అస్థిరపరిచేందుకు సంఘటితంగా, పునరావృతంగా చేస్తున్న స్వచ్ఛమైన హింస’’ అని అంతర్గత మంత్రి బెర్నార్డ్ క్వింటిన్ ఆందోళనకారులను విమర్శించారు.
ఇటలీ : పెరుగుతున్న జీవన వ్యయం, తగ్గుతున్న కొనుగోలు శక్తికి నిరసనగా మిలాన్‌లో జరిగిన ప్రదర్శన అదుపు తప్పింది. స్తబ్దుగా ఉన్న వేతనాలు, ద్రవ్యోల్బణం, రోజువారీ ఖర్చులు భరించడంలో ఇబ్బందులపై ఈ నిరసన జరిగింది. కేథడ్రల్ ఎదుటి చౌరస్తాను ఖాళీ చేయించేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ట్యూరిన్‌లో కూడా ఘర్షణలు జరిగాయి. బొలోన్యాలో పోలీసులు వాటర్ కెనాన్ ప్రయోగించి ఏడుగురిని అరెస్టు చేశారని ఆ దేశ మీడియా నివేదించింది.
పోర్చుగల్ : పెరుగుతున్న జీవన వ్యయం, తక్కువ వేతనాలు, అందుబాటు ధరల్లో ఇళ్లు దొరకకపోవడంపై లిస్బన్లో వేలాది మంది కవాతు చేశారు. లిస్బన్ సహా అనేక నగరాల్లో 2017 నుంచి ఆస్తి ధరలు రెట్టింపుకు మించి పెరిగాయి. కొత్త లీజుల అద్దెలు కూడా దాదాపు అంతే పెరిగాయి. ఇది యువ ఉద్యోగులు, తక్కువ ఆదాయ కుటుంబాలపై భారం మోపింది. ఇల్లు కొనలేకపోవడమే కాక, అద్దెకు ఉండటం కూడా భరించలేనిదిగా మారిందని చాలామంది భావిస్తున్నారు.
అల్బేనియా: విశ్వవిద్యాలయాల దుస్థితి, అధిక విద్యా వ్యయం, ఆర్థిక సహాయం లేకపోవడం, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉపాధి అవకాశాల కొరతపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. గత వారం టిరానాలో విద్యా మంత్రిత్వ శాఖ భవనం వద్ద ఆందోళన హింసాత్మకంగా మారింది.పోలీసులు అణచివేతకు దిగారు. అసమానత, నిరుద్యోగం, ధనిక-పేద అంతరంపై ఆందోళనల తో డిమాండ్లు విస్తరించాయి. ఐదో రోజు ఆందోళనల్లో ప్రధాని ఎడి రామా రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. అవినీతి, విద్య, ఉపాధి అంశాలకూ యువత పోరాడుతుంది.
అమెరికా: ‘‘నో కింగ్స్- ఓట్ ఎర్లీ’’
అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వ్యతిరేకించే ‘‘నో కింగ్స్’’ నెట్వర్క్ దేశవ్యాప్తంగా నగరాల్లో, సమాజాల్లో ర్యాలీలు నిర్వహించింది. మధ్యంతర ఎన్నికల్లో ముందస్తు ఓటింగ్, ఓటర్ల హాజరు, ఎన్నికల రక్షణపై దృష్టి పెడుతూ ‘‘నో కింగ్స్: వోట్ ఎర్లీ’’ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. వాషింగ్టన్ డి.సి.లో లింకన్ మెమోరియల్ మెట్ల వద్ద భారీ గాలితో నింపిన గాడిద బొమ్మ, ట్రంప్ తల ఆకారపు పేపర్ మాషే బొమ్మ, ‘‘ముందస్తుగా ఓటు వేయండి’’ అనే బోర్డులతో నిరసన తెలిపారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని ఎవరెట్‌లో ‘‘ప్రజాస్వామ్యం కోసం సంగీత కచేరీ’’ని నిర్వహించారు. మిన్నియాపోలిస్‌లో వేలాది మంది సమీకరించారు. అక్కడ అటార్నీ జనరల్ కీత్ ఎలిసన్, మాజీ మేయర్ ఆర్.టి. రైబాక్ ప్రసంగించారు. టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ‘‘ఓటు మీ సూపర్‌పవర్’’ పేరుతో సూపర్ హీరో కేప్‌లు, ముసుగులతో ఈ కార్యక్రమం జరిగింది. టెక్సాస్‌లో నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. వాషింగ్టన్లో క్యాపిటల్ సమీపంలో పోస్టల్ బ్యాలట్ డ్రాప్ బాక్స్ వద్ద ‘ఫ్రీ డిసి’ బృందం సమావేశమైంది. ఓటు వేసినవారిని చప్పట్లతో ప్రోత్సహించింది. ఓటర్లు పౌరసత్వ రుజువు చూపాలని నిర్దేశించే ‘సేవ్ అమెరికా యాక్ట్’ విఫలమవడం, ఎన్నికల కేంద్రాల వద్ద ఫెడరల్ ఇమిగ్రేషన్ అధికారులను పంపుతారన్న ఆందోళనలు, మెయిల్ ఓటింగ్‌ను పరిమితం చేసేందుకు ట్రంప్ ప్రయత్నాలను ఆందోళనాకారులు ప్రస్తావించారు.
అర్జెంటీనా: ఈ వారం ప్రారంభంలో బ్యూనస్ ఎయిర్స్లో అధ్యక్షుడు హేవియర్ మిలేయ్ ఉన్నత విద్యా వ్యయ కోతలను నిరసిస్తూ ఆందోళనకారులు పోలీసులతో తలపడ్డారు. పార్లమెంటు వెలుపల వేలాది విశ్వవిద్యాలయ విద్యార్థులు, సిబ్బంది, కార్మిక సంఘాలు, ప్రతిపక్ష కార్యకర్తల ప్రధాన ప్రదర్శన శాంతియుతంగానే సాగింది. అయితే గుంపు నుంచి విడిపోయిన డజన్ల కొద్దీ ముసుగు ధరించినవారు పోలీసులపై రాళ్లు, ఇతర వస్తువులు విసిరారు. 2023 చివరలో మిలేయ్ అధికారంలోకి వచ్చాక విద్యా నిధుల సంక్షోభంపై జరిగిన ఐదో నిరసన ఇది.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఎక్కువ నిధులు ఇవ్వాలన్న 2025 చట్టాన్ని పాటించాలని పలు కోర్టు తీర్పులు ఆదేశించిన నేపథ్యంలో ఇవి జరిగాయి.
టర్కీ: నిరంతర ద్రవ్యోల్బణం మధ్య తీవ్రమైన జీవన వ్యయ ఒత్తిళ్లు, సరిపోని పింఛన్లపై గత నెల పదవీ విరమణ చేసినవారు, కార్మిక సంఘాలు నిరసన తెలిపాయి. గౌరవంగా జీవించే రాజ్యాంగ హక్కును కోరుతూ అంకారాలో రాజ్యాంగ న్యాయస్థానం ఎదుట పింఛనుదారులు గుమిగూడారు. ఈ సందర్భంగా టర్కీ జెండా కప్పుకుని, ‘‘డబ్బు కోసం కాదు, మా గౌరవం కోసం’’ అనే ప్లకార్డు పట్టుకున్న 60 ఏళ్ల రిటైర్డ్ పోలీసు అధికారి అలీ షెకెరోగ్లు తన ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగులైన ఇద్దరు కుమారుల గురించి మాట్లాడిన తర్వాత తన సర్వీస్ వెపన్తో కాల్చుకున్నారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.
ఇంతటి ప్రజాగ్రహానికి పాలకులు విధానాలే కారణం. ఎటుతెరిపి లేని యుద్ధాలు కారణంగా ఇంధన ధరలు పెరిగి యూరప్‌లో ద్రవ్యోల్బణం ఎగబాకింది. ఇరాన్‌పై యుద్ధం, రష్యాపై కొనసాగుతున్న నాటో నేతృత్వ యుద్ధంతో ముడిపడిన ఇంధన ధరల పెరుగుదల యూరప్ ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెంచుతున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.







కామెంట్లు (0)