రోమ్ : ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పెరుగుతున్న జీవన వ్యయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం నిరసనలకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా కవాతులు, ధర్నాలు, సమావేశాలు, సమ్మెలతో సహా 30కి పైగా ఆందోళనలు షెడ్యూల్ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో ప్రభ ఉత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. వేలాది మంది పోలీసు అధికారులు, సైనికులను మోహరించడంతో పాటు డ్రోన్ నిఘాను కూడా ఏర్పాటు చేసింది. రోమ్‌లో సుమారు 1,500 మంది అధికారులను మోహరించనుండగా, మిలన్‌లో సుమారు 1,000 మంది పోలీసు అధికారులు, కారబినేరి, 300 మంది మున్సిపల్ అధికారులు, 500 మంది సైనికులను మోహరించినట్లు మీడియా వెల్లడించింది. అక్టోబర్ 17, 18న చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. మిలన్, బోలోగ్నా, జెనోవా, ట్యూరిన్, రోమ్, ఫ్లోరెన్స్‌తో సహా పలు ఇటాలియన్ నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు.
రోమ్‌లో, ఆన్‌లైన్‌లో ప్రకటించిన అధికారిక ప్రదర్శనలు, ర్యాలీలు రెండింటినీ పర్యవేక్షించేందుకు పోలీసులు ఒక భద్రతా ప్రణాళికను రూపొందించారు. నిఘా కోసం పోలీసులు డ్రోన్‌లు, కారబినేరి విమానాలను ఉపయోగించనున్నట్లు మీడియా తెలిపింది. బహిరంగ ప్రదేశాల నుండి రైల్వే స్టేషన్ల వరకు తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఆన్‌లైన్ కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. టెలిగ్రామ్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోని పోస్టులు, కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, రోమ్ సైబర్‌సెక్యూరిటీ సెంటర్, ఇటాలియన్ రాష్ట్ర పోలీసుల ప్రత్యేక కార్యాచరణ విభాగమైన డిగోస్‌తో కలిసి పనిచేస్తోందని యూరోన్యూస్ నివేదించింది. మరోవైపు, గరిబాల్డి, పోర్టా వెనిజియా జిల్లాలలో ప్రదర్శనలను నిషేధించారు.
వారాంతంలో, ముఖ్యంగా శనివారం మిలన్, ఇతర ప్రధాన ఇటాలియన్ నగరాల్లో ప్రదర్శనలు జరిగే అవకాశం ఉందని ఇటలీలోని అమెరికా మిషన్ హెచ్చరించింది. పియాజా డుయోమో, వియా డాంటే, వియా టొరినో, కోర్సో విట్టోరియో ఇమాన్యుయెల్ 2, కోర్సో బ్యూనస్ ఎయిర్స్, కోర్సో జెనోవా, కోర్సో వెర్సెల్లి వంటి ప్రధాన వీధులకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. ఇటలీ, ఫ్రాన్స్, బెల్జియంలలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రదర్శనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని భారత్ కూడా హెచ్చరించింది. ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం ఈ మూడు దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని, అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.








కామెంట్‌లు (0)