వెనిజులాలో తరచూ భూకంపాలు సంభవించడానికి ఆ దేశం ఉన్న భౌగోళిక స్థానం ప్రధాన కారణమని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వెనిజులా ప్రపంచంలోని అత్యంత చురుకైన భూకంప మండలాల్లో ఒకటైన కరేబియన్ టెక్టానిక్ ఫలకం (Caribbean Plate), దక్షిణ అమెరికా టెక్టానిక్ ఫలకం (South American Plate) సరిహద్దులో ఉంది. ఈ రెండు భారీ భూగర్భ ఫలకాలు నిరంతరం కదులుతూ ఉండటంతో భూమిలో ఒత్తిడి ఏర్పడి, అది ఒక్కసారిగా విడుదలైనప్పుడు భూకంపాలు సంభవిస్తాయి. అందుకే వెనిజులాలో చిన్నవి, పెద్దవి కలిపి ప్రతి ఏడాది వందల సంఖ్యలో భూకంపాలు నమోదవుతుంటాయి. వాటిలో చాలా వరకు స్వల్ప తీవ్రతతో ఉండగా, కొన్నిసార్లు మాత్రం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించే భారీ భూకంపాలుగా మారుతాయి.
మనకు భూమి ఒకే గట్టి రాతి గోళంలా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి భూమి పైపొర ఒకే ముక్క కాదు. అది అనేక భారీ రాతి పలకలుగా విడిపోయి ఉంటుంది. వీటినే శాస్త్రవేత్తలు టెక్టానిక్ ఫలకాలు అంటారు. ఈ ఫలకాలు భూమి లోపల ఉండే అత్యంత వేడి, ద్రవరూప శిలలపై చాలా నెమ్మదిగా కదులుతుంటాయి. మన కంటికి ఆ కదలిక కనిపించదు. ఎందుకంటే అవి సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్ల దూరమే కదులుతాయి. అయితే ఈ చిన్న కదలికలే లక్షల టన్నుల రాళ్లపై అపారమైన ఒత్తిడిని సృష్టిస్తాయి. ఆ ఒత్తిడి ఒక దశలో ఒక్కసారిగా విడుదలైతే భూమి కంపిస్తుంది. అదే భూకంపం.
వెనిజులా ఎందుకు ప్రమాద ప్రాంతం?
వెనిజులా ఉన్న ప్రాంతంలో కరేబియన్ ఫలకం, దక్షిణ అమెరికా ఫలకం ఒకదానికొకటి ఆనుకుని ఉన్నాయి. ఈ రెండు ఫలకాలు ఒకే దిశలో కదలవు. ఒకదానికొకటి ఎదురెదురుగా జారుతూ ఉంటాయి. సంవత్సరానికి సుమారు రెండు నుంచి మూడు సెంటీమీటర్ల చొప్పున కదిలినా, వాటి మధ్య ఉండే రాళ్లు వెంటనే జారిపోవు. రాపిడి కారణంగా అవి చాలా సంవత్సరాల పాటు బిగుసుకుపోతాయి. దీంతో భూమి లోపల ఒత్తిడి క్రమంగా పెరుగుతుంది. ఆ ఒత్తిడి రాళ్లు తట్టుకోలేని స్థాయికి చేరుకున్నప్పుడు అవి ఒక్కసారిగా విరిగిపోతాయి. ఆ సమయంలో విడుదలయ్యే శక్తే భూకంప తరంగాల రూపంలో అన్ని దిశలకూ వ్యాపిస్తుంది. అందుకే వెనిజులాలో తరచూ భూకంపాలు నమోదవుతుంటాయి.
చిన్న కదలికలు... పెద్ద ప్రకంపనలు
భూగర్భ ఫలకాలు సంవత్సరానికి కేవలం రెండు లేదా మూడు సెంటీమీటర్లే కదులుతాయి. ఈ దూరం ఒక మనిషి వేలి గోరు కొన్ని నెలల్లో పెరిగేంత మాత్రమే. కానీ ఈ చిన్న కదలికలను తక్కువగా అంచనా వేయలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ఆ కదలికల వల్ల వేల కిలోమీటర్ల పొడవైన రాతి పొరల్లో అపారమైన శక్తి నిల్వ అవుతుంది. ఒకసారి ఆ శక్తి విడుదలైతే కొన్ని సెకన్లలోనే వందల కిలోమీటర్ల దూరం వరకు ప్రకంపనలు వ్యాపిస్తాయి. భవనాలు కూలిపోవడం, రహదారులు చీలిపోవడం, వంతెనలు దెబ్బతినడం వంటి ఘటనలు అప్పుడు జరుగుతాయి.
వెనిజులాలో ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రాంతాలు
వెనిజులాలో భూమి అడుగున అనేక భ్రంశ రేఖలు (ఫాల్ట్‌లు) ఉన్నాయి. ఇవి భూమి పైపొరలో ఏర్పడిన పెద్ద పగుళ్ల వంటివి. ఈ పగుళ్ల వెంట రాళ్లు కదులుతూ ఉండటంతో భూకంపాలు ఎక్కువగా నమోదవుతాయి. ముఖ్యంగా బోకోనో, ఎల్ పిలార్, సాన్ సెబాస్టియన్ అనే భ్రంశ రేఖలు అత్యంత చురుకుగా ఉంటాయి. అందువల్ల కారకాస్, సుక్రే, మెరిడా, కారాబోబో ప్రాంతాలు భూకంపాలకు ఎక్కువగా గురవుతుంటాయి. గతంలో సంభవించిన చాలా పెద్ద భూకంపాలు కూడా ఈ ప్రాంతాల పరిసరాల్లోనే నమోదయ్యాయి.
కారకాస్‌లో నష్టం ఎందుకు ఎక్కువ?
రాజధాని కారకాస్ ఒక లోయ ప్రాంతంలో ఉంది. అక్కడి నేలలో గట్టి రాళ్ల కంటే మట్టి, ఇసుక, అవక్షేపాలు ఎక్కువగా ఉంటాయి. భూకంప తరంగాలు ఇలాంటి నేలలోకి వచ్చినప్పుడు వాటి ప్రభావం మరింత పెరుగుతుంది. ఒకే తీవ్రతతో భూకంపం గట్టి రాతి నేలపై, మృదువైన మట్టి నేలపై సంభవిస్తే మట్టి నేలపై ఉన్న ప్రాంతాల్లో నష్టం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే కారకాస్‌లో గతంలో అనేకసార్లు భవనాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
సునామీ ప్రమాదం కూడా ...
వెనిజులాకు దాదాపు 2,800 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉంది. సముద్రం అడుగున భూకంపం సంభవిస్తే సముద్ర జలాలు ఒక్కసారిగా కదిలి భారీ అలలను సృష్టిస్తాయి. వీటినే సునామీ అలలు అంటారు. వెనిజులాలో 1853, 1900, 1929 సంవత్సరాల్లో సంభవించిన కొన్ని భూకంపాల తర్వాత సునామీ ప్రభావం కూడా నమోదైంది. అందువల్ల అక్కడ భూకంపాలతో పాటు తీర ప్రాంత ప్రజలు సునామీ ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటుంటారు.
వెనిజులాలో ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో చిన్న భూకంపాలు నమోదవుతుంటాయి. వీటిలో చాలా వరకు ప్రజలకు తెలియవు. ఎందుకంటే వాటి తీవ్రత తక్కువగా ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో భూమి లోపల ఒత్తిడి చాలా సంవత్సరాల పాటు పేరుకుపోతుంది. అది ఒక్కసారిగా విడుదలైనప్పుడు 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భారీ భూకంపాలు సంభవిస్తాయి. 1812, 1967, 2018, 2026లో సంభవించిన భూకంపాలు ఇందుకు ఉదాహరణలు.
భవనాల నిర్మాణం కూడా ముఖ్యమే!
భూకంపం వల్ల జరిగే నష్టం తీవ్రత భూమి కదలికపై మాత్రమే ఆధారపడదు. భవనాలు ఎలా నిర్మించారన్నదీ చాలా ముఖ్యమైన అంశం. పాతకాలంలో నిర్మించిన భవనాల్లో భూకంప నిరోధక సాంకేతికత ఉండదు. అందువల్ల అవి సులభంగా కూలిపోతాయి. 1967లో కారకాస్‌లో జరిగిన భూకంపం తర్వాత వెనిజులా ప్రభుత్వం భూకంప నిరోధక నిర్మాణ నిబంధనలను అమలు చేసింది. అయినప్పటికీ పాత భవనాలు ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉన్నాయి. అందువల్ల కొత్త భవనాల నిర్మాణంలో ప్రత్యేక ప్రమాణాలు పాటిస్తున్నారు.
భూకంపాన్ని ముందే చెప్పగలమా?
భూకంపం ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వస్తుందో, ఎంత తీవ్రతతో వస్తుందో ముందుగానే ఖచ్చితంగా చెప్పే సాంకేతికత ఇప్పటికీ అందుబాటులో లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే భూమిలో జరిగే చిన్న కదలికలను గుర్తించే అత్యాధునిక పరికరాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా భూకంపం సంభవించిన వెంటనే సమాచారం అందుతుంది. జపాన్, మెక్సికో వంటి కొన్ని దేశాల్లో భూకంప తరంగాలు ప్రజలు చేరుకునేలోపే కొన్ని సెకన్ల ముందుగా హెచ్చరికలు పంపే వ్యవస్థలు పనిచేస్తున్నాయి. దీంతో రైళ్లను నిలిపివేయడం, విద్యుత్, గ్యాస్ సరఫరాలను ఆపడం, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం కలుగుతోంది.








కామెంట్‌లు (0)