- కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి, మరో ఏడుగురు గల్లంతు
- మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలి : విజయన్
తిరువనంతపురం : కేరళలోని వయనాడ్‌లో మరోసారి కొండచరియలు బీభత్సం సృష్టించాయి. వయనాడ్‌లోని మెప్పాడి సమీపంలో ఉన్న కల్లాడి వద్ద మంగళవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కల్లాడిలోని మీనాక్షి వంతెనకు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఏడుగురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. అయితే శిథిలాల క్రింద ఇంకా అనేక మంది చిక్కుకుని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం వద్ద పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కోజికోడ్‌ను వయనాడ్‌తో అనుసంధానం కోసం నిర్మాణంలో ఉన్న వయనాడ్ టన్నెల్ రోడ్ (అనక్కంపొయిల్–కల్లాడి–మెప్పాడి) ప్రాజెక్ట్ ప్రవేశ ద్వారం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.
ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో దాదాపు 100 మంది నివసిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండచరియల కారణంగా మలప్పురం - వయనాడ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు, మీనాక్షి వంతెన వద్ద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాదం గురించి తెలియగానే రాష్ట్ర ముఖ్యమంత్రి విడి సతీశన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరగా కార్మికులను రక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్, సిద్దిఖీ వయనాడ్‌కు బయల్దేరారు. వయనాడ్‌లో 2024లోనూ కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆసమయంలో ముండక్కై, చూర్‌మల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 298 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం, మంగళవారం ప్రమాదం జరిగిన ప్రాంతంలో గత 24 గంటల్లో సుమారు 265 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది ఈ సీజన్‌లో నమోదైన అత్యధిక వర్షపాతం. వయనాడ్, కోజికోడ్ జిల్లాలకు ఈ నెల 9 వరకూ భారత వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. అలాగే, మంగళవారం ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో కొండ వాలు నుంచి దట్టమైన బురద ప్రవాహం వేగంగా కిందికి దూసుకురావడం, దారిలో ఉన్న చెట్లను వేళ్లతో సహా లాక్కొని రావడం కనిపిస్తోంది. అలాగే, ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీయడం, ఒక భారీ ఇంధన ట్యాంకర్ ల ప్రవాహంలో కొట్టుకుపోవడం కూడా ఆ వీడియోలలో కనిపిస్తోంది.
విషాదకరం, దిగ్భ్రాంతికరం : విజయన్
వయనాడ్ కొండచరియల విపత్తుపై కేరళం మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పినరయి విజయన్ స్పందించారు. ఈ ఘటనను ‘‘విషాదకరం, దిగ్భ్రాంతికరం’’గా అభివర్ణించారు. అలాగే, ఈ ఘటనపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలను నివారించడానికి, లేదా ఎలాంటి లోపాలు లేదా ‘‘నేరపూరిత నిర్లక్ష్యం’’ ఈ ఘటనకు దారితీశాయేమో తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. ఈ మేరకు విజయన్ ఒక ప్రకటన విడుదల చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి, గాయపడిన వారికి ఉచిత వైద్య చికిత్స అందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు విజయన్ తన మద్దతును కూడా ప్రకటించారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విజయన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.








కామెంట్‌లు (0)