మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తి

2 గంటల క్రితం

rammohan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 01:17 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- త్వరలోనే ప్రారంభం : కేంద్ర మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడు

- పెట్టుబడి, ప్రయాణికుల రద్దీ ఆధారంగా యుడిఎఫ్‌ ‌ఛార్జీలు

ప్రజాశక్తి-భోగాపురం : ఏరో డ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం విమానాశ్రయం శత శాతం పూర్తయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. త్వరలోనే విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం_ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 2026 లోగా నిర్మాణానికి డెడ్ లైన్ విధించగా, అందుకు ఆరు నెలల_ ముందుగానే నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో గత నెలరోజులుగా వెరిఫికేషన్ కార్యక్రమం నిర్విరామంగా సాగిందని, ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే తేదీ ఖరారు అయిన తర్వాత ఎయిర్ పోర్ట్ ను ప్రారంభిస్తామని చెప్పారు. వారం రోజుల తరువాత పూర్తి స్థాయి కార్యకలాపాలు, రాకపోకలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. నాలుగు కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనువుగా విమానాశ్రయం నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. టైర్ వన్ సిటీలలో ఏర్పాటయ్యే విమానాశ్రయాలకు ధీటుగా అంతర్జాతీయ స్థాయి వసతులు చేరువ చేసినట్టు చెప్పారు. ఎగిరే చేప ఆకృతిలో 78000 చదరపు అడుగుల పరిమాణంలో టెర్మినల్ భవనం నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం మీదుగా ఆరు లైన్ల జాతీయ రహదారి కోస్టల్ కారిడార్ కోసం ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని, అన్ని అనుమతులు వచ్చిన తరువాత రెండేళ్లలో నిర్మాణం పూర్తికి ప్రయత్నిస్తామన్నారు.

దేశంలో ఇటీవల కాలంలో నిర్మాణం అయిన విమానాశ్రయాలలో భోగాపురం అత్యుత్తమమైనదని, 20వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో భోగాపురం కార్గో_ నిర్మాణం జరుగుతోందని, ఫార్మా రంగంతో పాటు, మామిడి, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఉత్పత్తులను సులభంగా ఎగుమతి చేసేందుకు భోగాపురం ఓ వారధిలా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో 850 కి పైగా విమానాలు అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్ లో 1600కి పైగా ఆర్డర్ ఇచ్చినట్టు తెలిపారు. యుడిఎఫ్ ఛార్జీల విషయంలో పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ...పెట్టుబడి, ప్రయాణికుల రద్దీ, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఒక నిర్దిష్టమైన ఫార్ములా ప్రకారం యుడిఎఫ్ ఛార్జీలను విధించామని తెలిపారు. ప్రతీ అయిదేళ్ళకు ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనల ప్రకారం యుడిఎఫ్ ఛార్జీలను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, నెలిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు. జిఎంఆర్ ప్రాజెక్ట్ హెడ్ రామరాజు, సిఇఒ లక్కీ వర్మ భాస్కర్ పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్