సెనెగల్: పశ్చిమ ఆఫ్రికా నుంచి యూరప్‌కు వలస వెళ్తున్న వారితో కూడిన పడవ వాయవ్య సెనెగల్ తీరంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 34 మంది మృతిచెందగా, ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సెనెగల్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ వివరాలు వెల్లడించింది.
డాకర్, సెయింట్ లూయిస్ నగరాల మధ్య కెబెమెర్ ప్రాంతంలోని లౌంపౌల్ ఇసుక తిన్నెల సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది లియోనా, థియెప్పే ప్రాంతాలకు చెందినవారని స్థానిక పత్రిక 'లే సోలెయిల్' పేర్కొంది. మృతుల సంఖ్యను సెనెగల్ ప్రెస్ ఏజెన్సీ (ఏపీఎస్) 34గా వెల్లడించగా, యాక్షన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫ్రెండ్‌షిప్ సంస్థ ధ్రువీకరించింది.
పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్‌లోని కానరీ దీవులకు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా సాగుతున్న ప్రమాదకర ప్రయాణాల్లో ఇటీవలి కాలంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వలసదారుల హక్కుల సంస్థ 'వాకింగ్ బోర్డర్స్' గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే ఈ మార్గంలో 635 మంది మృత్యువాతపడ్డారు.
మరోవైపు కానరీ దీవుల్లోని ఎల్ హియెర్రోకు వలసదారుల పడవల రాక పెరగడంతో స్పెయిన్ అధికారులు శనివారం అత్యవసర పరిస్థితి ప్రకటించారు. నవంబరు ప్రారంభం నుంచి సుమారు 30 పడవల్లో 3,300 మందికి పైగా అక్కడికి చేరుకున్నట్లు వెల్లడించారు.







కామెంట్‌లు (0)