- నిధుల్లేక సాయం ఆపేస్తున్నాం
- వెల్లడించిన డబ్ల్యుఎఫ్‌పి
న్యూయార్క్ : నిధుల కొరత కారణంగా 5లక్షలమంది గాజా ప్రజలకు నెలవారీ అందే ఆహార, నగదు సాయాన్ని నిలిపివేయనున్నట్లు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచే ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) సోమవారం తెలిపింది. ఈ నెల నుండి తాము సాయమందిస్తున్న ప్రజల సంఖ్యలో ఐదు లక్షల మందిని తగ్గిస్తున్నట్లు డబ్ల్యుఎఫ్‌పి గాజా డైరెక్టర్ షాన్ హగ్స్ మీడియాకు తెలిపారు. కోతలు జరిగిన తర్వాత కూడా సాయం పొందేవారి సంఖ్య దాదాపుగా 11లక్షలుగా వుండనుంది. అంటే గాజాలో దాదాపుగా సగం జనాభా ఇది. డబ్ల్యుఎఫ్‌పి ద్వారా పాలస్తీనియన్లకు ఆహారమో లేదా నగదో సాయంగా అందుతుంది.
డబ్ల్యుఎఫ్‌పి చర్యల వల్ల 5లక్షల మంది గాజన్లు ఆహార సాయం లేకుండా అలమటిస్తారని నినుణులు ఆందోళన చెందుతున్నారు. సుదీర్ఘంగా కొనసాగిన యుద్ధం కారణంగా మూడింట రెండు వంతుల మంది ప్రజలు సంక్షోభ స్థాయిలో ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. ఈ సహాయక చర్యలు నిలకడగా కొనసాగించాలంటే డబ్ల్యుఎఫ్‌పికి 450మిలియన్ల డాలర్లు అవసరమవుతున్నాయి. ఆహార రేషన్లను సగానికి సగం తగ్గించడంతో పాటూ, నగదు సాయాన్ని కూడా 75వేల కుటుంబాలకు కోత విధించారు. అలాగే వంట చేసుకునే పరిస్థితులుకూడా లేకుండా వున్న వారికి భోజనం అందించే సదుపాయం ఇప్పటివరకు కొనసాగింది. ఆ సంఖ్య రెండున్నర లక్షల నుండి లక్షన్నరకి పడిపోయింది. ఈ అన్నసాయం అందుకోవడానికి కూడా వెసులుబాటు లేని సుదూర ప్రాంతాల్లోని వారికి ప్రస్తుతం రెండు రోజులకు ఒకసారి భోజనం దొరుకుతోంది. దాదాపుగా 2లక్షల మంది అత్యవసర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని డబ్ల్యుఎఫ్‌పి తెలిపింది. ‘‘కాల్పుల విరమణ జరిగి కూడా ఏడాది గడిచింది. అయినా ఇప్పటికీ గాజాలో జీవితం అత్యంత దుర్భరంగానే కొనసాగుతోంది. తల దాచుకోవడానికి సరైన అశ్రయం లేదు, మౌలిక వసతులేవీ లేవు, భద్రత అసలే లేదు.’’ అని డబ్ల్యుఎఫ్‌పి తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్ల్ స్కావూ మీడియాతో వ్యాఖ్యానించారు.







కామెంట్లు (0)